pizza

Thella Kaagitham Success Meet
స్క్రీన్‌పై రోషన్ ఏడుస్తుంటే నా కళ్లల్లో నీళ్లొచ్చాయి.. తెల్ల కాగితం సక్సెస్‌ మీట్‌లో బెక్కం వేణుగోపాల్ ఎమోషనల్

You are at idlebrain.com > news today >

03 October 2026
Hyderabad

శ్రీమతి కె.శ్రీదేవి సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మాలపాటి నిర్మించిన సినిమా ‘తెల్లకాగితం’. హర్ష్ రోషన్, నక్షత్ర జంటగా నటించగా.. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు నందు సవిరిగాన అందిచారు. ఈ మూవీకి రమేష్ బండ్రెడ్డి దర్శకత్వం వహించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.

ఈ సందర్భంగా హీరో హర్ష్ రోషన్ మాట్లాడుతూ.. "ప్రేక్షక దేవుళ్లందరికీ చాలా చాలా థాంక్స్. ఒక మంచి సినిమా తీస్తే ఇంత ప్రేమని ఇస్తారని మళ్లీ ప్రూవ్ చేశారు. ప్రీమియర్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని ప్యూర్ సోల్స్ కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందో అదే 'తెల్లకాగితం'. ఎంతో ఇష్టపడి చేశాం ఈ సినిమా. మేము థియేటర్ విజిట్స్ వెళ్లినప్పుడు రెస్పాన్స్ కూడా మామూలుగా లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్లు, ఫ్యామిలీస్ కూడా వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉంది. థాంక్యూ కృష్ణ గారు, డైరెక్టర్ రమేష్‌, రైటర్ నందు అన్న, అజయ్ అన్న. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ అన్నతో ఇది మూడో సినిమా. మేమిద్దరం కలిసిన ప్రతిసారి ఇంత మంచి ఆల్బమ్ ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌ని స్క్రీన్‌ప్లేలా చూపించిన మా డీవోపీ కేవీ గుహన్ సర్ గారికి, అలాగే ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ గారికి కూడా చాలా థాంక్స్. ఇంకా ఎవరైనా చూడని వాళ్లు ఉంటే తప్పకుండా వెళ్లి 'తెల్లకాగితం' సినిమాను థియేటర్లలో చూడండి. మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.." అని అన్నారు.

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ.. "తెల్లకాగితం సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. ఇంత బ్యూటిఫుల్ రెస్పాన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నన్ను అందరూ నక్షత్ర కన్నా 'ఆశా, ఆశా' అనే పిలుస్తున్నారు. ఆశని ఫ్యామిలీస్, అమ్మాయిలందరూ, పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఓన్ చేసుకున్నారు. అజయ్ గారిని ఫస్ట్ చూసి నిజంగానే భయపడ్డాను. ఆయన మాటలు కూడా నాకు ఇంకా బాగా చేయగలననే నమ్మకాన్ని ఇచ్చాయి. మా డీవోపీ గుహన్ గారు సెట్‌లో చాలా హెల్ప్ చేశారు. మా డైరెక్టర్ గారు ఎన్నో విషయాలు నేర్పించారు. రోషన్‌తో సెట్‌లో చాలా ఫన్నీగా, సరదాగా నవ్వుకుంటూ గడిచిపోయింది. దీపక్, శ్రావ్య.. మీ అందరి వల్లే సెట్‌లో ఏమాత్రం నెర్వస్ లేకుండా సంతోషంగా చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు సూపర్ ఆల్బమ్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ వల్లే నేను చేసిన సీన్స్ చూసుకుని నేనే మూడు నాలుగు సార్లు ఏడ్చేశాను. మా ప్రొడ్యూసర్ గారికి కూడా చాలా థాంక్స్. ఆయన కూడా నన్ను చిన్నపిల్లలా చూసుకునేవారు. ఫ్యామిలీస్ అందరూ థియేటర్లకు వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.." అని అన్నారు.

దర్శకుడు రమేష్ బండ్రెడ్డి మాట్లాడుతూ.. "సినిమాకు ఇంత సూపర్ రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. మొన్న నైట్ షో పడిన కాన్నుంచి కాల్స్ వస్తూనే ఉన్నాయి. నిన్న మార్నింగ్ కె.రాఘవేంద్రరావు గారు సినిమా చూసి ఫోన్ చేశారు. నేను షాక్ అయ్యాను, 'ఏం నిజంగానే కె. రాఘవేంద్రరావు గారా?' అని అడిగితే 'అవునమ్మా, బాగుంది సినిమా. లొకేషన్స్ గానీ, అందరూ కూడా బాగా చేశారమ్మా. మీరందరూ కొత్తోళ్లు అయ్యుండి ఇంత పెద్ద మెసేజ్ సినిమా తీయడం చాలా హ్యాపీ అనిపించింది' అన్నారు. అందరూ అసలు మంచి సినిమా తీసావన్నా అని రాత్రి 2 ఓ క్లాక్‌కి కూడా సెకండ్ షో అయిపోయాక.. 'సినిమా అంతా మైండ్‌లోనే ఉందంట, నిద్రపోవట్లేదన్నా... ఏం సినిమా తీసావ్' అని ఫోన్ చేస్తున్నారు. థాంక్యూ సో మచ్ అండి తెలుగు ఆడియన్స్ అందరికీ..! ఒక మంచి సినిమా తీస్తే ఇంత రెస్పాన్స్ వస్తదా అని మళ్లీ నిరూపించారు. అజయ్ సార్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. ఇంకా మా కృష్ణ గారి గురించి చెప్పాలి. ఎక్కువ మాట్లాడరు.. కానీ చాలా ఎక్కువ వర్క్ చేస్తారు. మాకన్నా, అందరికన్నా ఎక్కువ ఆయనే వర్క్ చేస్తారు. బడ్జెట్ గురించి గానీ దేని గురించి గానీ ఆలోచించకుండా చేశారు. మా ప్రొడక్షన్ టీమ్ అంతా కూడా చాలా బాగా చేశారు. సినిమా అంతా చూశాక ఎమోషనల్ అయి ఏడుస్తూ.. 'ఫ్యామిలీలు కూడా చూడాల్సిన సినిమా ఇది' అని నిన్న మేము థియేటర్ విజిటింగ్‌కి వెళ్లినప్పుడు చెప్పారు. యూత్, ఫ్యామిలీ అందరూ సినిమాను చూడండి.." అని అన్నారు.

నటుడు అజయ్ మాట్లాడుతూ.. "ఆడియన్స్‌కి థాంక్స్.. బ్రహ్మాండమైన హిట్ ఇచ్చారు. నిన్న ప్రీమియర్‌తో స్టార్ట్ అయిన కలెక్షన్స్ గ్రాడ్యువల్‌గా ఇంప్రూవ్ అయ్యాయి. హైదరాబాద్ గానీ అన్ని సెంటర్స్ కూడా నిన్న నైట్‌కి అన్నీ ఫుల్స్ పడిపోయాయి. ఈరోజు నుంచి అసలు ఆడియన్స్ ఎవరైతే టార్గెట్ ఆడియన్స్ ఉంటారో.. మొత్తం ఆ టెన్త్ క్లాస్, ఇంటర్మీడియట్ బ్యాచ్ వస్తే అసలు ఈ సినిమా రేంజ్ ఏంటి అనేది క్లారిటీగా తెలుస్తుంది. రోషన్, నక్షత్ర, రమేష్, నందు వీళ్లతో పనిచేసి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మూవీలో నా పెర్ఫార్మెన్స్ ఏదైనా ఉంటే డైరెక్టర్ రమేష్, రైటర్ నందుకే క్రెడిట్ దక్కుతుంది. మొత్తం టీమ్ అంతా పర్ఫెక్ట్‌గా ఒక ఇంట్లో పనిచేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో అనేది 'తెల్ల కాగితం'. నాకు కృష్ణ గారితో 15-20 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను.. అందరికి థాంక్స్.." అని చెప్పారు.

నటి శ్రావ్య మాట్లాడుతూ.. "తెల్లకాగితం సినిమాలో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్‌తో, రమేష్ గారి సపోర్ట్‌తో ఈ సినిమాలో పార్ట్ అయ్యాను. నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రిలీజ్ అయింది. అసలు ఇన్ని రోజులు ట్రావెల్ చేస్తామని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మేమంతా ఒక ఫ్యామిలీ అయిపోయాం. అందరూ మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వస్తున్న రెస్పాన్స్‌కి చాలా హ్యాపీగా ఉంది. మా 'తెల్లకాగితం' సినిమాని హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లందరికీ థాంక్యూ సో మచ్..! ఇంకా మంచి మంచి స్టోరీస్ చేసి కచ్చితంగా మీ ముందుకు వస్తాను. ప్రొడ్యూసర్ గారికి, నందు గారికి, రమేష్ గారికి థాంక్స్. అజయ్ సార్. 'మీ హైట్ చూసి భయమేస్తుంది కానీ మీతో మాట్లాడాక రిలీఫ్ వచ్చింది' అని. అందరికీ ధన్యవాదాలు.." అని అన్నారు.

ప్రొడ్యూసర్ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. "కృష్ణన్న నాకు వెరీ క్లోజ్. ఇది నా సొంత ప్రొడక్షన్ హౌస్ లాగానే.. నేను ఎన్నో లవ్ స్టోరీస్ చూశాను, ఎన్నో లవ్ స్టోరీస్ తీశాను, ఎన్నో సక్సెస్‌లు కొట్టాను, కానీ అప్పుడప్పుడు కొన్ని 'కొత్త బంగారు లోకం' లాంటి సూపర్ హిట్ సినిమాలు వస్తుంటాయి. అలాంటి ఒక హిట్ సినిమా 'తెల్లకాగితం'. అన్ని ఏరియాల నుంచి, ఓవర్సీస్ నుంచి షో షోకి కలెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు థియేటర్‌కి వచ్చి సినిమాని సూపర్ హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ధైర్యం చేసి, నందు చెప్పిన కథను ఒప్పుకుని ముందుకు వచ్చి సినిమా తీసినందుకు కృష్ణ గారికి కంగ్రాట్స్. ఒక మంచి మూవీని ఇండస్ట్రీకి అందించారు. అలాగే డైరెక్టర్ ఆ కథను నమ్మి నాలుగైదేళ్లు ట్రావెల్ చేసి, పట్టుదలతో తెరపైకి తీసుకొచ్చారు. రోషన్ నాకు ఫ్యామిలీ లాంటివాడు. చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా తెలుసు. సినిమాలో తను ఏడుస్తుంటే నా కళ్లల్లో నీళ్లు వచ్చాయి. హీరోయిన్ నక్షత్రను చూస్తుంటే అసలు ఫస్ట్ సినిమా లాగానే లేదు. ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ వరకు కథకు ఏం కావాలో చాలా నేచురల్‌గా నటించింది. అలాగే ఈ సినిమాని నమ్మి కొన్న ఈటీవీ విన్ సాయి గారికి, ఈటీవీ టీమ్ అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఇలాంటి సినిమాలను సపోర్ట్ చేస్తే గొప్ప సినిమాలు వస్తాయి. సినిమాని కొన్న డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మీడియా అంతా ఈ సినిమాని ఇంకా చాలా దూరం, చాలా గట్టిగా తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.." అని అన్నారు.

రైటర్ నందు సవరిగాన మాట్లాడుతూ.. "ఈ సినిమాని ఆదరించిన అందరికీ థాంక్స్. ఇది ఒక జెన్యూన్ ఫిల్మ్. మొన్న నైట్ నుంచి నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. ఫోన్ కాల్స్ ద్వారా ఇక్కడ సక్సెస్ అనేది ఎలా డిసైడ్ చేస్తారు. ఒక షో అయ్యాక ఫోన్లు వచ్చాయంటే అది సక్సెస్ అని, ఫోన్ మోగట్లేదంటే అది సక్సెస్ కాదని.. ప్రతి షో తర్వాత నాకు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సినిమా జనాల్లోకి మెల్లగా వెళుతుంది. ఎందుకంటే మా వెనక ఎవరూ పెద్ద స్టార్స్ లేరు.. సినిమాయే ఈ స్టార్..! సినిమా జనాలే ఈ సినిమాని తీసుకెళ్తున్నారు. చూసినవాళ్లందరూ 'ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్‌గా ఉంది.. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ సూపర్బ్' అని చెప్పి ఏడ్చుకుంటూ బయటికి వస్తున్నారు. ఒక బ్యూటీఫుల్ మెసేజ్ చెప్పాం. ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నా.." అని అన్నారు.

 



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved