pizza

Lakshman Karya about Maruthi Nagar Subramanyam
'మారుతి నగర్ సుబ్రమణ్యం' చూసి సుకుమార్ గారు చేసిన ఫోన్, చెప్పిన మాటలు కాన్ఫిడెన్స్, హ్యాపీనెస్ ఇచ్చాయి - దర్శకుడు లక్ష్మణ్ కార్య ఇంటర్వ్యూ

You are at idlebrain.com > news today >

17 August 2024
Hyderabad

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. రావు రమేష్ కథానాయకుడు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ... అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ కార్య మీడియాతో మాట్లాడారు. ఆ ఇంటర్వ్యూ...

లక్ష్మణ్ కార్య గారు... మీ గురించి చెప్పండి!

మాది తిరుపతి. స్నేహితుడికి యాక్టింగ్ అంటే ఇష్టం. అతని కోసం ఫోటో షూట్, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడిని. ఓంకార్ గారి 'జీనియస్' షో కోసం ఆడిషన్స్ విషయం తెలిసి నేను తీసిన షార్ట్ ఫిల్మ్స్, ఫోటోలతో ఫ్రెండ్, నేను హైదరాబాద్ వచ్చాం. నా స్నేహితుడు ఎంపిక అయ్యాడు. ఈ షార్ట్ ఫిలిమ్స్ ఎవరు తీశారని అడిగితే మా ఫ్రెండ్ నా గురించి చెప్పాడు. అలా 'జీనియస్'కు అతను నటుడిగా, నేను సహాయ దర్శకుడిగా చేరాం. ఆ తర్వాత ఊరు వెళ్లి గ్రాడ్యుయేషన్ (బీ ఫార్మ్ సి) పూర్తి చేశా. సినిమాల మీద ఆసక్తితో మళ్లీ హైదరాబాద్ వచ్చా.

సినిమాటోగ్రాఫర్ శ్రీకాంత్ నరోజ్ దగ్గర సహాయకుడిగా చేరా. ఆయన సాయంతో 'ఆటో నగర్ సూర్య'కు దర్శకత్వ శాఖలో చేరాను. ఆ తర్వాత ఓ కథ రెడీ చేశా. అల్లు శిరీష్ గారికి చెప్పాను. ఆయనకు నచ్చింది. కానీ, 'శ్రీరస్తూ శుభమస్తు' మొదలు కావడంతో నా ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది. అప్పుడు 'ఎందుకిలా' వెబ్ సిరీస్‌తో దర్శకుడిని అయ్యా. అందులో సుమంత్ అశ్విన్ గారు హీరో. ఆ సిరీస్ అయ్యాక ఆయన, నిహారిక జంటగా 'హ్యాపీ వెడ్డింగ్' చేశా. దర్శకుడిగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం' నా రెండో సినిమా.

తొలి సినిమాకు, రెండో సినిమాకు గ్యాప్ ఎక్కువ వచ్చింది!

'హ్యాపీ వెడ్డింగ్'లో ఎక్కడ తప్పు జరిగిందో తెలుసుకోవడానికి ఆర్నెల్లు పట్టింది. ఈ సారి తప్పు జరగకూడదని, ఎలాగైనా సక్సెస్ కొట్టాలని ముందు కథ, హీరో క్యారెక్టర్ రాసుకున్నా. అయితే, కరోనా రావడంతో అనుకోకుండా రెండేళ్లు ఖాళీగా ఉన్నాను. ఆ తర్వాత సినిమా స్టార్ట్ చేశాం.

రావు రమేష్ గారిని దృష్టిలో పెట్టుకుని కథ రాశారా?

ముందు కథ రాశాను. ఎవరైతే బావుంటుందని ఆలోచించిన తర్వాత రావు రమేష్ గారు గుర్తుకు వచ్చారు. అప్పటికి 'కెజిఎఫ్', 'పుష్ప' వంటి పాన్ ఇండియా హిట్స్, 'ధమాకా' చేసి ఉన్నారు. ఆయన సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన చేయరేమో అని చాలా మంది చెప్పారు. ఒక్క మీటింగ్ కోసం వెయిట్ చేశా. ఫస్ట్ డైలాగ్ చెప్పిన తర్వాత నవ్వేశారు. 15, 20 నిమిషాల్లో కథ వివరించా. ఓకే చేశారు.

'మారుతి నగర్ సుబ్రమణ్యం' కథకు స్ఫూర్తి ఏంటి? ఏదైనా ఇన్స్పిరేషన్?

ఒక రోజు నా వైఫ్ అకౌంటులో 80 వేలు పడ్డాయి. ఎవరు వేశారో తెలియలేదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వేస్తే ఫోన్ చేస్తారని చూశాం. ఎవరు చేయలేదు. ఆ డబ్బులు ఖర్చు పెట్టాలా? లేదంటే ఏం చేయాలి? అని ఆలోచించింది. తర్వాత స్నేహితులు అందరికీ ఫోనులు చేసింది. మాకు తెలియదంటే మాకు తెలియదని చెప్పారు. రెండు రోజుల తర్వాత క్లారిటీ వచ్చింది. మా అత్తగారు ఫారిన్ లో ఉంటారు. ఆవిడ వేశారని! ఆ రెండు రోజులు ఇంట్లో జరిగిన విషయాలు ఫన్నీగా అనిపించాయి.

ఒకవేళ ఎవరైనా అబ్బాయి అకౌంటులో డబ్బులు పడితే ఖర్చు పెడతారు. పిల్లలు, కుటుంబ బాధ్యతలు ఉన్న మనిషి అకౌంటులో పడితే ఆలోచిస్తాడు. అందుకని కథ రాసుకున్నప్పుడు మిడిల్ ఏజ్డ్ ఫాదర్ అని రాసుకున్నా. రావు రమేష్ గారు ఆ పాత్రలో అద్భుతంగా చేశారు.

అల్లు అరవింద్ గారి మీద డైలాగ్, అల్లు అర్జున్ పాటల స్ఫూర్తితో ఓ సాంగ్ తీశారు. ఆ కథ ఏంటి?

మా సినిమాలో రావు రమేష్ గారు, అంకిత్ కొయ్య తండ్రి కుమారులుగా నటించారు. అంకిత్ కొయ్యకు తానొక గొప్ప ఇంటి బిడ్డను అని, 'అల వైకుంఠపురములో' కాన్సెప్ట్ టైపులో తనను చిన్నప్పుడు మార్చేశారని అనుకుంటాడు. అల్లు అరవింద్ కొడుకు అని అతడి ఫీలింగ్. అల్లు అర్జున్ తన అన్నయ్య అనుకుంటాడు. ప్రేమించిన అమ్మాయిని చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమాల్లో జరిగినట్టు ఊహించుకున్నాడు. ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో బెస్ట్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్ 'మారుతి నగర్ సుబ్రమణ్యం'లో చూస్తారు.

ఇంద్రజ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

మేం ఇంద్రజ గారి క్యారెక్టర్ గురించి ఎక్కువ రివీల్ చేయడం లేదు. సినిమాలో ఆవిడ సర్‌ప్రైజ్ చేరారు. రావు రమేష్ గారి భార్యగా, కళామణి పాత్రలో అద్భుతంగా నటించారు. సినిమాలో ఇంపార్టెంట్ సీన్ ఒకటి ఉంది. ప్రతి రోజూ ఆవిడకు ఆ సీన్ గురించి చెబుతూ వస్తున్నా. షూటింగ్ చేయడానికి కొన్ని నిమిషాల ముందు ఆవిడకు చెబితే క్యాజువల్ గా అటు ఇటు చూశారు. యాక్షన్ చెప్పిన తర్వాత సింగిల్ షాట్‌లో చేసేశారు. ఆవిడ ఫెంటాస్టిక్ పెర్ఫార్మన్స్ చేశారు.

సుకుమార్ వైఫ్ తబిత గారు సినిమాను ప్రజెంట్ చేయడానికి కారణం ఏంటి?

నా వైఫ్, తబిత గారికి కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లిద్దరికీ పరిచయం ఉంది. కానీ, నేను సినిమాలు చేస్తానని తబిత గారికి తెలియదు. సినిమా అంతా అయ్యాక ఓసారి చెప్పమని నా భార్యను అడిగా. తను చెప్పింది. అప్పుడు తబిత గారు, సుకుమార్ గారు పిలిచి మాట్లాడారు. ప్రజల్లోకి వెళ్లేలా ప్రమోషన్ చేయమని చెప్పారు. రావు రమేష్ గారికి 'కెజిఎఫ్', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' గెటప్స్ వేసి వీడియో చేశాం. ప్రేక్షకుల చేత క్యూఆర్ కోడ్ ద్వారా ఫస్ట్ లుక్ విడుదల చేయించాం. సాంగ్స్ కూడా విడుదల చేశాం. ఓ రోజు సుకుమార్ గారే తబిత గారితో సాంగ్ విడుదలైందని, అది బావుందని చెప్పారట. అప్పట్నుంచి ఆవిడ అప్డేట్స్ అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. 'నువ్వు ఏమైనా చేయాలని అనుకుంటే 100 పర్సెంట్ చెయ్' అని చెప్పడంతో సినిమా చూస్తానని అన్నారు.

సుకుమార్ గారు పాన్ ఇండియా డైరెక్టర్. సో, తబిత గారికి భయపడుతూ ప్రివ్యూ వేశా. నేను డోర్ బయట ఉన్నాను. ఒకవేళ ఆవిడకు సినిమా నచ్చకపోతే నాకు సుకుమార్ రైటింగ్స్ సంస్థల్లోకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. అందుకని భయపడ్డా. భయపడుతూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఫస్ట్ కాపీ రెడీ చేసి చూపించా. ప్రివ్యూ స్టార్ట్ అయ్యే ముందు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వమని మా టీంలో ఒకరిని లోపల పెట్టాను. నాకే బయటకు నవ్వులు వినిపించాయి. అప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యా. తబిత గారు సినిమా బావుందని మెచ్చుకున్నారు.

'మారుతి నగర్ సుబ్రమణ్యం'ను మైత్రి సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది కదా! వాళ్లకు సినిమా చూపించారా?

తబిత గారితో మైత్రి శశి గారు వచ్చారు. ఆయనకూ సినిమా నచ్చింది. ఆ తర్వాత నవీన్ ఎర్నేని గారికి, రవిశంకర్ గారికి సినిమా చూపిద్దామని చెప్పారు. వాళ్లకూ నచ్చింది. డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పారు.

సుకుమార్ గారు ఇంకా సినిమా చూడలేదా?

తబిత గారికి ప్రివ్యూ వేసినప్పుడు సుకుమార్ గారికి రావడం కుదరలేదు. అప్పుడే హార్డ్ డిస్క్ సుకుమార్ గారి ఇంటికి పంపించాను. ఖాళీగా ఉన్న సమయంలో చూడమని! ఆయనకు జ్వరం రావడంతో ఓ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఆ రోజు పదకొండు గంటలకు తబిత గారు ఫోన్ చేశారు. ఇవాళ సుకుమార్ గారు సినిమా చూస్తారని! అప్పట్నుంచి ఆయన ఇంటికి రెండు మూడు కిలోమీటర్ల రేడియస్ లో తిరగడం మొదలు పెట్టా. రెండున్నర సమయంలో ఫోన్ వచ్చింది. రావు రమేష్ గారు అద్భుతంగా చేశారని, సినిమా బాగా తీశావని చెప్పారు. మొదట ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత ఏం చెప్పారో నాకు గుర్తు లేదు. నేను ఆనందంలో తేలిపోయా. ఆయన మాటలు నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చాయి. ఆగస్టు 23న ప్రేక్షకులు కూడా సినిమా చూసినప్పుడు అంతే ఆనందంగా నవ్వుతారని ఆశిస్తున్నాను.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved