Maheswara Reddy Mooli about Oh Sukumari
ఓ.! సుకుమారి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. సినిమా అద్భుతంగా వచ్చింది. అందరికీ కనెక్ట్ అయ్యే కొత్త కాన్సెప్ట్‌తో అలరిస్తుంది: నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేజ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఓ.! సుకుమారి'తో అలరించబోతున్నారు. నూతన దర్శకుడు భరత్ దర్శన్ దర్శకత్వంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన తొలి సినిమా 'శివం భజే' తర్వాత ఈ బ్యానర్ లో రూపొందుతన్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. జూలై 17న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
'ఓ..! సుకుమారి' ఎలా ఉండబోతోంది?
ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎమోషన్, కామెడీ, వినోదం అన్నీ సమపాళ్లలో ఉంటాయి. సినిమా చాలా బాగా వచ్చింది.
ఈ సినిమా ఎలా మొదలైంది?
మా డీవోపీ దర్శకుడు భరత్ దర్శన్‌ను పరిచయం చేశారు. ఆయన కథ చెప్పారు. కథ చాలా నచ్చింది. దాదాపు ఏడాది పాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేసిన తర్వాత సినిమా ప్రారంభించాం.
ఈ కథలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?
ఈ సినిమాలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. 'షాక్ కొట్టడం' అనే కాన్సెప్ట్ చుట్టూ వచ్చే వినోదం, భావోద్వేగాలు చాలా కొత్తగా ఉంటాయి. ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయి.
తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌లను ఎంపిక చేయాలనే ఆలోచన ఎవరిది?
కథకు తిరువీర్, ఐశ్వర్య రాజేష్ అయితే బాగా సరిపోతారని అనిపించింది. ఐశ్వర్య రాజేష్ కోసం దాదాపు మూడు నెలలు వెయిట్ చేశాం. ఆమె ఓకే చెప్పిన తర్వాతే షూటింగ్ ప్రారంభించాం. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా విజయం తర్వాత ఆమెతో మాట్లాడాం.
సినిమా గురించి ప్రేక్షకులకు ఏమి చెబుతారు?
ప్రేక్షకులు టికెట్‌కు పెట్టిన ప్రతి రూపాయికి పూర్తి స్థాయి వినోదం పొందుతారు. ఇది ప్రతి కుటుంబం కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.
ఈ సినిమాను థియేటర్లను దృష్టిలో పెట్టుకునే తీశారా?
అవును. నేను మొదట నుంచి డిస్ట్రిబ్యూటర్‌ని. అందుకే థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను రూపొందించాం. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది.
పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి కారణం ఏమిటి?
తిరువీర్‌కు తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ఐశ్వర్య రాజేష్ కోసం తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నాం. మిగతా భాషల్లో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమా కాబట్టి విడుదల చేస్తున్నాం. థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా మరింత విస్తృతమైన ప్రేక్షకులను చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం.
ఈ కథలో ప్రత్యేకత ఏమిటి?
-ఇది అందరికీ కనెక్ట్ అయ్యే యూనిక్ పాయింట్‌తో కూడిన సినిమా. విలేజ్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ దగ్గరగా ఉంటాయి. ఇందులో చూపించిన 'షాక్' సమస్యకు కూడా ఒక లాజిక్ ఉంటుంది. నిజానికి ప్రతి మనిషి శరీరంలో ఎలక్ట్రిక్ ఎనర్జీ ఉంటుంది. అయితే అది ఒక్కొక్కరిలో ఒక్కో స్థాయిలో ఉంటుంది. అదే అంశాన్ని కథలో ఆసక్తికరంగా చూపించాం.
అనుకున్న బడ్జెట్‌లోనే సినిమా పూర్తి చేశారా?
నేనే అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేశాను. ఈ రోజుల్లో ప్రేక్షకులు ప్రతి రూపాయికి విలువ కోరుకుంటున్నారు. అందుకే కాస్టింగ్, నిర్మాణ విలువలు, టెక్నికల్ క్వాలిటీలో ఎక్కడా రాజీ పడలేదు.
జూలై 17న మీ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. పోటీని ఎలా చూస్తున్నారు?
ప్రతి వారం పోటీ ఉంటుంది. చివరికి మంచి సినిమా మాత్రమే ఆడుతుంది. ప్రేక్షకులకు నచ్చితే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.
మీరు కథలను ఎలా ఎంపిక చేస్తారు?
నేను ఏ కథ విన్నా ముందుగా అందులో కొత్తదనం ఉందా లేదా అనేది చూస్తాను. 'శివం భజే'లో ఒక కొత్త పాయింట్ ఉంది. 'ఓ..! సుకుమారి'లో కూడా కొత్త కాన్సెప్ట్ ఉంది. అదే నన్ను ఈ సినిమా చేయడానికి ప్రేరేపించింది.
సంగీతం గురించి?
కీరవాణి గారి అసోసియేట్ భరత్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు భవిష్యత్తులో చాలా మంచి పేరు వస్తుందని నమ్ముతున్నాను.
ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరికైనా చూపించారా?
అవును. కొంతమంది ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లకు చూపించాం. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని, ఎలాంటి టెన్షన్ పడొద్దని చెప్పారు.
మీ తదుపరి ప్రాజెక్టుల గురించి?
-తిరువీర్‌తో మరో సినిమా ప్లాన్ చేస్తున్నాం. అలాగే సత్యదేవ్‌తో కూడా ఒక ప్రాజెక్ట్ వుంటుంది. డిస్ట్రిబ్యూషన్ కూడా కొనసాగిస్తూనే ఉంటాం.