pizza

Allari Naresh about Ramba Oorvasi Menaka
‘రంభ ఊర్వశి మేనక’ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్. ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే మూవీ. ప్రేక్షకులు ఖచ్చితంగా హ్యాపీగా నవ్వుకుంటారు: హీరో అల్లరి నరేష్

You are at idlebrain.com > news today >

2 September 2026
Hyderabad

అల్లరి నరేష్ ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ ‘రంభ ఊర్వశి మేనక’ తో అలరించబోతున్నారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘రంభ ఊర్వశి మేనక’ కథ ఎలా ఉండబోతుంది?
-సాధారణంగా ఇలాంటి సోషియో ఫాంటసీ కథల్లో మానవులు ఇంద్రలోకం, యముడి వద్దకు వెళ్తుంటారు. కానీ ఇందులో ‘రంభ ఊర్వశి మేనక’ స్వర్గం నుంచి కిందకు వస్తారు. ఇందులో కథానాయకుడికి చిన్నప్పటి నుంచి ఒక డ్రామా కంపెనీ ఉంటుంది.‘రంభ ఊర్వశి మేనక’ను దేవతల్లా పూజిస్తుంటాడు. తనది కష్టపడకుండా హీరో అయిపోవాలనే క్యారెక్టర్. దేవతలు దీవిస్తే నెక్స్ట్ రాజమౌళి సినిమాలో తనే హీరో అనుకునే నమ్మకం ఉంటుంది. తన కుటుంబానికి ముత్తాతల నుంచి వస్తున్న ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒక ప్యాట్రన్ గీస్తే దేవతలు వచ్చి కోరికలు తీరుస్తారని నమ్మకం ఉంటుంది. హీరో ఆ ప్యాట్రన్ ఎలా గీశాడు, రంభ ఊర్వశి మేనక వచ్చిన తర్వాత ఎలాంటి సంఘటనలు జరిగాయనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

దర్శకుడు ఈ కథ చెప్పిన తర్వాత మిమ్మల్ని ఎక్సైటింగ్ చేసిన ఎలిమెంట్స్ ఏమిటి?
-చాలా రోజుల తర్వాత మంచి కామెడీ ఎంటర్‌టైనర్ విన్నట్టుగా అనిపించింది. ప్రేక్షకులు కూడా నా నుంచి ‘కితకితలు’, ‘బెండు అప్పారావు’ లాంటి కామెడీ సినిమాలు మిస్ అవుతున్నారు. అలాంటి కథ గురించి చూస్తున్నప్పుడు దర్శకుడు చంద్ర మోహన్ చెప్పిన ఈ కథ నాతో పాటు నాగార్జున గారికి, సుప్రియ గారికి, రాజేష్ గారికి, నిమ్మకాయల ప్రసాద్ గారికి అందరికీ నచ్చింది. సీజీ వర్క్ పరంగా ఎక్కువ బడ్జెట్ అవుతుందని తెలిసినా మంచి సినిమా అవుతుందని మొదలుపెట్టాం. చంద్ర మోహన్ చాలా మంచి రైటర్ కూడా. ఈ కథని ఆయన చక్కగా రాసుకొని వచ్చారు. అలాగే నందు మంచి డైలాగ్స్ ఇచ్చారు.

ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
-నాది చాలా ఎంటర్టైనింగ్ ఉండే క్యారెక్టర్. అందరి దగ్గర అప్పులు చేసి ఉంటాడు. తనని ఎవరు ఊర్లో నమ్మరు. అందరూ కొంచెం నెగిటివ్‌గా అనుకునే క్యారెక్టర్. తనకి చాలా కష్టాలు వస్తుంటాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

ఇందులో కామెడీ ఎలా ఉండబోతోంది?
-ఆడియన్స్ కామెడీని చూసే విధానం మారింది. నా బడీ లాంగ్వేజ్ సరిపడే కామెడీని డైరెక్టర్ డిజైన్ చేశారు. అలాగే స్వర్గం, నరకం, ఇంద్రలోకం ఇలాంటి కథలు చూసి చాలా కాలం అయింది. కచ్చితంగా ఆడియన్స్, అలాగే చిన్నపిల్లలు చాలా ఎక్సైట్ అవుతారు. చాలా క్లీన్ కామెడీ ఇందులో ఉంటుంది. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఈ సినిమా వుంటుంది. కామెడీ కూడా చాలా ఆర్గానిక్‌గా ఉంటుంది.

వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్స్ గురించి?
-శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్ద నరేష్ గారు కలిసి నాతొ ట్రావెల్ అవుతుంటారు. మా మధ్య కామెడీ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. అలాగే కిషోర్ గారు, అజయ్ గారు, తారక్ పొన్నప్ప చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. అన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంటాయి. ఇది మా నాన్నగారి స్టైల్‌లో చేసిన సినిమా. అంత పెద్ద స్టార్ కాస్ట్ ఇందులో ఉంటుంది. అలాగే తారక్ పొన్నప్ప క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. తను పోలీస్ ఆఫీసర్. ఒక క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌లో కథ జరుగుతూ ఉంటుంది.

-వెన్నెల కిషోర్ గారిది చాలా ఫన్ క్యారెక్టర్. చాలా కొత్తగా ఉంటుంది. ఇంద్రుడు కూడా ఇంగ్లీష్ మాట్లాడే క్యారెక్టర్. మధ్య మధ్యలో హిందీలో కూడా వస్తుంటాయి. ఎందుకంటే దేవుడికి అన్ని భాషలు వస్తాయి కదా. ఆయన వాడే భాష చాలా సినిమాటిక్‌గా ఉంటుంది. సినిమాలో అందరూ మంచి కామెడీ టైమింగ్ ఉన్న యాక్టర్స్‌నే ఉన్నారు. ఫన్ అద్భుతంగా వచ్చింది.

-ఈ సినిమా త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్, హిలేరియస్‌గా ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంది. తప్పకుండా ఆడియన్స్ ఎంటర్‌టైన్ అవుతారు అని నమ్ముతున్నాను.

ట్రైలర్ లో ఓజీ స్పూఫ్ బాగా వైరల్ అయింది కదా?
- ఇందులో నా క్యారెక్టర్‌కి హీరో అవ్వాలని ఉంటుంది. తనకి తెలిసిన భాష సినిమా కాబట్టి ఆ సినిమా భాషల్లోనే మాట్లాడతా ఉంటాడు. సినిమాలో ఓజీ సీక్వెన్స్ వచ్చినప్పుడు చూస్తే పర్ఫెక్ట్‌గా సింక్ అవుతుంది. అది ఎందుకు అనేది సినిమా చూసినప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది.

-ఈ మధ్యకాలంలో ఎక్కువ డార్క్ జోన్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులు లైట్ హార్టెడ్‌గా ఉండే కామెడీ సినిమాలు, ఎంటర్‌టైనర్స్ కోరుకుంటున్నారు. ఇకపై నేను కూడా రెండు కామెడీ సినిమాలు, ఒక సీరియస్ సినిమా.. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాలు చేయాలని భావిస్తున్నాను.

దర్శకత్వం చేయాలని ఆలోచన ఉందా?
-ప్రస్తుతానికి నా దృష్టి మొత్తం నటనపైనే ఉంది. నటుడిగా మంచి విజయవంతమైన చిత్రాలు చేయడం పైన నా దృష్టి ఉంది.

‘సుడిగాడు 2’ సీక్వెల్ గురించి?
-‘సుడిగాడు 2’ చేయాలని నాకూ ఉంది. కాకపోతే ఒకప్పటి పరిస్థితులకి, ఇప్పుడు పరిస్థితులకి చాలా మార్పులు వచ్చాయి. ‘సుడిగాడు’ సినిమాకి దాదాపు 108 స్పూపులు చేశాము. అవన్నీ కూడా ఆ డైరెక్టర్లు, నిర్మాతల పర్మిషన్ తీసుకున్నాం. కాకపోతే ఇప్పుడు కాపీరైట్ ఇష్యూ ఎక్కువగా ఉంది. రిలీజ్ సమయంలో ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చెప్తారో, ఎలాంటి కాపీరైట్ ఇష్యూ వస్తుందో అనేది మన చేతిలో ఉండదు. అందుకే చేసేటప్పుడు ఇవన్నీ విషయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇప్పటి యంగ్ డైరెక్టర్స్‌లో ఎవరితో సినిమా చేయాలని ఉంది?
-నాకు రితేష్ రానా స్టైల్ చాలా నచ్చింది. ‘మత్తు వదలరా’ సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన కథల్లో చాలా డీటెయిల్‌గా ఉంటుంది. కాంటెంపరరీగా ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అన్నీ కూడా చాలా ఎంటర్టైనింగ్‌గా తీసుకొస్తారు. అలాగే తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్స్‌తో కూడా పనిచేయాలని ఉంది.

‘మహర్షి’ తర్వాత మీ నుంచి ఎక్కువగా మల్టీస్టారర్స్ రాలేదనిపిస్తుంది?
-శంభో శివ శంభో నుంచి మల్టీస్టారర్ కథలలో చేస్తున్నాను. అలాంటి మంచి కథలతో దర్శకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను. ‘మహర్షి’ తర్వాత నా సామి రంగా’లో నాగార్జున గారే నా పేరుని సూచించారు. ఆ సినిమా చేశాను. మంచి కథలు వస్తే మల్టీస్టారర్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.

చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ గురించి?
తనతో ఫస్ట్ టైమ్ ఈ సినిమా చేస్తున్నాను. తను మంచి ట్రెండ్‌లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో నాకు సురభి కి ఒక సాంగ్ ఉంది. ఆ పాట నాకు చాలా నచ్చింది. అలాగే ఇందులో మిగతా నాలుగు పాటలు కూడా ఆకట్టుకునే పాటలు ఇచ్చాడు. ఈ సినిమాలో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా ఉంటుంది.

ఈ సినిమా గురించి ఆడియన్స్‌కి ఏం చెప్తారు?
-మొన్నటి వరకు సీరియస్ ఫిలిమ్స్ చేశాను. ఇది మాత్రం చాలా మంచి కామెడీ ఎంటర్‌టైనర్. ఇది చాలా లైట్ హార్టెడ్ ఫిలిం. రెండున్నర గంటలు హాయిగా నవ్వుకుంటూ వెళ్ళండి.

కొత్త సినిమాల గురించి?
‘ఆల్కహాల్’ రిలీజ్ రెడీగా ఉంది. అలాగే ‘కనకదుర్గ’ షూటింగ్ జరుగుతోంది.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved