pizza

Nani about The Paradise
'ది ప్యారడైజ్' ప్రేక్షకుల అంచనాలని అందుకుంటుంది. మాస్, యాక్షన్ థియేటర్ అదిరిపోయేలా ఉంటుంది.న్యాచురల్ స్టార్ నాని

You are at idlebrain.com > news today >

20 September 2026
Hyderabad

న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, టీజర్ అద్భుతమైన రెస్పాన్స్‌తో భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా న్యాచురల్ స్టార్ నాని విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

సెప్టెంబర్ మీకు బాగా కలిసి వచ్చింది కదా?
-నా కెరీర్ స్టార్ట్ అయిందే సెప్టెంబర్ లో. ‘అష్టా చమ్మా’ సెప్టెంబర్‌లోనే రిలీజ్ అయింది. ‘భలే భలే మగాడివోయ్’ కూడా సెప్టెంబర్‌లోనే వచ్చింది. ఇప్పుడు ఆ హిట్ సెంటిమెంట్ ‘ప్యారడైజ్’కి వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నాను.

జడల్ క్యారెక్టర్ గురించి చెప్పగానే మీకు ఏమనిపించింది?
-కథలో నుంచి వచ్చిన లుక్ అది. నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇప్పటివరకు నేను చేసిన పాత్రలు అన్నీ బాగా రిలేటబుల్‌గా, తెలిసిన ఒక పర్సన్ లాంటి ఫీలింగ్ వచ్చే రోల్స్. ఇందులో క్యారెక్టర్ మాత్రం జనరల్ సొసైటీలో పెరిగిన వ్యక్తి కాదు. అది ఏంటి అనేది మీరు సినిమా చూస్తున్నప్పుడు అర్థం అవుతుంది. ఆ క్యారెక్టర్‌కి బిగినింగ్ నుంచే ఒక మ్యాడ్‌నెస్ ఉంటుంది. ఆ క్యారెక్టర్‌ని ఆడియన్స్ ఒక షాక్ వాల్యుతో చూస్తారు. నిజానికి తెలుగులోనే ఇలాంటి క్యారెక్టర్ చాలా కొత్త. నా మీద ఆ క్యారెక్టర్ ఇంకా ఫ్రెష్‌గా ఉంటుంది.

మీ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కదా.. ఈ సినిమా ఎలా ఉంటుంది?
-ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూసే సినిమా ఇది. మదర్-సన్ ఎమోషన్ అద్భుతంగా ఉంటుంది. ఒక కమర్షియల్ సినిమా నుంచి ఏమైతే ఆశిస్తారో అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీస్ అందరూ కలిసి హ్యాపీగా చూడొచ్చు.

అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉండబోతుంది?
మేము ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ చేశాం. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో హోల్డ్ చేసి పట్టుకెళ్లే అవకాశం ఈ సినిమాతో వచ్చింది. వందకి రెండింతలు చేశాడు. శ్రీకాంత్-అనిరుధ్ కిల్లర్ కాంబినేషన్. వాళ్ల వల్లే ‘ఆయా షేర్’, ‘ఏషు నాగుల కట్ట’ లాంటి సాంగ్స్ సాధ్యమయ్యాయి.

మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి?
శ్రీకాంత్ కథ చెప్పినప్పుడే మోహన్ బాబు గారు అయితే బాగుంటుంది అని అన్నాడు. కాకపోతే ఆయన ఈ క్యారెక్టర్ చేస్తారా లేదా అనేది నాకు డౌట్. ఎందుకంటే చాలా నెగిటివ్, బ్రూటల్ క్యారెక్టర్. శ్రీకాంత్ కథ చెప్పడానికి మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్లాడు. ఆయన చాలా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయ్యారు. అది చూసి నేను షాక్ అయ్యాను. ఈ కథ విన్నప్పుడే ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్మిన మొదటి వ్యక్తి మోహన్ బాబు గారు. ఇందులో విలన్‌గా ఆయన చేసే కొన్ని పనులు ఉంటాయి. అవన్నీ చూసి ఆడియన్స్ కచ్చితంగా షాక్ అవుతారు.

పాన్ ఇండియా ప్రమోషన్స్ గురించి?
ఈ సినిమా కంటెంట్ అన్ని ప్రాంతాల్లో రీచ్ అయ్యి ఉంది. చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు. తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ప్రేక్షకులు ఎంతో ప్రేమను ఇస్తున్నారు. అందుకే డబ్బింగ్ విషయంలో అస్సలు రాజీపడను. వాళ్లు ఇచ్చే ప్రేమకు మనమిచ్చే కనీస గౌరవం అది. చాలా అద్భుతమైన క్వాలిటీతో అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది.

మీ సినిమాల్లో ఎక్కువ యాక్షన్ ఉన్న సినిమా ఇదే కదా?
సినిమాల్లో యాక్షన్ కథలో భాగంగా ఎక్కడో ఒక మూమెంట్‌లాగా వచ్చింది. యాక్షన్‌గా ప్రొజెక్ట్ చేసేలా ఉండేది కాదు. కాకపోతే ఒక నటుడుగా అన్ని రకాలు ఎక్స్‌ప్లోర్ చేయాలి. మంచి యాక్షన్ సినిమా చేద్దామంటే నేను పెద్ద ఆసక్తి చూపించను. ఒక మంచి కథ చెప్పి అందులో యాక్షన్ ఉంటే ఇష్టపడతాను. ‘ప్యారడైజ్’ కథలోనే యాక్షన్ ఉంది. అందులో ప్రతి యాక్షన్ కూడా ఒక ఎమోషన్‌తో మొదలవుతుంది. ప్రతి దెబ్బ వెనక ఒక ఎమోషన్ ఉంటుంది.

మీరు కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చాలా ఎక్కువగా డ్యాన్స్ చేశారు కదా?
శ్రీకాంత్ దృష్టిలో నేను పెద్ద డ్యాన్సర్‌ని (నవ్వుతూ). నివ్వు డ్యాన్స్ చేస్తే మస్తు ఉంటది అన్న అని చెప్తుంటాడు. నేను డ్యాన్స్ చేస్తుంటే చాలా ఎంజాయ్ చేస్తాడు. శ్రీకాంత్ కోసం చేయాలనుకున్నాను. తన నమ్మకం నిజమైంది. పాటలు రిలీజ్ అయిన తర్వాత అందరూ సర్‌ప్రైజ్ అయ్యారు. చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నారు. నేను ఎంజాయ్ చేశాను. ఇందులో రెండు పాటలు డ్యాన్స్ కూడా సినిమా నుంచి దూరంగా వెళ్లి చేసినట్టుగా ఉండదు. అది సిట్యువేషన్‌గా ఉంటుంది. ఇందులో మరో పాట రాబోతుంది. ‘ఆయా షేర్’, ‘ఏషు నాగుల’ కంటే ముందే నా కారులో, ఫోన్‌లో లూప్‌లో ప్లే అయిన సాంగ్ ‘అంజనా అంజనీ’. బ్యూటిఫుల్ సాంగ్ అది. త్వరలోనే రిలీజ్ అవుతుంది.

మదర్ సెంటిమెంట్ గురించి?
మా గ్లింప్స్‌ని రిలీజ్ చేసినప్పుడు ఒక తల్లి తన కొడుకు గురించి చెప్పే కథగా మొదలు పెట్టాము. టీజర్‌లో కూడా మెయిన్ ఎలిమెంట్ మదర్ మీదే కట్ చేశాము. సినిమా మొదలయ్యేదే మదర్ ఎమోషన్‌తో, మదర్‌తో ఎండ్ అవుతుంది. ఆ ఎమోషన్ మనసులో నిలిచిపోతుంది. అది మీకు హ్యాంగోవర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. మూడు, నాలుగు రోజులు ‘ప్యారడైజ్’ మీ మైండ్ నుంచి వెళ్లదు.

‘ప్యారడైజ్’ అనేది ప్లేస్ గురించి?
‘ప్యారడైజ్’ అనే ప్లేస్‌లో సవారి అనే ఒక ట్రైబ్‌కు సంబంధించిన కథ ఇది. అక్కడ సవారీలకు గుర్తింపు లేదు. వాళ్ల ఉనికిని కూడా ఎవరు పట్టించుకోరు. వాళ్లని చంపేసినా సరే కేసు కూడా పెట్టరు. ఐడెంటిటీ కోసం చేసిన ఒక తిరుగుబాటు. 1984-85 టైమ్‌లైన్ మధ్య ఉంటుంది. ‘సలార్’, ‘కేజీఎఫ్’ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ ప్రాంతాలు ఉన్నాయా లేదా అనేది పక్కన పెడితే అక్కడ చూపించిన వరల్డ్‌కి మనం రిలేట్ అవుతాం. ఇందులో ఉన్న ‘ప్యారడైజ్’ కూడా అలాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. అలా రిలేట్ చేసుకునే ఫీలింగ్ ఇస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు ప్యారడైజ్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ప్యారడైజ్ ప్రపంచంలో లీనమైపోతారు.

శ్రీకాంత్ ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది?
శ్రీకాంత్ ఒక ఆడియన్‌గా మాస్ కమర్షియల్ మూమెంట్స్‌ని ఎంజాయ్ చేస్తాడు. తను ఏం చేసినా సరే తెలియకుండానే థియేటర్‌లో ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందనే చూస్తాడు. మానిటర్లు చూస్తున్నప్పుడు థియేటర్‌లో దీనికి రియాక్షన్ వస్తుందనిపించినప్పుడే టేక్ ఓకే చేస్తాడు. ఏదైనా సీన్ బాగా వచ్చిన రోజు నా దగ్గరికి వచ్చి ‘థియేటర్ ఊగిపోద్దన్న’ అంటాడు. అది తన నమ్మకం. తను మాస్‌ని ఒక దైవంలాగా భావిస్తాడు. శ్రీకాంత్ నరనరాల్లో మాస్ ఉంది. ఆ మాస్ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతుంది.

ఇందులో ఒక రెండు ఎపిసోడ్లు చాలా రాడికల్‌గా తీశాడు. నా ఫేవరెట్ ఎపిసోడ్స్. ఆడియన్స్ చూసి చాలా సర్‌ప్రైజ్, షాక్ అవుతారు.

ఇందులో చాలా రిస్కీ షాట్లు కూడా మీరే స్వయంగా చేశారు.. దానివల్ల మీకు గాయాలు కూడా అయ్యాయి అని విన్నాం?
నాకు ఇష్టం, ఓపిక ఉన్నాయి. అన్ని నేనే స్వయంగా చేశాను. ఇంకో 15 ఇయర్స్ తర్వాత డూప్‌కి అప్పచెప్తానేమో (నవ్వుతూ). డూప్ చేస్తే నేను ఎంజాయ్ చేయలేను. అది నా ప్రాబ్లం. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అందరికీ చెప్తాను సినిమాలో లెగ్ షాట్ అయినా, హ్యాండ్ కనిపించే షాట్ అయినా నేనే స్వయంగా చేస్తా. స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ‘అబ్బా.. ఇది డూప్ షాట్’ అని అనిపిస్తే ఆ కాంప్లిమెంట్‌ను నేను జెన్యూన్‌గా తీసుకోలేను.

జడలతో నటించడం ఎలా అనిపించింది?
అందరూ ఆ లుక్ చూసి సర్‌ప్రైజ్ అయ్యారు. ఇందులో ప్రతి డీటెయిల్‌కి ఒక కారణం ఉంటుంది. ఇందులో మీరు చూస్తుంది సవారీల బొట్టు. ఎవరినైనా బలవంతంగా తీసుకెళ్లి టాటూ వేస్తే వాడు సవారీ అయిపోయినట్టే. అలాగే ముక్కుపుడక, చైను అన్నిటికీ ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. మేకప్ వేసుకోవడానికి గంట నలభై నిమిషాలు పడుతుంది. మళ్లీ మేకప్ తీయడానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. కొన్నిసార్లు ఏకధాటిగా 36 గంటల పాటు షూట్ చేశాం. లోపల స్కాల్ప్ అంతా రెడ్‌గా మారిపోయేది.

-‘ప్యారడైజ్’ నా కెరీర్‌లో మోస్ట్ ఛాలెంజింగ్ యాక్షన్ బ్లాక్స్ ఉన్న సినిమా. ఫ్యూచర్‌లో కూడా ఇదే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ యాక్షన్ చేస్తానేమో కానీ ఇంతకంటే ఎక్కువ కష్టపడను. ఎందుకంటే ఈ జడల వల్ల. ఈ జడలతో యాక్షన్ చేయడం అనేది ఎంత సమస్యగా ఉంటుందో ఊహించలేం. ఈ సినిమా మొత్తం చాలా రోప్ వర్క్ ఉంటుంది. యాక్షన్ చేస్తున్నప్పుడు జడ రోప్‌కి చుట్టుకునేది. నా కష్టం చూసి ఫైట్ మాస్టర్లు ఈ కష్టం అసలు ఎలా భరిస్తున్నారని నా మీద చాలా జాలి పడ్డారు.

రాఘవ్ క్యారెక్టర్ గురించి?
ఇందులో తన బాడీ లాంగ్వేజ్ చాలా లైట్ హార్టెడ్‌గా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి చాలా బ్రూటల్‌గా ఉంటాడు. ఇందులో రాఘవ్‌కి సంబంధించిన మూమెంట్ థియేటర్‌లో చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే సంపూ బిర్యాని పాత్ర కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.

హీరోయిన్ క్యారెక్టర్ గురించి?
ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా సాలిడ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ స్టోరీ ఆర్క్ చాలా ఇంపార్టెంట్. అది చాలా సర్‌ప్రైజింగ్ రోల్.

మీ అబ్బాయి జున్ను రియాక్షన్ ఏంటి?
తను ప్రస్తుతం ‘ప్యారడైజ్’ పాటలే వింటున్నాడు. వినాయక చవితికి ‘ఏషు నాగుల’ పాటని పెర్ఫార్మ్ కూడా చేశాడు.

ఈ జడల్ క్యారెక్టర్‌లో మీ అమ్మగారు చూసినప్పుడు వారి ఫీలింగ్?
మా అమ్మగారికి నేను ఎంత వైలెంట్ సినిమాలు చేయడం ఇష్టం లేదు. ‘జులాయి’ సినిమాలో లాగా కొంచెం పువ్వులు, అమ్మాయిలు స్టైల్‌లో హ్యాపీ సినిమాలు చేయమని చెప్తుంది (నవ్వుతూ).

ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో నిర్మాత ఎలా ఉన్నారు?
అవుట్‌పుట్ విషయంలో, బిజినెస్ విషయంలో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకున్న సమయంలో రిలీజ్ చేయడానికి అందరం ఒత్తిడి తీసుకున్నాం. అందరూ 24 గంటల పాటు పనిచేశారు. ఇప్పటికే సినిమా ఒకటి రెండు సార్లు వాయిదా పడాల్సి వచ్చింది. ఈసారి అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలని, క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఇవ్వాలని మేము అందరం అహర్నిశలు పని చేశాం.

డైరెక్టర్ శ్రీకాంత్ టైమ్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించి మీరు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు కదా.. దానివల్ల కెరీర్ ఎఫెక్ట్ అవుతుందా?
ఏం ఎఫెక్ట్ ఉండదు. సుకుమార్ గారికి ‘పుష్ప’ డిలే అయినంత మాత్రాన కెరీర్ ఎఫెక్ట్ అయిందా? క్వాలిటీ ప్రొడక్ట్ డెలివర్ చేయనప్పుడే కెరీర్ దెబ్బతింటుంది తప్ప, డిలే వల్ల కాదు. క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడంలో శ్రీకాంత్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడంలో డిలే అయితే అది కెరీర్‌కి ఏం నష్టం ఉండదు. రిజల్ట్ మాత్రమే కెరీర్‌ని డిసైడ్ చేస్తుంది.

ఇందులో ఎవరితో యాక్షన్ చేయడానికి ఎక్కువ ఎంజాయ్ చేశారు?
ఇందులో యాక్షన్ చూడడానికి ఎంజాయ్‌గా ఉంటుంది కానీ చేయడానికి మాత్రం అంత ఎంజాయ్ కాదు (నవ్వుతూ). ప్రతి రోజు బురదో, వర్షమో ఏదో ఒక దాంట్లోకి తీసుకెళ్లి పడేసేవాడు శ్రీకాంత్. అది స్క్రీన్ మీద చూడండి బాగుంటుంది. కానీ చేయడానికి కాదు (నవ్వుతూ).

కీర్తి సురేష్ గారి సాంగ్ చేయడం ఎలా అనిపించింది?
మేము ఆల్రెడీ కలిసి పని చేశాము. ఇప్పుడు మరొకసారి పని చేయడం ఒక రీయూనియన్‌లా అనిపించింది.

-సోనాలి గారు మదర్ క్యారెక్టర్‌లో అద్భుతంగా చేశారు. ఇందులో హీరో ఎంత కష్టపడతాడో తల్లి పాత్ర కూడా అంత కష్టం పెట్టారు. వర్షాల్లో, బురదలో ఇలా రకరకాల చోట్ల తను ఎక్కడా కంప్లైంట్ చేయకుండా, కావాల్సినంత టైం కేటాయించి కోపరేట్ చేశారు. ఈ సినిమాకి తన బెస్ట్ ఛాయిస్. తనకు చాలా మంచి ప్రశంసలు వస్తాయి.

-ఇందులో నైట్‌లో జరిగిన యాక్షన్ సీక్రెట్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. శ్రీకాంత్ ఫైట్‌ని కూడా ఒక సీన్‌లాగా రాశాడు. ప్రతి విజువల్ ఇంపాక్ట్ ఇచ్చుకునేలా డిజైన్ చేశాడు.

-ప్రేక్షకులు చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో థియేటర్‌కి వస్తున్నారు. వాళ్లందరికీ సాటిస్ఫాక్షన్ చేస్తామనే నమ్మకం మా టీం అందరికీ ఉంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved