
               
                 
                   | To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] | 
                 
               
                06 November 2014
                 Hyderabad
               అమెరికాలో తెలుగు విద్యార్థులను మోసం చేసిన ట్రైవ్యాలీ యూనివర్సీటీ వ్యవస్థాపకురాలు సుసన్ జియో పింగ్ షుకు అమెరికా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికాలోని ప్లసన్ టన్ లో ట్రైవ్యాలీ యూనివర్సీటీ  స్థాపించి సుశాన్ ఇమిగ్రేషన్ మోసాలతో పాటు ఉన్నత విద్య పేరుతో విద్యార్థులను మోసం చేశారు. ముఖ్యంగా ఇలా మోసపోయినవారిలో అధిక శాతం తెలుగు విద్యార్థులే కావడంతో వారికి న్యాయం చేయాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) పోరాడింది. వైట్ హౌస్ ముందు కూడా తెలుగు విద్యార్ధుల కోసం నిరసన కార్యక్రమాలు చేపట్టింది. 
               ట్రైవ్యాలీ మోసాలను అమెరికా అధికారయంత్రాంగం దృష్టికి తీసుకెళ్లింది. ఎట్టకేలకు ట్రై వ్యాలీ కేసులో న్యాయమే విజయం సాధించింది. తెలుగు విద్యార్థులను మోసం చేసిన పాపానికి  సుసన్ కు 16 ఏళ్ల శిక్ష పడింది. దీంతో పాటు  9 లక్షల డాలర్ల నష్టపరిహారాన్ని విద్యార్థులకు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ట్రైవ్యాలీ యూనివర్సీటీతో సుసన్ మోసం చేసి సంపాదించిన5.6 మిలియన్ డాలర్ల ఆస్తులను కోర్టు జప్తు చేసింది.  తాజా కోర్టు తీర్పు మన తెలుగు విద్యార్థులకు నష్టపరిహారం అందనుంది. ఇక ట్రైవ్యాలీ తరహాలోనే అమెరికాలోని హెర్గున్ యూనివర్సీటీ కూడా మోసాలకు పాల్పడింది. అక్కడ కూడా బలైంది ఎక్కువ తెలుగు విద్యార్థులే. వారి తరపున కూడా నాట్స్ పోరాడింది. వచ్చే నెలలో ఈ కేసు విచారణకు రానుంది. అక్కడ కూడా ఇలాంటి తీర్పే వస్తుందని నాట్స్ భావిస్తోంది.. మొత్తం తెలుగు విద్యార్థులను మోసం చేసిన ట్రైవ్యాలీ యూనివర్సీటీ  యాజమాన్యానికి శిక్ష పడటంపై నాట్స్ హర్షం వ్యక్తం చేసింది.