pizza
Agnyaathavaasi music launch
`అజ్ఞాత‌వాసి` ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

19 December 2017
Hyderaba
d

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `అజ్ఞాతవాసి`. శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టించారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. బిగ్ సీడీ, ఆడియో సీడీల‌ను ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ అవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా..

నేను నిరాశ, నిస్స‌హృల్లో ఉన్న‌ప్పుడు నా హితులు, స‌న్నిహితులు, స్నేహితులు ఎవ‌రు నాతో నిల‌బ‌డ‌లేదు.
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్
మాట్లాడుతూ - ``అభిమానించే ప్ర‌తి ఒక్క‌ర్ని గుండెల్లో పెట్టుకోవాలనేంత హృద‌య‌ముంది కానీ శ‌రీరం చిన్న‌దే. నేను సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఇంత అభిమానాన్ని సంపాదిస్తాన‌ని ఏనాడు అనుకోలేదు. నా వ‌ల్ల స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే చిన్న పని చేస్తే చాలున‌ని చిన్న‌ప్ప‌ట్నుంచి అనుకునేవాడిని. సినిమాల ద్వారా అంద‌రికీ చేరువ‌య్యాను. నావ‌ల్ల వీలైనంత మంచిని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ముంద‌కు తీసుకెళ్ల‌డానికి ఫ్లాట్‌పాం ఇచ్చిన సినీ క‌ళామ‌త‌ల్లికి నా పాదాబివంద‌నం. ఎన్ని సినిమాలు చేస్తావ‌ని నేను సినిమాల్లోకి వ‌చ్చిన‌ప్పుడు అడిగితే ప‌ది, ప‌న్నెండు సినిమాలు మాత్ర‌మే చేయ‌గ‌ల‌న‌ని అనిపించింది. ఖుషీ త‌ర్వాత ఐదారు సినిమాలు చేసి మానేయాల‌ని అనుకున్నాను. దానికి కార‌ణం, నాకు దేశం చాలా గొప్ప‌ది. కానీ ప్రేక్ష‌కుల ప్రేమ ప‌న్నెండు కాదు, పాతిక సినిమాలు చేసేలా ప్రోత్స‌హించింది. నేను ఓట‌మికి ఎప్పుడూ భ‌య‌ప‌డ‌లేదు. అలాగే గెలుపుకు కూడా పొంగిపోలేదు. మ‌నం చేసే ప‌ని ఎప్పుడూ మ‌న‌కు అసూయ ద్వేషాల‌ను ఇస్తుంది. ఇలాంటి అసూయ ద్వేషాల మ‌ధ్య సినిమాలు చేయాలా అని ఆలోచించేవాడిని. అలాంటి సమ‌యంలో జానీ సినిమా ఫెయిల్ అయిన త‌ర్వాత‌, నాకేం అనిపించ‌లేదు. కానీ నా చుట్టు ప‌క్క‌ల వారికి అలాంటి ఓట‌ములతో త‌ల‌కొట్టేసినట్టు ఫీల‌య్యారు. దాంతో నాకు వైరాగ్యం వ‌చ్చింది. దాని వ‌ల్ల నాకు నేనుగా ఓ గోడ క‌ట్టేసుకున్నాను. కానీ ద‌గ్గ‌రి వాళ్ల‌తో స‌హా నేను చేయూత‌నిచ్చిన వారు నాకు అండ‌గా ఎప్పుడూ నిల‌బ‌డ‌లేదు. కానీ అభిమానులు అండ‌గా నిల‌బ‌డ్డారు. అభిమానుల ప్రేమ‌, అభిమానమే కార‌ణం. అటువంటి అభిమానుల కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది. భారత‌దేశ జెండా అంటే నాకు ఎంతో ఇష్టం. ఆ జెండాను చూసిన‌ప్పుడ‌ల్లా నా గుండె ఉప్పొగుతుంది. ఆ జెండా కోస‌మే నేను రాజ‌కీయాల్లోకి వెళ్లానే త‌ప్ప వేరే ఉద్దేశం లేదు. నా అంతిమ ల‌క్ష్యం..శ‌క్తి, వ‌య‌సు ఉండ‌గానే స‌మాజానికి ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డాలి. నేను కాలం తాలూకా శ‌క్తిని బాగా న‌మ్ముతాను. నేను నిమిత్త‌మాత్రుడ్ని అని నాకు తెలుసు. నేను నిరాశ, నిస్స‌హృల్లో ఉన్న‌ప్పుడు నా హితులు, స‌న్నిహితులు, స్నేహితులు ఎవ‌రు నాతో నిల‌బ‌డ‌లేదు. అలాంటి స‌మ‌యంలో ఎప్పుడో గోకులంలో సీత స‌మ‌యంలో అసిస్టెంట్ రైట‌ర్‌గా ఉన్న‌త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అండ‌గా నిల‌బ‌డ్డాడు. సినిమా స‌క్సెస్ స‌మ‌యంలో, గెలుపులో మ‌న చుట్టూ మ‌నుషులుంటారు. కానీ ఓట‌మి స‌మ‌యంలోఎవ‌రూ మ‌న ప‌క్క‌నుండ‌రు. కానీ అభిమానులు న‌న్నెప్పుడూ విడిచిపెట్ట‌లేదు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో నేను చేసిన జ‌ల్సా, స‌క్సెస్‌ను నేను గుర్తించ‌డానికి నాకు నాలుగేళ్లు ప‌ట్టింది. త్రివిక్ర‌మ్ మీకు స‌ల‌హాలిస్తార‌ని చాలా మంది అంటుంటారు. మేం దిగువ మ‌ధ్య త‌ర‌గతి కుటుంబాల నుండి ఇద్ద‌రం వ‌చ్చాం. నేను లేక‌పోతే ఆయ‌న లేరా? న‌్యూక్లియ‌ర్ సైన్స్ చదువుకున్న వ్య‌క్తి. గొప్ప ర‌చ‌యిత‌. నాలాంటి వాడి అవ‌స‌రం ఆయ‌న‌కేముంది. ఆయ‌న‌లాంటి సృజ‌నాత్మ‌క శ‌క్తి ఉన్న వ్య‌క్తికి హీరోలెవ‌రైనా దొరుకుతారు. కానీ ఇద్ద‌రినీ క‌లిపింది సినిమాయే. మా ఇద్ద‌రికీ సినిమా అంటే మోక‌రిల్లేంత గౌర‌వం ఉంది. ఇలాంటి భావ‌జాల‌మే మ‌మ్మ‌ల్ని ద‌గ్గ‌ర చేసింది. నాకు బ‌లంగా నిల‌బ‌డ్డ వ్య‌క్తి. ఇక ఈ సినిమా విషయానికి వ‌స్తే మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చేశారు. సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికండ‌న్, ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్ వంటి టెక్నిషియ‌న్స్ ప‌నిచేశారు. నాపై త‌క్కువ పెట్టుబ‌డి పెట్టి ఎక్కువ లాభాలు పొందాలనుకుంటారు. డిస్ట్రిబ్యూట‌ర్‌కు అండ‌గా నిర్మాత‌లు నిల‌బ‌డ‌టం లేదు. ఇలాంటి త‌రుణంలో పాత కాల‌పు విలువ‌ల‌ను తీసుకొచ్చిన వ్య‌క్తి రాధాకృష్ణ‌గారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు థాంక్స్ చెబుతున్నాను. నాకు అనిరుధ్ ఇష్ట‌మైన సంగీత ద‌ర్శ‌కుడు. ఆయ‌న కొల‌వెరీ పాట వినేవాడిని. సినిమాల్లో నేను డ్యాన్స్ చేయ‌క‌పోవ‌చ్చునేమో కానీ, ఒక్క‌డ్నే ఉంటే పాట విని ఊగుతుంటాను. మైకేల్ జాక్స‌న్ త‌ర్వాత అంత ఇష్ట‌మైన మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్‌. ఆది గురించి చెప్పాలంటే..ఆది నాకు చిన్న‌ప్ప‌టి నుండి మంచి ప‌రిచ‌యం. త‌న‌తో ప‌నిచేయ‌డం మంచి అనుభ‌వం. న‌ర్రా, రావుర‌మేష్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణి, బొమ‌న్ ఇరానీ, రావు ర‌మేష్ స‌హా అంద‌రికీ థాంక్స్‌. కీర్తి సురేష్‌, అను ఇమాన్యుయేల్ ఈ సినిమా కోసం స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. వారి సిన్సియారిటీకి నా థాంక్స్‌`` అన్నారు.

ఈ సినిమాలో క‌ల్యాణ్‌గారి న‌ట విశ్వ‌రూపం చూస్తారు.
త్రివిక్ర‌మ్ శ్రీనివాస
్ మాట్లాడుతూ - ``ఎంద‌రో మ‌హానుభావులు అంద‌రికీ వంద‌నాలు. అందులో కొంద‌రు ఈ స్టేజ్‌పై ఉన్నారు. వారి గురించి మాట్లాడుకోవాలి. సినిమా త‌ప్ప మ‌రేమీ తెలియ‌ని వ్యక్తి, మా సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికండ‌న్‌గారు. ఆయ‌న‌కు కెమెరాయే ప్ర‌పంచం. అంత గొప్ప వ్య‌క్తితో ప‌నిచేశాను. ఆయ‌న్నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. నేను కొద్దిగా చెబితే, ఆయ‌నెంతో తెర‌పై చూపించారు. ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌కాష్‌గారు అఆతో నాకు ప‌రిచ‌యం అయ్యారు. ఆయ‌న తాలూకా విశ్వ‌రూపాన్ని ఈ సినిమాలో చూపించారు. అఆ సినిమాకు నేను, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ క‌లిసి ప‌నిచేయాల‌నుకున్నాం. కానీ కుద‌ర‌లేదు. త‌ర్వాత సినిమా త‌ప్ప‌కుండా చేస్తాన‌ని అన్నారు. అన్న‌ట్లుగానే ఈ సినిమాకు అడ‌గ్గానే ఒప్పుకుని, అడిగిన‌ప్పుడ‌ల్లా హైద‌రాబాద్ వ‌చ్చి మ్యూజిక్ చేశారు. త‌న ద‌గ్గ‌ర భ‌యం లేక పోవ‌డాన్ని నేర్చుకున్నాను. అలాగే ఇష్ట‌మైన న‌టుల్లో ఒక‌రైన బొమ‌న్ ఇరానీ ఒక‌రు. ఆయ‌న న‌డిచే ఫిలిం లైబ్ర‌రీ. నేను అసూయ ప‌డే రైట‌ర్ కూడా ఆయ‌న‌లో ఉన్నారు. నేను ఇంకా బాగా రాయ‌డానికి ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చారు. త‌నికెళ్ల భ‌ర‌ణిగారు, నాకు పెద్ద‌న్న‌లాంటివారు. ముర‌ళీశ‌ర్మ‌గారు నేను అడ‌గ్గానే ప‌గ‌లు ఈ సినిమా కోసం ప‌నిచేసి, రాత్రి ముంబైలో మ‌రో సినిమా చేసేవారు. ప‌నిని ఎంత ఆనందంగా చేయాలో ఆయ‌న్నుండి నేర్చుకున్నాను. నాకు ఇష్ట‌మైన న‌టుల్లో ఎస్‌.వి.రంగారావుగారు ఒక‌రు. త‌ర్వాత సావిత్రిగారు. వారిద్ద‌రి త‌ర్వాత నాకు రావుగోపాల‌రావుగారంటే ఎంతో ఇష్టం. ఆయ‌న‌తో ప‌నిచేయలేక‌పోయాను కానీ, ఆయ‌న అబ్బాయి రావు ర‌మేష్‌తో ప‌నిచేసే అవ‌కాశం క‌లిగింది. నాది, రావు ర‌మేష్ ప్ర‌యాణం ఒకేసారి మొద‌లైంది. సంస్కారం, సంస్కృతం అనే విష‌యాల‌ను నేర్చుకున్నాను. ఖుష్బూగారు ఎంతో మంచి పాత్ర చేశారు. ఆమెను దృష్టిలో పెట్టుకునే క్యారెక్ట‌ర్ రాసుకున్నాను. కీర్తి, అను ఇమాన్యుయేల్ ఇద్ద‌రూ త‌మ పాత్ర‌కు తామే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకున్నారు. వారిద్ద‌రి నుండి క్ర‌మ‌శిక్ష‌ణ‌ను నేర్చుకున్నాను. చిన‌బాబుగారు వెన్నెముక‌లా సినిమాకు అండ‌గా నిల‌బ‌డ్డారు. నేను రూపాయి ఖ‌ర్చు పెడ‌దామంటే, రూపాయ‌న్న‌ర ఖ‌ర్చు పెడ‌దామ‌నే రాధాకృష్ణగారు ఎంతో బ‌లంగా నా వెనుకుండి ప్రోత్స‌హించారు. ఇక పి.డి.ప్ర‌సాద్‌గారు, నాగ‌వంశీగారు రథ చక్రాల్లా ప‌గ‌ల‌న‌క‌, రాత్ర‌న‌క‌ ఈ సినిమా కోసం ప‌నిచేశారు. సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిగారు, భాస్క‌ర‌భట్ల‌, శ్రీమ‌ణి ఎంతో మంచి సాహిత్యాన్ని అందించారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి ఫోన్‌లో రెండు నిమిషాలు మాత్ర‌మే ఈ క‌థ‌ను చెప్పాను. చాలా బావుంది. ఈ సినిమా మ‌నం చేస్తున్నామ‌ని అన్నారు. ఈ సినిమాలో క‌ల్యాణ్‌గారి న‌ట విశ్వ‌రూపం చూస్తారు. ఆయ‌నతో మ‌రిన్ని సినిమాలు క‌లిసి ప‌నిచేయాల‌ని, మీరంద‌రూ కోరుకునే ఉన్న‌త‌స్థితికి ఆయ‌న చేరుకోవాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని ప్రార్థిస్తున్నాను. తెలుగు సినిమాను శిఖ‌రంపై నిల‌బెట్టిన మ‌ల్లీశ్వ‌రి బి.ఎన్‌.రెడ్డి నుండి బాహుబ‌లి రాజ‌మౌళి వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. గాలి పెంచ‌ల న‌ర‌సింహారావు, సుశ‌ర్ల ద‌క్షిణామూర్తి నుండి అనిరుధ్ వ‌ర‌కు తెలుగు పాట‌ల‌ను మ‌న ఇళ్లల్లోకి తీసుకొచ్చిన మ‌హానుభావులెంద‌రో. మార్క‌స్ బాట్లే. విన్నెంట్ నుండి మ‌ణికండ‌న్ వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. ఎస్.వి.రంగారావు నుండి బొమ‌న్ ఇరాని, ముర‌ళీశ‌ర్మ‌, రావు ర‌మేష్ వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. సావిత్రి, జ‌మున‌, కాంచ‌న, క‌న్నాంబ నుండి కీర్తిసురేష్‌, అను ఇమాన్యుయేల్ వ‌ర‌కు అంద‌రూ మ‌హానుభావులే. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎంద‌రో మ‌హానుభావులు అంద‌రికీ నా వంద‌నాలు`` అన్నారు.

ఖుష్బూ మాట్లాడుతూ - ``ఇంత‌కు ముందు నా తెలుగు చిత్రం `స్టాలిన్‌`. త‌ర్వాత ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చినా, మంచి ప్రాముఖ్య‌త ఉన్న రోల్ వ‌చ్చిన‌ప్పుడే చేయాల‌ని ఏ సినిమాను అంగీక‌రించ‌లేదు. త్రివిక్ర‌మ్‌గారు ఈ రోల్‌ను నేను చేయాల‌న‌గానే కాద‌న‌లేని ప‌రిస్థితి. ప‌దేళ్ల త‌ర్వాత తెలుగులో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వ‌డం గొప్ప అవకాశం. ప‌వ‌న్ డౌన్ టు ఎర్త్ ప‌ర్స‌న్‌. ఇలాంటి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌. అనిరుధ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించాడు. జ‌న‌వ‌రి 10న బిగ్గెస్ట్ హిట్ కొట్ట‌బోతున్నాం`` అన్నారు.

రావు ర‌మేష్ మాట్లాడుతూ - ``ఈ సినిమాలో న‌టించ‌డం గొప్ప అనుభూతి. ఈ అవ‌కాశం ఇచ్చిన త్రివిక్ర‌మ్‌గారికి, ప‌వ‌న్‌గారికి థాంక్స్‌. గొప్ప టీమ్‌తో ప‌నిచేశాను`` అన్నారు.

బొమ‌న్ ఇరానీ మాట్లాడుతూ - ``నా తొలి తెలుగు సినిమా అత్తారింటికి దారేది. ఆ సినిమాకు నాకు మ‌ర‌చిపోలేని జ‌ర్నీ. సినిమా క‌థ చెప్ప‌డానికి నా వ‌ద్ద‌కు వ‌చ్చిన వ్య‌క్తితో హీరో ఎవ‌రు, డైరెక్ట‌ర్ ఎవ‌ర‌నే ప్ర‌శ్న‌లు మాత్ర‌మే వేశాను. ప‌వ‌న్‌క‌ల్యాన్‌, త్రివిక్ర‌మ్‌గార‌ని చెప్ప‌గానే నేను ఏం మాట్లాడ‌కుండా సినిమా చేయ‌డానికి అంగీక‌రించాను. హైద‌రాబాద్ న‌న్నున‌టుడిగా ద‌త్తత తీస‌కుంద‌ని అర్థ‌మైంది. ఇదే టీంతో ప‌నిచేయాల‌ని అనుకుంటున్నాను`` అన్నారు.

రావు ర‌మేష్ మాట్లాడుతూ - ``నితిన్‌గారు ప‌వ‌న్‌గారికి, త్రివిక్ర‌మ్‌గారికి ఎంత పెద్ద అభిమానో తెలుసు. ఆయ‌నవిషెష్ చెప్ప‌మ‌ని చెప్పారు. ఈ సినిమా చేసినందుకు, అవ‌కాశం ఇచ్చినందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, త్రివిక్ర‌మ్ గారికి థాంక్స్‌`` అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ - ``జ‌న‌వ‌రి 10న తెలుగు సినిమాకు రాబోతున్న తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అజ్జాత‌వాసి. క‌ల్యాణ్‌గారు ఏం చేసినా మ‌న‌కు న‌చ్చేస్తుంది. కల్యాణ్‌గారికి త్రివిక్ర‌మ్ గారు తోడై జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు చేశారు. తెలుగు సినిమా రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్ట‌డానికి నిర్మాత చిన‌బాబుగారు రెడీ అయిపోయారు. జ‌న‌వ‌రి 10 కోసం అంద‌రం వెయిట్ చేస్తున్నాం. బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ ఖాయం`` అన్నారు.

సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి మాట్లాడుతూ - ``ప‌వ‌న్ పేరులో చిరుగాలి ఉన్నా, ఆయ‌నో ప్ర‌భంజ‌నం. ఇది క‌ల్లోలం సృష్టించే ప్ర‌భంజ‌నం కాదు, క‌ల్యాణం జ‌రిపించే ఆనంద‌క‌ర‌ ప్ర‌భంజ‌నం. ఇది త్రివిక్ర‌ముడు సంధించిన క‌ల్యాణాస్త్రం, ప‌వ‌నాస్త్రం. ఇది క‌లెక్ష‌న్స్ సునామీని సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం ద్వారా అనిరుధ్ సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. మిగ‌తా పాట‌ల‌ను ర‌చించిన భాస్క‌ర‌భ‌ట్ల‌, శ్రీమ‌ణిల‌కు అభినంద‌నలు`` అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ``ప‌వ‌న్‌సార్‌తో నేను షూటింగ్‌లో పెద్ద‌గా మాట్లాడ‌లేదు. నేను ఆయ‌న‌కు పెద్ద ఫ్యాన్‌ని. అంద‌రూ ఆయ‌న సినిమాల్లో వ‌చ్చిన త‌ర్వాత ఫ్యాన్స్ అయితే..నేను చిన్న‌ప్ప‌టి నుండే ఆయ‌న‌కు ఫ్యాన్‌ని. ఆయ‌న్ను దూరం నుండే చూడాల‌నుకునేవాడిని. అటువంటిది ఈ సినిమాలో ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవకాశం వ‌చ్చింది. ఆ అవ‌కాశాన్ని క‌లిగించిన త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్. చాలా పెద్ద కాస్ట్ అండ్ క్రూతో క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం వ‌చ్చింది. జ‌న‌వ‌రి 10న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారిని ఇంకా ప‌వ‌ర్‌ఫుల్‌గా, యంగ్‌గా తెర‌పై చూడ‌బోతున్నారు`` అన్నారు.

అను ఇమాన్యుయేల్ మాట్లాడుతూ - ``ఈ సినిమా లైఫ్‌లో జ‌రిగిన గొప్ప విష‌యం. చాలా ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తుల‌తో క‌లిసి పనిచేశాను. ప‌వ‌ర్‌స్టార్ ప‌క్క‌న నిల‌బ‌డ‌ట‌మే గొప్ప విష‌య‌మే అయితే, ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం ఆశీర్వాదం అని చెప్పాలి. ఒక గొప్ప అనుభూతి. త్రివిక్ర‌మ్‌గారు నా పేవ‌రేట్ డైరెక్ట‌ర్‌. ఆయ‌న గురించి ఎంత చెప్పిన త‌క్కువే. ఆయ‌న‌తో మ‌ళ్లీ మ‌ళ్లీ ప‌నిచేయాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా చేసే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్‌గారు ఎంతో స‌హ‌కారాన్ని అందించారు. నిర్మాత‌లు ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా గ్రాండ్ విజ‌న్‌తో సినిమాను నిర్మించారు. అనిరుధ్‌..అవుట్ స్టాండింగ్ మ్యూజిక్ అందించారు. త‌న‌కు తెలుగులో మ‌రిన్ని మంచి అవ‌కాశాలు రావాలి`` అన్నారు.

కీర్తి సురేష్ మాట్లాడుతూ - ``నిర్మాత చిన‌బాబుగారికి థాంక్స్‌. అలాగే త్రివిక్ర‌మ్‌గారికి థాంక్స్‌. చాలా కూలెస్ట్ డైరెక్ట‌ర్‌. ప‌వ‌న్‌, త్రివిక్ర‌మ్ గారి కాంబినేష‌న్‌లో నేను క‌లిసి ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. మంచి క్యారెక్ట‌ర్ ఇచ్చారు. అనిరుధ్ వాయిస్ మ్యాజిక్‌. త‌న మ్యూజిక్‌లో నేను చేసిన మూడో సినిమా. సినిమాటోగ్రాఫ‌ర్ మ‌ణికంఠ‌న్‌గారు ప్ర‌తి ఫ్రేమ్‌ను పెయింటింగ్‌లా తెర‌కెక్కించారు. క‌ల్యాణ్‌గారితో క‌లిసి ప‌నిచేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను`` అన్నారు.

ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో అనిరుధ్‌, భ‌గ‌వాన్, పుల్లారావు, మ‌ణికంఠ‌న్‌, ఎ.ఎస్‌.ప్ర‌కాష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 
 
 

 

 

 

 

 

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved