ధర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురామ్ రొయ్యూరుతో కలిసి స్వీయ దర్శకత్వంలో గోవర్ధన్ గజ్జల నిర్మిస్తున్న ఎమోషనల్ రోమాంటిక్ థ్రిల్లర్ "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం". చంద్రకాంత్-రాధిక మెహరోత్రా-పల్లవి డోర హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రం పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలయ్యాయి. జితిన్ రోషన్ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రానికి కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించారు.
ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్ లో శిల్పా చక్రవర్తి వ్యాఖ్యానంతో అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఈ వేడుకలో సి.కళ్యాణ్, జెమిని కిరణ్, బెక్కెం వేణుగోపాల్ (గోపి), మల్కాపురం శివకుమార్, వల్లూరిపల్లి రమేష్, రాజ్ కందుకూరి, డి.ఎస్.రావు, విజయ్ కుమార్ కొండా, ఉత్తేజ్, లక్ష్మీభూపాల్ వంటి చిత్ర ప్రముఖులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ముందుగా ఒక్కొక్కరూ ఒక్కో పాటను విడుదల చేయగా.. సి.కళ్యాణ్-జెమిని కిరణ్ ఆడియోను ఆవిష్కరించారు. హీరోహీరోయిన్లు చంద్రకాంత్-రాధిక మేహరోత్రా-పల్లవి డోరా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.
పాటలు, టీజర్, ట్రైలర్ చూస్తుంటే.. ఈ ఏడాది హిట్ సినిమాల జాబితాలో "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం" కూడా తప్పక చేరుతుందని వక్తలు పేర్కొనగా.. ఇంత మంచి చిత్రం ద్వారా లాంచ్ అవ్వడం అదృష్టంగా భావిస్తున్నామని హీరోహీరోయిన్లు తెలిపారు.
సరిగ్గా సంవత్సరం క్రితం ఈ చిత్ర రూపకల్పన కోసం అమెరికాలో ఉద్యోగం వదులుకొని శ్రీకారం చుట్టానని, తన భార్య మొదలుకొని ఎందరో స్నేహితులు తన ప్రయత్నంలో వెన్నంటి నిలిచారని, అమెరికాలో అందుబాటులో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులతో అధిక భాగం అమెరికాలో షూటింగ్ జరుపుకొన్న ఈ చిత్రం కచ్చితంగా అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నానని దర్శకనిర్మాత గోవర్ధన్ అన్నారు.
దర్శకనిర్మాత గోవర్ధన్ ప్యాషన్, టాలెంట్ నచ్చి ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్నానని, గోవర్ధన్ రూపంలో టాలీవుడ్ కు మరో టాలెంటెడ్ సెన్సిబుల్ డైరెక్టర్ దొరికినట్లేనని బెక్కెం వేణుగోపాల్ (గోపి) అన్నారు. సెప్టెంబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.