pizza
Tantex Sankranthi Sambaralu 2016
టాంటెక్స్ ఆధ్వర్యంలో డాల్లస్ లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

23 January 2015
Hyderabad

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం అని అర్ధం. సూర్యుడు మకర రాశిలో చేరగానే వచ్చే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకు ఎంతో ఇష్టం.  భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా  జరుగుతుందో వర్ణించడానికి మాటలు చాలవు. అమెరికా లో తెలుగువారు కూడా సంక్రాంతి పండుగను అంతే ఘనంగా జరుపుకొనేలా , అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన టాంటెక్స్ వారు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు.  ఈసారి కూడా సంప్రదాయానికి పెద్ద పీట వేసి , ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేసారు.  

ఈ సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కోరింత్ లేక్ డాలస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన “సంక్రాంతి సంబరాలు” అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2016 అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, మరియు కార్యక్రమ సమన్వయకర్త రఘు గజ్జల ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త జ్యోతి వనం ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యులు సభా ప్రాంగణం అలంకరించారు. స్థానిక పీకాక్ ఇండియన్ రెస్టారెంట్ వారు పండుగ భోజనం వడ్డించారు. సుమారు 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటలకు, తెలుగింటి ఆచారాలను, వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేసిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది. ప్రధాన వ్యాఖ్యాత ప్రణవి ఆద్యతం నవ్వుల జల్లులు కురిపించారు. శివ, రామ,  కృష్ణుని రూపాలతో సినిమా పాటల ప్రదర్శన, అలరులు కురియగ అంటూ సాగే సంప్రదాయక కూచిపూడి నృత్యాలతో  కార్యక్రమాలు ముందుకు కొనసాగాయి. ఎప్పుడూ కొత్తగా చేయాలనే తపనతో, సొంత వాయిద్య బృందంతో, బాలలు బాలికలు కలిసి  ప్రభల శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో సంక్రాంతి పాటల సమాహారం అనే కార్యక్రమం చేశారు, ఇది విశేష ఆదరణ పొందింది. ‘యమునా ఎందుకే నీవు’, అరబిక్ చిన్నారుల నాట్య సమాహారాలు ఆకట్టుకొన్నాయి. సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వాలనే  ఉద్దేశం తో స్థానిక కోరింత్ పోలీస్ సంస్థ నుండి విచ్చేసిన సిబ్బంది, మన ఇళ్ళల్లో దొంగతనాలు జరగకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.  వారిని టాంటెక్స్ పాలకమండలి మరియు కార్యనిర్వాహక సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలుగు రాష్ట్రాలవారికి సుపరిచితుడు "మిమిక్రీ" రమేష్ విచ్చేసిన తెలుగు వారందరిని తన ధ్వననుకరణ విద్యతో ఆశ్చర్యచకితులను చేసారు, తన గాన ప్రతిభతో మెప్పించారు.

టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యకులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ, "క్రిందటి సంవత్సరం తన మదిలో మెదిలిన "ప్రగతి పథంలో పది సూత్రాలు " అనే ఒక ఆలోచన ను అక్షరసత్యం  చేసి చూపించిన కార్యవర్గ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారిద్వారా డల్లాస్ లోనే కాక  ఉత్తర అమెరికా మొత్తంలో విశేష ప్రాచుర్యం పొందిన  స్వరమంజరి కార్యక్రమమే కాక, బాల సుబ్రహ్మణ్యం గారి స్వరాభిషేకం,100 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు ఇలా ఎన్నో ఘన విజయాలు సాధించిన 2015 సంవత్సరానికి అధ్యక్షులుగా ఉండడం తన పూర్వజన్మ సుకృతం" అని తెలిపారు. 

