ఓ చిన్న సినిమాగా వచ్చినా పెద్ద విజయమే సాధించింది లిటిల్ హార్ట్స్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్లతో పాటూ పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలను కూడా పొందుతుంది. రిలీజ్ రోజు నుండే ప్రేక్షకుల్లో పాజిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమాను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పలువురు సినీ ప్రముఖులు అభినందించడం జరిగింది.
"లిటిల్ హార్ట్స్ చూసినంత సేపూ చాలా హాయిగా సాగిపోయింది. చాలా కాలం తరువాత ఈ సినిమా కారణంగా మనస్పూర్తిగా నవ్వుకున్నాను. అఖిల్, మధు, కాత్యాయని పాత్రలు నా రోజును నవ్వులతో ముంచేశాయి" అంటూ ట్విట్టర్లో ట్వీట్ పెట్టి లిటిల్ హార్ట్స్ చిత్రానికి అభినందనలు తెలిపారు హీరో నాని.
"సినిమా చూసాను. ఏం ప్రూవ్ అయింది.. కంటెంట్ మాత్రమే నిజమైన సూపర్ స్టార్ అని.. కంటెంట్ క్రియేట్ చేయగలిగినవాడే నిజమైన తోపు అని.. కాలం మారింది.. మనం కూడా మారకపోతే.. ఎవరినో బ్లేమ్ చేసుకుంటూ బ్రతకాలి.. లిటిల్ హార్ట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఎంత గ్రిప్పింగ్ గా ఉందంటే ఒక్క అయిదు నిమిషాలు మన మొహం మీద చిరు నవ్వు ప్రక్కకు పోనంత" అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి అభినందనలు తెలిపారు దర్శకుడు సాయి రాజేష్.
'టూరిస్ట్ ఫ్యామిలీ' సినిమాతో అందరి దృష్టినీ ఆకర్షించిన దర్శకుడు అభిషణ్ జీవంత్. ఆయన కూడా ట్విట్టర్ వేదికగా లిటిల్ హార్ట్స్ సినిమాకు అభినందనలు తెలిపారు. "లిటిల్ హార్ట్స్ చూసాను. ఈ సినిమా మీ స్నేహితులు మరియు మీ కుటుంబాలతో కలిసి చూడాల్సిన ఓ నవ్వులు పూయించిన సినిమా" అంటూ ట్విట్టర్ వేదికగా ట్వీట్ పెట్టి తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. 'లిటిల్ హార్ట్స్' సినిమాలో నటులందరూ చాలా బాగా నటించారని, సినిమా ఆద్యంతం నవ్వులను పూయించందంటూ ట్వీట్ పెట్టి ప్రముఖ హీరో రవితేజ కూడా ఈ సినిమాను అభినందించడం జరిగింది.