Sing Geetham Pre Release Event
'సింగ్ గీతం' నేను నిర్మించి ఉంటే బాగుండేదనిపించే చిత్రం. నాగ్ అశ్విన్ చేస్తే నేను నిర్మించినట్లే. గొప్ప ప్యాషన్‌తో ఈ చిత్రాన్ని నిర్మించిన వైజయంతి మూవీస్‌కు నా అభినందనలు: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్
లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ 'సింగ్ గీతం' తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రతిష్టాత్మక బ్యానర్లు వైజయంతి మూవీస్, స్వప్న సినిమా పై నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపుడి ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే విడుదలైన 'సింగ్ గీతం' టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘సింగ్ గీతం’ జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యూనివర్సల్ స్టార్ కమల్ హసన్ ముఖ్య అతిధిగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మాయాబజార్ నుంచి ఇప్పటి సింగ్ గీతం వరకు సింగీతం శ్రీనివాసరావు గారిలో ఎలాంటి మార్పు లేదు. సినిమా ఆయనతో పాటే ఉంది. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆయనతో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ఆయన సినిమాకి నిర్మాతగా, సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాను. నా ఉద్దేశం ఆయనతో కలిసి పనిచేయడమే. చాలా ఏళ్ల క్రితం ఆయన నాకు రెండు కథలు చెప్పారు. అందులో ఒకటి పుష్పక విమానం సినిమాగా వచ్చింది. ఇప్పుడు రెండో కథ సింగ్ గీతం సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆ కథ విన్నాను. ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఆ సినిమాను చూడబోతున్నాను. కొన్ని ఆలోచనలు, కొన్ని కథలు టైమ్‌లెస్‌గా ఉంటాయి. సింగీతం గారి కథలు కూడా అలాంటివే. అవి ఏజ్‌లెస్‌గా ఉంటాయి. సింగీతం గారి పేరును చాలామంది ‘సంగీతం’ అని పలుకుతుంటారు. కానీ ఈ సినిమాతో ఆ కన్ఫ్యూజన్ ఉండదు. ఇకపై అందరూ ‘సింగీతం’ అనే పిలుస్తారు. ఆయన పేరులోనే సంగీతం ఉంది. కల్కి సినిమాను హాట్ స్టూడియోలో షూట్ చేశాం. కానీ పుష్పక విమానం సినిమాను ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఏసీ లోచేశాం. ‘పూర్తి సినిమాను ఎయిర్ కండిషన్‌లో తీశాము’ అని గర్వంగా చెప్పుకుంటాం (నవ్వుతూ). అలాగే ఆయనతో కలిసి చేసిన ముంబై ఎక్స్‌ప్రెస్ సినిమాను కూడా మేము ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. సింగీతం గారు ఇప్పటికి జెన్జీ కంటే ముందుంటారు. ఆయనను ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ ఆయనకు సహాయ దర్శకుడిగా ఉండడానికి నేను ఇష్టపడతాను. స్వప్న గారికి, వైజయంతి మూవీస్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. సినిమా అనేది ప్యాషన్‌తో చేయాల్సిన పని. అలాంటి ప్యాషన్‌తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమా ప్యాషన్‌తో తీస్తే ఊహించని విజయాన్ని అందిస్తుంది. పుష్పక విమానం అందుకు మంచి ఉదాహరణ. సింగీతం గారి నుంచి మనం ఆ ప్యాషన్ నేర్చుకోవాలి. ఏ సినిమా విజయం సాధిస్తుందో, సాధించదో ఎవరూ ముందుగా చెప్పలేరు. కానీ సినిమా పూర్తయ్యే సరికి మనం సంతోషంగా ఉన్నామా లేదా అనేది మాత్రం తెలుస్తుంది. పుష్పక విమానం, ముంబై ఎక్స్‌ప్రెస్, అపూర్వ సోదరులు వంటి చిత్రాలు మంచి స్పిరిట్‌తో తెరకెక్కాయి. అలాంటి స్పిరిట్‌తో వస్తున్న సినిమా సింగ్ గీతం. ఈ సినిమాను నేనే నిర్మించిన భావన కలుగుతోంది. నేను సహ నిర్మాతగా ఉన్నాననే భావన వస్తోంది. అది నాగీకి తెలుసు. సింగీతం గారి పట్ల నాకు ఎప్పటికీ గౌరవం ఉంటుంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ నిర్మించి ఉంటే బాగుండేదని అనిపించే చిత్రాల్లో ఇది ఒకటి. ఈ వేడుకకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. మూడు నెలల క్రితమే చెప్పి ఉంటే నేను కూడా యూనిట్‌లో భాగమైపోయేవాడిని. ఆ అవకాశాన్ని కోల్పోయాను (నవ్వుతూ). కానీ సింగీతం గారిపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయనతో కలిసి పనిచేసే మరో అవకాశం తప్పకుండా వస్తుందని నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్యూ.”
దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఈ చిత్రం 40 సంవత్సరాల కల. మాటలే పాటలైతే అనే ఆలోచనతో ఈ కథ పుట్టింది. ఈ కథను ఎంతోమందికి వినిపించాను. కానీ దైవ నిర్ణయం వల్ల చివరకు వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఈ సినిమా రూపుదిద్దుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు దర్శకత్వం నాదే. కానీ సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని బాధ్యతలను వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్ ఎంతో ప్రేమతో భుజాన వేసుకున్నారు. నాగ్ అశ్విన్ ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు. అలాంటి ఆయన ఈ సినిమాను నిర్మించడానికి ముందుకు రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సినిమా కంటే నన్నే ఎక్కువ ప్రేమించారు. ఎంతో గౌరవంతో, అభిమానంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సంబంధించిన క్రెడిట్ నాగ్ అశ్విన్‌కే దక్కుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ కథ యొక్క ఆత్మను అద్భుతంగా పట్టుకున్నారు. ఆయన తప్ప ఈ సినిమాకు ఇంత అద్భుతమైన సంగీతం ఇంకెవరూ అందించలేరని నేను నమ్ముతున్నాను. నాగ్ అశ్విన్ నాకు ఎంతో గౌరవం ఇచ్చారు. ఒక తండ్రిలా చూసుకున్నారు. ఆయన చూపించిన ప్రేమ, ఆప్యాయత, ఆదరణకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అశ్వినీ దత్ గారికి, నాగ్ అశ్విన్‌కు, దేవిశ్రీ ప్రసాద్‌కు, అలాగే నాకు ఎంతో ప్రియమైన కమల్ హాసన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కమల్ హాసన్ గారు ఈ వేడుకకు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆయనతో నాకు ఎంతో ఆత్మీయమైన అనుబంధం ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.
దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. కమల్ హాసన్ గారికి, సింగీతం గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. కమల్ హాసన్ గారు ఈరోజు తన జీవితంలోని అనుభవాలను మాతో పంచుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది ఒక మైలురాయి లాంటి అనుభవం. ఆయన ప్యాషన్ గురించి చెప్పిన విషయాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా అనిపించాయి. అశ్వినీ దత్ గారు అద్భుతమైన చిత్రాలు తీశారు. ఆయన్ని ఒక మాటలో వర్ణించడం చాలా కష్టం. అయితే ఆయన గురించి చెప్పాలంటే జగదేక వీరుడు అతిలోక సుందరి ఒక్క సినిమా చాలు. అలాగే సింగీతం గారి గురించి చెప్పాలంటే పుష్పక విమానం ఒక్కటే సరిపోతుంది. ఈ ముగ్గురిలో ఒక కామన్ క్వాలిటీ ఉంది. సంగీతానికి వారు ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. సింగ్ గీతం సినిమాకు నేను సంగీతం అందించడం ఒక బ్లెస్సింగ్‌గా భావిస్తున్నాను. ఈ సినిమాకు అద్భుతమైన రైటింగ్ టీమ్ ఉంది. సింగీతం గారితో ఈ కథ గురించి చర్చిస్తున్నప్పుడు మేము ఎంతో ఆనందాన్ని అనుభవించాం. సింగీతం గారు చేసిన ప్రయోగాలు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. ఆయన ఇప్పటికీ ఒక చిన్న పిల్లాడిలా మాట్లాడుతారు. అదే ఆయనలో ఉన్న గొప్ప లక్షణం. ఇలాంటి సినిమా చేయాలని నాకు ఎప్పటినుంచో కోరిక. ఆ కోరిక సింగీతం గారి వల్ల ఈ సినిమాతో నెరవేరింది. చిన్నప్పటి నుంచి వార్తాపత్రికల్లో ఉన్న కథనాలను కూడా సంగీతంలా మార్చుకోవడం నాకు అలవాటు. ఆ అలవాటు ఈ సినిమాకు చాలా ఉపయోగపడింది. ఇలాంటి అవకాశాలు జీవితంలో ఒక్కసారి మాత్రమే వస్తాయి. సినిమాలో ప్రతి మాట పాటలా వినిపించాలనే ఆలోచన చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఆ మాట ఈరోజు పాటగా మారింది. అదే మా ఎక్సైట్మెంట్‌కు కారణమైంది. నేను చెప్పిన క్రేజీ ఐడియాలన్నింటికీ ఎంతో సపోర్ట్ చేసిన నాగి గారికి థ్యాంక్స్. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్‌కు పేరుపేరునా ధన్యవాదాలు. నటీనటులందరూ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన వారందరూ తమ సొంత గొంతులతోనే పాడారు. ఈ సినిమా కోసం మా టీమ్ మొత్తం ఎంతో కష్టపడి పనిచేసింది. వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు ఒక కొత్త, విభిన్నమైన అనుభూతిని అందిస్తుంది.
నిర్మాత అశ్వినీ దత్ మాట్లాడుతూ... కమల్ హాసన్ గారికి, సింగీతం శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సుమారు 26 సంవత్సరాల క్రితం సింగీతం గారితో ఒక సినిమా ప్రారంభించాం. అయితే కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇప్పుడు నాగ్ అశ్విన్, స్వప్న, ప్రియాంక అందరూ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను చేస్తున్నారని తెలిసినప్పుడు నాకు ఎంతో గర్వంగా అనిపించింది. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.
శాలిని కొండెపుడి మాట్లాడుతూ... సింగీతం శ్రీనివాసరావు గారు, కమల్ హాసన్ గారు తెలుగు సినిమాకు గర్వకారణం. క్రియేటివ్‌గా కొత్త తరహా సినిమాలు చేయడానికి, తీయడానికి బెంచ్‌మార్క్ సృష్టించిన ఫిల్మ్‌మేకర్స్ వారు. ఇంతమంది లెజెండ్స్ ఉన్న ఈ వేడుకలో పాల్గొని మాట్లాడటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సింగ్ గీతం సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ థ్యాంక్యూ సో మచ్.”
ఆయాన్ మాట్లాడుతూ...అందరికీ నమస్కారం. ఈ సినిమాలో నన్ను ప్రతాప్ పాత్ర కోసం ఎంపిక చేసిన సింగీతం గారికి, వైజయంతి మూవీస్‌కు, నాగ్ అశ్విన్ గారికి ధన్యవాదాలు. సింగ్ గీతం లాంటి గొప్ప బహుమతిని మాకు అందించిన సింగీతం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నేను సింగీతం శ్రీనివాసరావు గారి హీరోనని చెప్పుకోవడం జీవితాంతం గర్వంగా భావిస్తాను. కమల్ హాసన్ గారు ఒక లెజెండ్. ఆయనే మాకు స్ఫూర్తి. దేవిశ్రీ ప్రసాద్ గారు మా సినిమాకు సంగీతం అందించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఈ చిత్రానికి ఎంతో కొత్త తరహా సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
అహల్యా బమ్రూ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఇంతమంది లెజెండ్స్‌తో కలిసి ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సింగీతం గారితో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. కమల్ హాసన్ గారు పాల్గొంటున్న ఈ వేడుకలో నేను కూడా భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. నాగ్ అశ్విన్ గారు ముందుకొచ్చి మాలాంటి కొత్తవారికి అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. స్వప్న సినిమా, వైజయంతి మూవీస్‌కు కృతజ్ఞతలు. వారి వల్లే మా కల నెరవేరింది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.