18 March 2018
Hyderabad
యువ కథానాయకుడు నారా రోహిత్ ప్రధాన పాత్రలో పి.బి.మంజునాధ్ దర్శకత్వంలో శ్రీవైష్ణవి క్రియేషన్స్ పతాకంపై నారాయణరావు అట్లూరి నిర్మాణ సారధ్యంలో రూపొందనున్న "శబ్ధం" చిత్ర ప్రారంభోత్సవం నేడు (మార్చి 18) తెలుగువారికి అత్యంత ప్రీతిపాత్రము మరియు కొత్త సంవత్సరమైన ఉగాది పర్వదినాన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అంగరంగ వైభవంగా జరిగింది. "హిజ్ సైలెన్స్ ఈజ్ హిజ్ వెపన్" అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రారంభోత్సవ వేడుక పలువురు రాజకీయ మరియు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. చిత్ర కథానాయకుడు నారా రోహిత్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు క్లాప్ కొట్టగా.. పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు పి.బి.మంజునాధ్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు-ఎమ్మెల్యే కొమ్మలపాటి శ్రీధర్ లు కలిసి దర్శకుడు పి.బి.మంజునాధ్ కు స్క్రిప్ట్ ను అందించారు.
ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నారా రోహిత్ మాట్లాడుతూ.. "అమరావతిలో నా చిత్ర ప్రారంభోత్సవం జరగడం చాలా ఆనందంగా ఉంది. అందర్నీ ఎంటర్ టైన్ చేయడం కోసం మా టీం అందరం తప్పకుండా కష్టపడతామ్. పెదనాన్నగారు ఎంతగానో డెవలప్ చేస్తున్న ఈ ప్రాంతంలోనే నా సినిమా ఆడియో విడుదల వేడుక కూడా నిర్వహిస్తాం. ఇక్కడికి విచ్చేసిన అతిధులకు, అభిమానులకు నా ధన్యవాదాలు మరియు ఉగాది శుభాకాంక్షలు. కథకి సరిగ్గా సూట్ అయ్యే టైటిల్ "శబ్ధం"" అన్నారు.
చిత్ర నిర్మాత నారాయణరావు అట్లూరి మాట్లాడుతూ.. "నారా రోహిత్ గారితో "శబ్ధం" చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అమరావతి నగరమున ఈ చిత్ర ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషం. సినిమా తప్పకుండా అందర్నీ అలరించే విధంగా ఉంటుంది" అన్నారు.
చిత్ర దర్శకుడు పి.బి.మంజునాధ్ మాట్లాడుతూ.. "నా మొదటి సినిమా "లేడీస్ అండ్ జెంటిల్మన్"కి నంది అవార్డ్ అందించి దర్శకుడిగా నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి ముందుగా నా కృతజ్ణతలు తెలియజేసుకుంటున్నాను. వైష్ణవి క్రియేషన్స్ లో వస్తున్న ఫస్ట్ మూవీ. కథను నమ్మి ఫస్ట్ నేరేషన్ లోనే కథను ఒకే చేసిన మా హీరో నారా రోహిత్ గారికి ప్రత్యేక కృతజ్ణతలు. రిచర్డ్ ప్రసాద్ గారి సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలుస్తుంది. ఏప్రిల్ చివరివారం నుంచి వైజాగ్, కాకినాడ, హైద్రాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. నాకీ అవకాశాన్నిచ్చిన నా నిర్మాత నారాయణరావుగారికి ధన్యవాదాలు" అన్నారు.
ముఖ్య అతిధిగా విచ్చేసిన మినిస్టర్ ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ.. "అమరావతిలో ముహూర్తపు సన్నవేశం చిత్రీకరణ జరుపుకొన్న నారా రోహిత్ 18వ చిత్రమైన "శబ్ధం" సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నాను. ఈ వేడుకకు నారా లోకేష్ గారు కూడా హాజరు కావాల్సి ఉండగా, హైద్రాబాద్ లో మీటింగ్ కారణంగా రాలేకపోయారు. చిత్ర నిర్మాతకు, దర్శకుడికి, సంగీత దర్శకుడికి ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని.. ఇదే విధంగా అమరావతిలో మరిన్ని సినిమా వేడుకలు జరగాలని కోరుకొంటున్నాను" అన్నారు.
ఈ చిత్రానికి కథ-మాటలు: వంశీ రాజేష్, ప్రొడక్షన్స్ డిజైనర్: రవిందర్, పి.ఆర్.ఓ: వంశిశేఖర్, సంగీతం: వికాస్ కురిమెళ్ళ, ఎడిటర్: నవీన్ నూలి, సినిమాటోగ్రఫీఎల్ రిచర్డ్ ప్రసాద్, సమర్పణ: డా. సౌజన్య అట్లూరి, బ్యానర్: శ్రీ వైష్ణవీ క్రియేషన్స్, నిర్మాత: నారాయణ రావు, అట్లూరి, దర్శకత్వం: పిబి మంజునాథ్.