pizza
TANTEX Nela Nela Telugu Vennela 105th Sahitya Sadassu
షడ్రుచుల కలయికలా ఉగాది కవి సమ్మేళనం,డా.మృణాలిని అనుపమానమైన వాగ్ధాటితో – టాంటెక్స్ 105 వ సాహిత్య సదస్సు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

29 April 2016
Hyderabad

డాలస్/ఫోర్టువర్త్, టెక్సస్: ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెల నెలా తెలుగు వెన్నెల" 105వ సాహిత్య సదస్సు మరియు ఉగాది కవిసమ్మేళనం ఆదివారం, ఏప్రిల్ 24వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో, ఎంతో ఆసక్తితో విచ్చేసిన భాషాభిమానులు, సాహితీ ప్రియుల సమక్షంలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. కవిసమ్మేళనంతో బాటు "నవల - కథన శిల్పం” అనే అంశంపై డా. సి. మృణాలిని గారు ప్రధానవక్తగా అనుపమానమైన వాగ్ధాటితో సాగించిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

సమన్వయకర్త స్వాగతోపన్యాసం, తదుపరి శ్రీమతి స్వాతి ఆలపించిన “శ్రీ గణనాథం" ప్రార్థనా గీతంతో అవిఙ్ఞంగా మొదలైన దుర్ముఖినామ సంవత్సర కవిసమ్మేళనం లో చిరంజీవి పాలూరి ఇతిహాస్ జొన్నవిత్తుల వ్రాసిన "తెలుగు పద్యముల ప్రసాదం" వినిపించగా, డా. దొడ్ల రమణ “బంధాలు చిరకాలం వుండవు” అనే అంశం మీద తమ స్వీయ రచన పోతన భాగవతం లోని పద్యాలతో పోల్చుతూ వివరించగా, శ్రీ వేముల లెనిన్ శ్రీ శ్రీ "వర్షధార" ని ధారాళంగా పాడగా, శ్రీ మద్దుకూరి చంద్రహాస్ తనకు ఉగాది పై ఉన్న ఇష్టాన్ని "ఉగాది కవిత మమత" స్వీయ రచన ద్వారా పంచుకున్నారు. శ్రీ కాజ సురేష్ తెలుగు అంగ్లము కలిపి వ్రాసిన సీసపద్యమును, తెలుగు నాటక పద్యాల గొప్పతనము తెలియజేయగ, శ్రీ జువ్వాడి రమణ ప్రతి ఉగాది తను వస్తూ ఏదో తెస్తుంది, ఈ ఏడాది ఏమి తెస్తుందో ఎదురు చూడాలి అంటూ ఆశ - హస్యం రెండూ కలిపి చక్కని స్వీయ రచనను వినిపిస్తే, శ్రీ మాడ దయాకర్ స్వీయరచన లో “ఆరు రుతువులు ఉన్నా కాని అకాల వాతావరణాలే” అంటూ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం చేస్తున్న సాహితీ సేవని కొనియాడారు.

నందివాడ ఉదయ భాస్కర్ "దుర్ముఖి రుద్రాక్ష కిళ్ళీ" కవితలో ఇప్పటి రాజకీయాలని తనదైన శైలిలో వినిపించగా, శ్రీ పుదూర్ జగదీశ్వరన్ శ్రీనాథుని పద్యాలను వినిపిస్తూ కవిసమ్మేళనం అనగా నీరుకాకులగుంపు అంటూ నవ్విస్తే, పెనుగొండ ఇస్మాయిల్ తాను మధుబాల పై వ్రాసుకున్న స్వీయకవితను తనకు నచ్చిన మరో రెండు కవితలతో పంచగా, శ్రీమతి పాలూరి సుజన ఎన్నికలపై వ్రాసివినిపించిన స్వీయ రచన ముఖ్య అతిథి మన్ననలను పొందగా, డా. కలవగుంట సుధ సిద్దేంద్రయోగి "భామా కలాపము" లోని అష్టవిధ నాయిక అవస్థలను కళ్ళముందుంచారు. శ్రీమతి మార్తినేని మమత స్వీయరచనలో "సాధించటానికి అత్మవిశ్వాసం ఉంటే చాలు” అన్నారు. భారతదేశం నుంచి వచ్చిన మరొక ప్రొఫెసర్ కస్తూరి హనుమంతరావు గారు మాట్లాడుతూ తెలుగు బాషకి ప్రవాసులు చేస్తున్న సేవని ప్రశంసించారు. శ్రీ మల్లవరపు అనంత్ “సింగుతా స్వీటుగా కోల్డుగా” అని పేరడీ తోపాటు, స్వీయరచన “యువచేతనమూ, వసంతరాగ రాజితమూ, దుర్ముఖినామ సంవత్సరమూ” అంటూ చక్కగా ఆలపించారు. శ్రీ వెంకటేశ్వర చిన్ని, శ్రీ నిమ్మగడ్డ రామక్రిష్ణ, శ్రీ సాజి గోపాల్ తదితరులు పాల్గొని, వివిధ అంశాల మిశ్రమంగా సాగిన కవి సమ్మేళనం ఉగాది పచ్చడిలో షడ్రుచుల కలయికలా శోభాయమానంగా జరిగింది.

డా.సి.మృణాలిని గారు వృత్తిరీత్యా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని తులనాత్మక అధ్యయన శాఖకు అధ్యాపకురాలు మరియు దర్శకురాలు. టి.వి., వార్తాపత్రికలు, పుస్తకాలద్వారా చాలామంది తెలుగువారు అభిమానించే వ్యక్తి. విస్తృత అధ్యయనం, తెలుగు, ఆంగ్ల సాహిత్యాల తులనాత్మక పరిశీలన ఆమెకు చాల ఇష్టమైన వ్యాపకం. పురాణ, ఇతిహాసాలలోని స్త్రీ పాత్రలకి యధాతధమైన అక్షరరూపాన్ని ఇవ్వగలిగిన ప్రజ్గ్ఞాని. వనితా టీవి ద్వారా వినూత్న కార్యక్రమాలను రూపొందించి, తొలినాళ్ళలో జాబులు జవాబులుతో దూరదర్శన్ ప్రేక్షకులను ఆకట్టుకుని, వరల్డ్ స్పేస్ రేడియో ద్వారా తెలుగు సాహిత్య వైభవాన్ని, సినీ పాటల సంగీత సౌరభాన్ని ప్రపంచంలోని తెలుగు వారందరికీ వినిపించిన ఘనతని, ప్రపంచ సభలలో తెలుగు సాహిత్య సాంస్కృతిక గౌరవాన్ని చాటిచెప్పే వకృత్వ పటిమ సొంతం చేసుకున్న డా. మృణాలిని అక్షరాలు తేలికగా జీర్ణమయ్యే ఉగ్గుపాలు.

నవలలో ఏం చెబుతున్నారన్నది వస్తువైతే, ఎలా చెబుతున్నారన్నది శిల్పమవుతుంది. అంటే వస్తువు తప్ప తక్కిన నవలాంగాలన్నీ శిల్పంలో భాగమే. సాధారణంగా తెలుగు విమర్శకులు శైలి, శిల్పం అని ద్వంద్వసమాసంలా వాడుతుంటారు గానీ, నిజానికి శైలి కూడా ఒక రకంగా శిల్పంలో భాగమే కనుక, నవలాశిల్పం అన్న ప్రయోగం చాలా విస్తృతి కలిగింది. వైవిధ్యంతో కూడుకున్నది. విశ్వసాహిత్యంలోని కొన్ని నవలలను రచయితలు కథా వస్తువుని, శైలిని, శిల్పాన్ని మలచిన తీరును ఈ కోణం నుంచి విశ్లేషిస్తూ చక్కని వివరణ ఇచ్చారు. గొపిచంద్, యండమూరి, సులొచన రాణి, రంగనాయకమ్మ, ఓల్గా, అంపశయ్య నవీన్ ఇలా పాత కొత్త అంటూ లేకుండా అన్ని తరాల రచయితలను, నవలా రచనలనూ గుక్కతిప్పుకోకుండా పోల్చుతూ సాగిన ప్రసంగం అందరిని మంత్రముగ్ధులను చేసింది.

సభకు విచ్చేసిన ఆహూతులకు టాంటెక్స్ తెలుగు సాహిత్య వేదిక వారు "ఉప్పు- కారం" తో పచ్చి మామిడి ముక్కలు, దోర జామ కాయలు, చక్కెర పొంగలి, వేడి వేడి గా పునుగులు, పకోడీలు, పులిహోర, పుదీనా రైస్, తేనీరు తో పసందుగా చక్కని అల్పాహారం అందచేసారు.

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉత్తరాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి, సమన్వయ కర్త బిళ్ళా ప్రవీణ్, సాహిత్య వేదిక బృందం, టాంటెక్స్ కార్యవర్గం ముఖ్య అతిధి డా.సి.మృణాలిని గారిని శాలువ మరియు జ్ఞాపిక తో సత్కరించారు. సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ మాట్లాడుతూ డల్లాస్ లో దుర్ముఖినామ సంవత్సరం సందర్భంగా ఇలా కవి సమ్మేళనం జరపడం ఎంతో సంతోషంగా ఉంది అని, అలాగే డా.సి.మృణాలిని గారు చేసిన ప్రసంగానికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు భాషాభిమానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన దేశీ ప్లాజా, రేడియో ఖుషి మరియు ప్రసార మాధ్యమాలైన టి.ఎన్.ఐ., టీవీ5, టీవీ9 లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు. టాంటెక్స్ పాలకమండలి అధిపతి గుర్రం శ్రీనివాస రెడ్డి, సభ్యులు రొడ్డ రామకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యదర్శి వీర్నపు చినసత్యం, కోశాధికారి దండ వెంకట్, తక్షణ పూర్వాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, సభ్యులు పావులూరి వేణుమాధవ్, వనం జ్యోతి, మండిగ శ్రీలక్ష్మి, పాలేటి లక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే సాహిత్యవేదిక సభ్యులు అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, జలసూత్రం చంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

టాంటెక్స్ 105 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు గురించి మార్తినేని మమత సమర్పించిన నివేదిక. 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved