ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లలో సైబర్ క్రైమ్ ఒకటి. నిత్యం ఏదో ఒక చోట ఎవరో ఒకరు దానికి బాధితులుగా మారడం చూస్తూనే ఉన్నాం. బ్యాంకు ఖాతాల్లో సొమ్మును దొంగిలించడాలు, ఫోటోలు, వీడియోల మార్ఫింగులకు పాల్పడి వాటితో బ్లాక్మెయిల్ కార్యక్రమాలకు పాల్పడడాలు లాంటివి చేస్తూనే చెలరేగిపోతున్నారు సదరు సైబర్ కేటుగాళ్లు. వీళ్ల చేతుల్లో సామాన్యుల నుండి సెలెబ్రిటీల వరకూ మోసపోతూనే ఉన్నారు. ముఖ్యంగా అభంశుభం తెలియని పిల్లలు సైతం ఈ సైబర్ నేరగాళ్ల చేతుల్లో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు వ్యవస్థ ఎప్పటికప్పుడు విజప్తి చేస్తున్నా వీళ్ల ఆగడాలు సాగుతూనే ఉన్నాయి. ఈ నేరస్థులు ఒకవైపు పోలీసుల చేతికి చిక్కుకుంటున్నా, వాళ్ల అరాచకాలు మరోవైపు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ సైబర్ నేరగాళ్లపై యుద్ధంలో భాగంగా ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్ కూడా పోలీసు వ్యవస్థకు తన వంతు సహకారాన్ని అందించారు. అందులో భాగంగా ముంబాయి పోలీసులు చేబట్టిన 'సైబర్ అవేర్ నెస్ మంత్ 2025' కార్యక్రమానికి హాజరై ఈ నేరాల విషయంలో తగు జాగ్రత్తలు సూచించారు. అక్షయ్ కుమార్ మాట్లాడుతూ... " కొన్ని నెలల క్రితం నా ఇంట్లో జరిగిన సంఘటన మీకు చెప్పాలనుకుంటున్నా. నా కూతురు ఒక రోజు ఆన్లైన్లో వీడియో గేమ్ ఆడుకుంటోంది. ఒక అపరిచితుడు నుండి తనకు ఒక మెసేజ్ వచ్చింది. మొదట్లో చాలా గౌరవంగా మాట్లాడాడు. ఆ తరువాత నువ్వు ఎక్కడ ఉంటున్నావని నా కూతురిని అతను అడిగాడు. దానికి నేను ముంబాయిలో ఉంటున్నా అని నా కూతురు చెప్పింది. అలా వాడు గౌరవం నటిస్తూనే నువ్వు ఆడా మగా అని అడగడం జరిగింది. దానికి ప్రతిగా నేను ఫీమేల్ అని నా కూతురు చెప్పింది. అప్పుడు ఆ నేరస్థుడు నా కూతురిని న్యూడ్ ఫోటోలు అడగడంతో నా కూతురు భయపడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసేసి వెంటనే నా భార్యకు చెప్పడం జరిగింది" అంటూ తన ఇంట్లోనే జరిగిన సంఘటన గురించి చెప్తూ సైబర్ నేరగాళ్లు ఎంత ప్రమాదమో వివరించారు. విద్యార్థులకు వీటిపై అవగాహన కల్పించడం కోసం సైబర్ ఎడ్యుకేషన్ ను ఒక బోధనాంశంగా వారంలో ఒకరోజుని కేటాయించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.