సియాటిల్ తెలుగువారందరినీ ఒక వేదికపైకు తీసుకురావటమే ధ్యేయంగా ఏర్పడిన వాషింగ్టన్ తెలుగు సమితి (WATS) ఆధ్వర్యంలో దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వాట్స్ కార్యవర్గ సభ్యులు భాస్కర్ గంగిపాముల, రాం కొట్టి, అను గోపాళం, షకీల్ పొగాకు, శ్రీధర్ దండాపంతుల, అనిల్ పన్నాల, దేవేందర్ నరహరి ముందస్తు ప్రణాలికతో అన్ని కార్యక్రమాలు సవ్యంగా జరిగేలాగ ఏర్పాట్లు చేసారు. పంచాంగ శ్రవణంతో మొదలిపెట్టి, 5 గంటల పాటు జరిగిన కార్యక్రమంలో 160 మంది పిల్లలు మరియు పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాశ్చాత్య మరియు శాస్య్రీయ నృత్యగానాలతొ అందరినీ అలరించారు. 800 మంది పైగా విచ్చేసిన ఈ కార్యక్రమానికి సినీ దర్శకులు వి.ఎన్. ఆదిత్య గారు, సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ గారు, ఉత్తేజ్ గారు, హాస్య నటులు హరీష్ గారు, సినీ గాయని నూతన మోహన్, పాడుతా తీయగా ఫేం సందీప్ కూరపాటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అతిధులందరికీ స్వాగత్ రెస్టారంట్ వారు పసందైన విందు భోజనం సమకూర్చారు. భోజన విరామ సమయంలో హుషారైన పాటలతో చేసిన ఫ్లాష్ మోబ్ అందరినీ అలరించింది. భోజన విరామం అనంతరం గాయకులు నూతన మరియు సందీప్ హుషారైన పాటలతో ఆహుతులందరిని ఉత్సాహపరిచారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంతో వేదికపైకి ఎక్కి నాట్యం చేసారు. 100 మందికిపైగా కార్యకర్తలు ప్రారంభం నుండి ముగింపు వరకు కార్యక్రమం సజావుగా సాగిపోటానికి ఎంతగానో కృషి చేసారు. ఎంతో కన్నులపండుగగా జరిగిన ఉగాది వేడుకలకు సహకరించిన స్పాన్సర్స్ కి, మరియు కార్యకర్తలకి వాట్స్ కార్యవర్గం తరుపున ధన్యవాదాలు