pizza
Tantex Ugadi celebrations 2016 in Dallas
డాలస్ లో జోరుగా హుషారుగా సాగిన టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

21 April 2016
Hyderaba
d

వసంత ఋతువులో వచ్చే మొట్టమొదటి పండుగ , తెలుగు కొత్త సంవత్సరాది అయిన ఉగాది  అంటే ఆనందోత్సాహలకు చెరగని చిరునామా!  ప్రకృతి పచ్చని రంగులతో అందంగా ముస్తాబై వస్తుంటే , కమ్మని కోయిలలు ఆ అందాన్ని వర్ణిస్తూ చక్కగా గానం చేస్తుంటే,  ఆ అనుభూతులు  వర్ణించనలవి కావు.  షడ్రుచుల సమ్మేళనంతో కొత్త సంవత్సరం అంతా ఆనందంగా ఉండాలని ప్రతి  తెలుగు వారు కోరుకొంటారు,  తెలుగు వారి ఆనందం కోసం నిరంతరం శ్రమించే ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) వారు  ఈ సంవత్సర ఉగాది వేడుకలు మరింత శోభాయమానంగా తీర్చిదిద్ది స్థానిక ఇర్వింగ్ హై స్కూల్ లో అత్యద్భుతంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం మరియు కార్యక్రమ సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త పాలేటి లక్ష్మి పర్యవేక్షణలో ఈ ఉగాది ఉత్సవాలు నిరాటంకంగా జరిగాయి.

ఈ కార్యక్రమం రెండు  భాగాలుగా  జరిగింది.  మొదటి భాగంలో స్థానిక కళాకారులు అద్వితీయ ప్రతిభ కనబరిచారు. డా. కలవగుంట సుధ గారు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం ప్రారంభమై, మనకు ప్రాణాధారమైన సూర్యదేవుని కీర్తిస్తూ,  మూషిక వాహన అంటూ  శంకరుని  పరివారం పై చేసిన సంప్రదాయక నృత్యాలతో కార్యక్రమాలు సంస్కృతి సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూ కొనసాగాయి. సంప్రదాయమైన నృత్యాలతో పాటు, సినిమా పాటల సమాహారం ఉంటేనే కదా అసలు సిసలు పండుగ వాతావరణం, అందుకే చక్కని డాన్సు మెడ్లీ లు కూడా ఎంతో ఆకట్టు కొన్నాయి. ఇలా కొన్ని మెడ్లీలు , కొన్ని సంప్రదాయ నృత్యాలతో జోరుగా హుషారుగా కార్యక్రమాలు సాగిపోయాయి.  మజామజా జానపద గీతాలు, జోష్ తో కూడిన డాన్సులు ప్రదర్శించి, ఈ కోలాహలం ఇండియా వరకు వినిపించేంతగా దుమ్మురేపారు స్థానిక కళాకారులు. ఉగాది సందర్భంగా శ్రీ కామేశ్వర శర్మ గారు పంచాంగ శ్రవణం గావించారు .

అనంతరం షడ్రుచుల ఉగాది పచ్చడి, ఘుమఘుమలాడే పసందైన భోజనాన్ని స్థానిక బావర్చిరెస్టారెంట్ వారు అందించి అందరిని సంతృప్తి పరిచారు. భోజన విరామ సమయంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాలను వనం జ్యోతి నిర్వహించారు. టాంటెక్స్ ‘స్పూర్తి’ లో భాగమైన పిల్లలు సాంప్రదాయ వస్త్రధారణతో చేతులు జోడించి నమస్కరిస్తూ అందరిని ఆహ్వానిస్తూ ముచ్చట గొల్పారు. ఈ ఉగాది ఉత్సవాలకు సుమారు 1000 మందికి పైగా తెలుగువారు హాజరు కాగా సుమారు 300 మంది పిల్లలు మరియు పెద్దలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని సందడి చేసారు.

భోజనానంతరం కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రమణ్యం  గారు ప్రసంగిస్తూ నవజీవనబృందావననిర్మాతలు యువత కాబట్టి యువత పురోగతి యే మేము ఈ  సంవత్సరం చేపట్టబోయే పనులలో ప్రధాన బిందువవుతుంది అని చెప్పారు. అలాగే టాంటెక్స్ ముప్పది  వసంతాల పుట్టిన రోజు వేడుకను  ఘనంగా, గుర్తుండిపోయేలా మీ అందరి సహకారం తో జరుపుకుందాం అన్నారు. ఇంటింటికో పువ్వు ఈశ్వరునికో మాల అన్నట్లు మీ  సహాయ  సహకారాలను అందిస్తారని కోరుకుంటున్నామని చెప్పారు. టాంటెక్స్ శాశ్వత భవనానికి ఆమోదం లభించింది కనుక ఇక ఇప్పుడు తగినంత నిధులు సమకూర్చుకోవడం, అందుకు అనువైన స్థలం ఎంపిక చేయడం, ఆ తర్వాత భవననిర్మాణ పనులు మొదలుపెట్టడం చేయవలసిఉన్నది అని తెలియచేసారు. ఇక నాటా కన్వీనర్ మరియు నాటా సభ్యులు మే లో జరగబోయే నాటా కన్వెన్షన్ గురించి వివరించి, తెలుగు వారందరిని హృదయపూర్వకంగా ఆహ్వానించారు.

ఇదంతా ఒక ఎత్తయితే, ఇండియా నుంచి విచ్చేసిన ఇంద్రనీల్, మేఘన లు మంచి నాటిక తో ప్రేక్షకులను అలరించారు. ఇక ఇంద్రనీల్ తన ప్రత్యెక శైలి లో నృత్యాలు ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసారు. గాయకులు ప్రవీణ్, పారిజాత లు పడిన పాటలు ప్రేక్షకులను పరవశింపచేసాయి.

ఉగాదిని పురస్కరించుకొని టాంటెక్స్ 2016 ’ఉగాది పురస్కారాల’ను ఈ సంవత్సరం సాహిత్యం, వైద్య , సామాజిక సేవా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు ప్రకటించారు. తెలుగు సాహిత్య రంగంలో శ్రీ సత్యం మండపాటి గారికి , వైద్యరంగంలో డా. రాఘవేంద్ర ప్రసాద్ గారికి, సంఘసేవ/సామాజిక సంక్షేమ రంగంలో శ్రీమతి పూర్ణ నెహ్రు గారికి ఈ పురస్కారాలను అందచేశారు. అదే విధంగా వివిధ కార్యక్రమాలలో ఎనలేని సేవలను అందిస్తున్న అట్లూరి స్వర్ణ, బసాబత్తిన శ్రీనివాసులు, బొమ్మినేని సతీష్ లను ‘ఉత్తమ స్వచ్ఛంద సేవకుడు (బెస్ట్ వాలంటీర్)’ పురస్కారంతో సత్కరించారు. అలాగే కార్యక్రమానికి విచ్చేసిన అతిధి కళాకారులైన ఇంద్రనీల్, మేఘన, పారిజాత మరియు ప్రవీణ్ లను టాంటెక్స్ కార్యవర్గ బృందం జ్ఞాపికలతో, దుశ్శాలువ తో సత్కరించారు. “వనితావేదిక” బృంద సభ్యుల ఆధ్వర్యంలో, తెలుగు సాంప్రదాయ వస్త్ర ధారణకి నిలువుటద్దంగా నిలిచినవారిని ఎంపిక చేసి, బహుమతులను ప్రదానం చేసి తెలుగుతనానికి వన్నెతెచ్చారు.

వందన సమర్పణ గావిస్తూ, కార్యక్రమ సమన్వయకర్త మండిగ శ్రీలక్ష్మి, డైమండ్, ప్లాటినం, గోల్డ్, సిల్వర్, ఈవెంట్ పోషక దాతలకి, “గాన సుధ - మన టాంటెక్స్ రేడియో” లో ప్రసారం చేయడానికి సంయుక్త సహకారం అందిస్తున్న, ప్రత్యేక ప్రసారమాధ్యమాలైన దేశిప్లాజా, ‘రేడియోఖుషి’ లకు మరియు ప్రసారమాధ్యమాలైన టోరి, tv9, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతలు తెలియచేసారు. టిక్కెట్ల అమ్మకంలో సహాయం చేసిన మైడీల్స్ హబ్.కాం వారికి కృతఙ్ఞతలు తెలియ జేశారు.

ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు మరియు వివిధ నామినేషన్ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన ఈ కార్యక్రమానికి తెర పడినది.

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved