Uday Chauhan about Pallaburusu
నాగార్జున గారు ‘పళ్ళ బురుసు’ చూసి చాలా హార్ట్ టచింగ్‌గా ఉందని చెప్పారు. ‘పళ్ళ బురుసు’లో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్స్ కూడా ఉంటాయి. ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లలో ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు ఉదయ్ చౌహాన
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మీ నేపథ్యం గురించి చెప్పండి? ‘పళ్ళ బురుసు’ ఎలా మొదలైంది? మాది మహబూబ్‌నగర్ జిల్లా. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో డాక్టర్ చదవని చెప్పారు. కానీ సినిమాలపై పాషన్ తో మాస్ కమ్యూనికేషన్ లో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. పుణేలో రెండేళ్లు చదువుకున్నాను. అక్కడ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ముంబైలో యాడ్ ఫిల్మ్స్‌కు అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను.
2016లో హైదరాబాద్‌కు వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇండిపెండెంట్‌గా ఒక సినిమా చేసి ఫెస్టివల్స్‌కు పంపించాను. దాంతో నాకు మరింత నమ్మకం వచ్చింది. అదే సమయంలో డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి అవకాశం వచ్చింది. అక్కడ మూడేళ్లు పనిచేశాను. ఈ కథ రాసుకున్న తర్వాత ఒక మంచి బ్యానర్ కోసం చూస్తున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో కథ చెప్పే అవకాశం వచ్చింది. నాకు ఆ సంస్థ అంటే చాలా అభిమానం. వారు ఎప్పుడూ విలక్షణమైన సినిమాలు నిర్మిస్తుంటారు. సుప్రియా గారికి కథ చెప్పగానే వెంటనే నచ్చింది. అక్కడి నుంచే ‘పళ్ళ బురుసు’ జర్నీ మొదలైంది.
ఈ కథకు మీ స్వస్థలం నుంచి ఎలాంటి స్ఫూర్తి వచ్చింది? -నేను మహబూబ్‌నగర్‌లోనే పుట్టాను. ఊర్లో జరిగే సంఘటనలు, అక్కడి పాత్రలను చాలా జాగ్రత్తగా పరిశీలించేవాడిని. నాకు టౌన్‌లో ఉండడం కంటే ఊర్లో ఉండడం ఇష్టం. అక్కడి ప్రజలు నాపై చూపించే అభిమానం చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఊర్లో చాలా ప్రశాంతత ఉంటుంది. నిజానికి అక్కడ చాలా మంచి కథలు ఉంటాయి. ఆ కథల్లో ఉండే స్వచ్ఛత నాకు చాలా ఇష్టం.
- ‘పళ్ళ బురుసు’లో కూడా చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అదే సమయంలో మనసును హత్తుకునే ఒక సందేశం కూడా ఉంది.
-ఈ సినిమాలో కేవలం ‘పళ్ళ బురుసు’ అనే అంశం మాత్రమే కాదు. చాలా లేయర్స్ ఉన్నాయి. అవన్నీ మీరు థియేటర్‌లో చూస్తారు. ‘పళ్ళ బురుసు’ నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్‌లను ఈ పాత్రలకు ఎంపిక చేయడానికి కారణం? -సుధాకర్ రెడ్డి గారు ‘బలగం’ సినిమాలో నటించారు. అయితే అందులో ఆయన కనిపించేది చాలా తక్కువ సమయం. మురళీధర్ గారికి కూడా డిజే టిల్లు తర్వాత మంచి గుర్తింపు వచ్చింది. బలంగంలో సుధాకర్ గారిని, మురళీధర్ గారిని మామా అల్లుళ్లుగా చూశాం. ఇందులో దానికి పూర్తి భిన్నంగా, నా కథకు సరిపోయేలా తండ్రి, కొడుకు పాత్రల్లో కనిపిస్తారు. వారి కెమిస్ట్రీ తెరపై చాలా అద్భుతంగా ఉంటుంది.
సినిమా షూటింగ్ ఎక్కడ జరిగింది? -సిద్దిపేట లచ్చపేట ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. కథకు సరిపోయే లొకేషన్స్, సీన్స్ అక్కడ చాలా సహజంగా దొరికాయి. ఆ ప్రాంతాల ప్రజలు కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు.
ఈ కథకు ఏదైనా సంఘటన స్ఫూర్తిగా నిలిచిందా? -ఊర్లో చాలా విషయాలు చూశాను. చిన్న చిన్న విషయాల గురించి చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. కాసేపు గొడవపడతారు, ఆ తర్వాత మళ్లీ కలిసిపోతారు. మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలోనే చాలా మంచి కథలు ఉంటాయి. అలాంటి చిన్న సంఘటనను కూడా ఎంత అద్భుతంగా, మనసును హత్తుకునేలా చెప్పొచ్చో ఈ సినిమాలో మీరు చూస్తారు.
నాగార్జున గారు సినిమా చూశారా? -నాగార్జున గారు సినిమా చూసి చాలా హార్ట్ టచింగ్‌గా ఉందని అన్నారు. సినిమా డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్పారు. అదే సమయంలో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయిందని అన్నారు. సజెషన్స్ కూడా ఇచ్చారు. అవి మాకు చాలా హెల్ప్ అయ్యాయి. నాగచైతన్య గారికి కూడా ఈ కథ చెప్పాను. ఆయనకు కూడా చాలా నచ్చింది. త్వరలోనే ఆయన సినిమా చూస్తారు.
మీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ఎలా ఉంటుంది? -నేను ప్రీ-ప్రొడక్షన్‌ను చాలా బాగా చేసుకుంటాను. షూటింగ్‌కు వెళ్లే ముందే స్క్రిప్ట్, ఆర్ట్ వర్క్, లొకేషన్స్ అన్నీ పక్కాగా చూసుకుంటాను. ఒక సన్నివేశానికి ఏం అవసరమో ముందే క్లారిటీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.
‘పళ్ళ బురుసు’ కోసం కేసు పెట్టడం ఏంటి? దానికంటే లాయర్ ఖర్చులే ఎక్కువ కదా అనే లాజిక్ ఉంది కదా? -మీరు అన్నది కరెక్టే. నిజానికి ఇలాంటి క్యూరియాసిటీ రావాలనే నేను అలా రాశాను. ఆ కేసు వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అవన్నీ సినిమాలో చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు.
పవన్ సిహెచ్ సంగీతం గురించి? -పవన్ చాలా టాలెంటెడ్. ‘లవ్ స్టోరీ’ పాటలు విన్న తర్వాత ఆయన పొటెన్షియల్ నాకు మరింత అర్థమైంది. ఈ కథ ఆయనకు చెప్పాను. కథ వినగానే చేస్తానని చెప్పారు. మ్యూజిక్ చాలా అద్భుతంగా వచ్చింది.
-అలాగే సినిమాటోగ్రాఫర్ వినోద్ కూడా చాలా అద్భుతమైన వర్క్ ఇచ్చారు. మేమిద్దరం ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్స్. మా ఇద్దరి ఆలోచనలు కూడా చాలా కలుస్తాయి.
సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? -సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఆ ఊర్లోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది మనసును హత్తుకునే ఎంటర్టైనర్. మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.
-నేను అనుకున్న సమయంలో, అనుకున్న బడ్జెట్‌లో ఈ సినిమా తీశాను. మా నిర్మాతలు హ్యాపీగా ఉండటమే నా మొదటి సక్సెస్‌గా భావిస్తాను.
మీకు ఇష్టమైన దర్శకులు ఎవరు? -చాలామంది ఉన్నారు. సత్యజిత్ రే, అదూర్ గోపాలకృష్ణన్, రాజమౌళి గారి సినిమాలు బాగా ఇష్టపడతాను.
తదుపరి సినిమాల గురించి? -కొత్త సినిమాల గురించి కొన్ని ఐడియాలు ఉన్నాయి. అయితే వాటిపై మరింత వర్క్ చేయాలి. ‘పళ్ళ బురుసు’ రిలీజ్ అయిన తర్వాత వాటిపై పని చేస్తాను.