తదుపరి, 2016 వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ తేట తెలుగులో, కొంత హాస్యం మరికొంత విజ్ఞానం కలగలిపి చేసిన ప్రసంగం తెలుగు జాతి ఘన కీర్తిని దిగంతాల వరకు వ్యాపింపచేసింది. ఆయన మాట్లాడుతూ   " టాంటెక్స్ సంస్థ ఈ సంవత్సరంలో 30 వసంతాలు పూర్తి చేసుకొంటోంది దానిని "ముత్యోత్సవం" అంటారు, ముత్యాల్లాంటి కార్యకర్తల సహకారాలతో అమెరికా తెలుగు వారికి సేవ చేసుకొనే అదృష్టం టాంటెక్స్ ద్వారా కలిగింది, టాంటెక్స్ ఘన చరిత్ర కాపాడేలా నిరంతరం శ్రామికుడిలా కష్టపడతాను" అని ప్రమాణం చేసారు. తన అపార అనుభవంతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తాను,భావితరాన్ని మరిన్ని అవకాశాలతో ప్రోత్సహిస్తూ, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ మరియు ఎన్నో విన్నూత్న కార్యక్రమాలతో, మరింత సేవా తత్పరత కలిగిన సంస్థగా టాంటెక్స్ ను తీర్చిదిద్దుతాను అని తెలిపారు. తదనంతరం 2016 పాలక మండలి,  కార్యనిర్వాహక బృందాన్ని, సభకు పరిచయం చేశారు. క్రొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యుడు డా.రాఘవ రెడ్డి , కార్యనిర్వాహక సభ్యులు లోకేష్ నాయుడు, శేఖర్ బ్రహ్మదేవర, ఉమామహేష్  పార్నపల్లి, పద్మశ్రీ తోట, శారద సింగిరెడ్డి లను పరిచయం చేశారు.

టాంటెక్స్ సంస్థకు గత కొన్ని సంవత్సరాలుగా సేవలందించిన కార్యవర్గ సభ్యులైన సునీల్ దేవిరెడ్డి, నీరజ పడిగెల, శశి కనపర్తి లను పుష్పగుచ్చములతో , ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. పాలక మండలి అధిపతిగా పదవీవిరమణ చేసిన అజయ్ రెడ్డి గారికి మరియు 2015 అధ్యక్షుడు  డా. ఊరిమిండి నరసింహారెడ్డి గారికి శాలువా కప్పి, పుష్పగుచ్చములతో, ప్రత్యేక జ్ఞాపికలతో అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ , ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు.

తిరిగి ప్రారంభం అయిన కార్యక్రమాలలో డ్రం బీట్స్, ‘అందమైన జీవితం’ సినిమా నృత్యాల మెడ్లీ, స్వరమంజరి విజేతల గాన ప్రదర్శన , “లీలా కృష్ణ”, “వాన జల్లు” సినిమా నృత్యాల మెడ్లీ, “భారతీయం” శాస్త్రీయ నృత్యం కార్యక్రమాలు హుషారుగా సాగి చక్కని ముగింపుకు చేరుకొన్నాయి.  

ఈ సంక్రాంతి సంబరాలకి ప్రత్యేకంగా విచ్చేసి అందరిని ఎంతో ఆనందపరచిన ముఖ్య అతిథులు మిమిక్రీ రమేష్ ను, RJ ప్రణవిని జ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్చాలతో సన్మానం చేయడం జరిగింది.

2015 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త జ్యోతి వనం తనకు సంవత్సరం పొడుగునా సహకరించిన కార్యకర్తల జట్టుకు కృతజ్ఞతాపూర్వక అభివందనం తెలియజేస్తూ 2016వ సంవత్సరంలో సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టనున్న లక్ష్మి పాలేటి గారిని సభకు పరిచయం చేసారు. తదుపరి 2016 సాంసృతిక బృందాన్ని సభకు పరిచయం చేయడం జరిగింది. వివిధ సాంస్కృతిక అంశాల కొరియోగ్రాఫర్ లని ఈ సందర్భంగా గుర్తించడం జరిగినది.

2015 పోషక దాతల నందరిని సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, డా.ఊరిమిండి నరసింహారెడ్డి మరియు మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు.

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి త్రైమాసిక పత్రిక “తెలుగు వెలుగు” సంక్రాంతి సంచికను, సమన్వయకర్త చినసత్యం వీర్నపు మరియు వారి బృంద సభ్యుల సమక్షంలో, అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్బంగా 2016 “తెలుగు వెలుగు” సమన్వయకర్తగా కృష్ణవేణి శీలంను సభకు పరిచయం చేయడం జరిగినది.

“సంక్రాంతి సంబరాలు” కార్యక్రమ సమన్వయకర్త రఘు గజ్జల, ఎంతో ఓపికగా నాలుగు గంటల వినోదాన్ని ఆస్వాదించిన ప్రేక్షకులకు, అతిథులకు, రుచికరమైన విందు భోజనం వడ్డించిన పీకాక్ రెస్టారెంట్ యాజమాన్యంకు, మరియు నేటి కార్యక్రమ పోషకులకు కృతఙ్ఞతలు తెలియజేశారు. అటు పిమ్మట ఈ కార్యక్రమ ఈవెంట్ స్పాన్సర్స్ డిజికాన్ హోం, డా.రాఘవ రెడ్డి, రఘు గజ్జల, టాంటెక్స్ సంస్థ డైమండ్ పోషక దాతలైన డా. ప్రేమ్ రెడ్డి, నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (NATA), అజయ్ రెడ్డి మరియు ప్లాటినం పోషక దాతలైన బావర్చి బిర్యానీ పాయింట్, మై టాక్స్ ఫైలెర్, బిజినెస్ ఇంటేల్లి సోలుషన్స్, తన్మయి జూవెలర్స్, ఎస్.డి.ఐ.లాజిక్, సేజ్ ఐటి మరియు గోల్డ్ పోషక దాతలైన పారడైస్ బిర్యానీ పాయింట్, పసంద్ రెస్టారెంట్, పాన్ పెప్సికో, హొరైజన్ ట్రావెల్స్, విష్ పాలెపు సి.పి.ఏ, టెక్సాస్ హెల్త్ ఫిజిషయన్స్ గ్రూప్, అనిల్ గారి రియాల్టర్స్ , విక్రం రెడ్డి జంగం అండ్ ఫ్యామిలీ , ధృతి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్, ఈఆర్ పి లాజిక్ మరియు సిల్వర్ పోషక దాతలైన సిం-పర్వతనేని-బ్రౌన్ లా ఆఫీసెస్, ఒమేగా ట్రావెల్ అండ్ టూర్స్, పెన్ సాఫ్ట్ టెక్నాలజీస్, రెలై ట్రస్ట్ మార్ట్ గేజ్, స్త్రేయర్ యూనివర్సిటీ, రెక్స్ ప్రోగ్రామింగ్, ఐఎంసిఎస్ గ్రూప్, ఇంగ్రాన్ స్టోన్స్, పీకాక్ రెస్టారెంట్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియ జేసారు. “గాన సుధ - మన టాంటెక్స్ రేడియో” మస్తిటైంలో ప్రసారం చేయడానికి సంయుక్త సహకారం అందిస్తున్న ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన దేసిప్లాజా, రేడియో ఖుషిలకు మరియు ప్రసారమాధ్యమాలైన టీవీ9, టీవీ5, 6టీవీ, ఐనాటీవీ, తెలుగు వన్ రేడియో (టోరి), ఏక్ నజర్, హమ్ఔరా, సి.వి.ఆర్. న్యూస్, డి.పి.టీవి. లకు కృతఙ్ఞతలు తెలియచేసారు.

ఎలాంటి లాభాపేక్షా లేకుండా తెరవెనుక నుండి సేవలందించిన కార్యకర్తలందరికీ తమ హృదయపూర్వక కృతఙ్ఞతాభివందనాలు తెలియజేసిన పిదప భారతీయ జాతీయ గీతం ఆలాపనతో, అత్యంత శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది.

-టాంటెక్స్ 2016 సంక్రాంతి సంబరాలు కార్యక్రమంపై చంద్ర జలసూత్రం సమర్పించిన నివేదిక

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved