అనంతపురం జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు మరియు గుత్తి పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ సురేష్ పాటిల్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు వెంటనే స్పందించారు.
తన తల్లిగారు శ్రీమతి పద్మజ గారి సహకారంతో హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులతో మాట్లాడించి, శ్రీ సురేష్ పాటిల్ గారికి అత్యుత్తమ వైద్యం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ విజయవంతంగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడమే కాకుండా, చికిత్స సమయంలో ఆయనకు, కుటుంబ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆసుపత్రిలో అవసరమైన అన్ని ఏర్పాట్లను సమకూర్చారు.
అంతేకాకుండా, చికిత్సకు అయ్యే పూర్తి వైద్య ఖర్చును స్వయంగా ఆయనే భరించి, శ్రీ సురేష్ పాటిల్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ అండగా నిలిచారు.
అభిమానులకు అండగా ఉండటంలో వరుణ్ తేజ్ గారికి ఇది కొత్త విషయం కాదు. ఇటీవల అనంతపురానికి చెందిన ఓ అభిమాని మరణించిన సందర్భంగా కూడా, ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి గారి సేవా భావాన్ని స్ఫూర్తిగా తీసుకున్న వరుణ్ తేజ్ గారు, అవసరమైన సమయంలో ముందుండి సహాయం చేస్తూ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. చిరంజీవి గారి నుంచి అందుకున్న మానవత్వం, సేవా దృక్పథాన్ని ఆచరణలో చూపిస్తూ అభిమానుల హృదయాలను మరోసారి గెలుచుకున్నారు.