pizza
Jai Simha press meet
'జై సింహా' చిత్రాన్ని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు - నటసింహ బాలకృష్ణ
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

18 January 2018
Hyderabad

నటసింహ బాలకృష్ణ, నయనతార కాంబినేషన్‌లో సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై 'నరసింహా' డైరెక్టర్‌ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం 'జై సింహా'. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అయ్యి సూపర్‌హిట్‌ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ''మంత్రం బ్రాహ్మణాదీనం.. దైవం మంత్రాదీనం, ఆపరేషన్‌ వైద్యుడే చెయ్యాలి.. ఆలయ పూజ అర్చకుడే చెయ్యాలి.. భక్తి బ్రాహ్మణుల వృత్తి.. అది భగవంతుడు వాళ్లకిచ్చిన శక్తి' అంటూ నటసింహ బాలకృష్ణ చెప్పిన డైలాగ్స్‌కి బ్రాహ్మణుల నుండి మంచి స్పందన లభిస్తోంది. పండితులు, పూజారులు, పురోహితుల ఔన్నత్యాన్ని చాటుతూ సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల నుండి తరలి వచ్చిన బ్రాహ్మణులు చిత్ర యూనిట్‌ని అభినందించారు. జనవరి 18న హైదరాబాద్‌ ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నటసింహ బాలకృష్ణ, నిర్మాత సి.కళ్యాణ్‌, మాటల రచయిత ఎం.రత్నం, కెమెరామెన్‌ సి.రాంప్రసాద్‌, నటులు చలపతిరావు, కాళికేయ ప్రభాకర్‌, 'మా' అధ్యక్షుడు శివాజీ రాజా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌, తెలంగాణ బ్రాహ్మణుల సంఘ సమాఖ్య అధ్యక్షులు తులసి శ్రీనివాస్‌, తెలంగాణ రాష్ట్ర సమాఖ్య సంఘం అధ్యక్షులు హనుమంతాతచార్య, కార్యదర్శి మల్లాది శర్మ, ఇతర పండితులు, పురోహితులు పాల్గొన్నారు. నటసింహ బాలకృష్ణ, నిర్మాత సి.కళ్యాణ్‌, మాటల రచయిత ఎం.రత్నంలను వేద మంత్రాలతో ఆశీర్వదించి శాలువా, గజమాలలతో సత్కరించారు.

నటసింహ బాలకృష్ణ మాట్లాడుతూ - ''ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేగానీ బ్రాహ్మణుడుగా పుట్టే అవకాశం రాదు. నేను అన్ని పుస్తకాలు, పురాణాలు చదువుతాను. అన్నింట్లోనూ సారాంశాన్ని తీసుకుంటాను. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన నందమూరి తారక రామారావుగారి జీవిత సారాంశాన్ని తీసుకుని 'యన్‌.టి.ఆర్‌.' అనే సినిమాని తీస్తున్నాం. నాన్నగారి వర్థంతి సందర్భంగా ఈరోజు పేపర్లో యాడ్‌ కూడా వేయడం జరిగింది. ఇక నుండి బ్రాహ్మణులను కించపరిచే విధంగా సినిమాలను తీయకూడదు. అందరికీ ఉపయోగపడే విధంగా వుండాలి. ఎవరినీ అవమానించకూడదు అని అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మాటల రచయిత రత్నం ఈ సినిమాకి రత్నాల్లాంటి డైలాగులు రాశారు. దర్శకుడు రవికుమార్‌ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఆయనతో సినిమా చెయ్యాలన్న నా కోరిక ఈ చిత్రంతో తీరింది. ఎంతో ఆధ్యాత్మికత వున్న వ్యక్తి ఆయన. నా చిత్రాలన్ని బిగ్‌ స్కేల్‌లో వుంటాయి. కెమెరామెన్‌ రామ్‌ప్రసాద్‌ చాలా అద్భుతంగా ప్రతి ఫ్రేమ్‌ని చిత్రీకరించాడు. ఎంతోమంది నటీనటులు చక్కగా నటించారు. సమిష్టి కృషితో ఈ సినిమా చేశాం. నటన అంటే పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి నటించాలి. అప్పుడే ఆ పాత్ర రక్తి కడుతుంది. నాన్నగారి వర్ధంతి రోజున వేద పండితులు ఆశీర్వచనాల వర్షం కురిపించడం చాలా ఆనందంగా వుంది. నా అరవై ఏట రామానుజాచార్యులు జీవిత కథతో ఓ సినిమా చేయబోతున్నాను. ఈ సినిమాని సక్సెస్‌ చేసిన ప్రేక్షకులు, అభిమానులకు నా కృతజ్ఞతలు'' అన్నారు.

నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''కుంభకోణంలో 2,500 మంది బ్రాహ్మణులతో ఆ ఎపిసోడ్‌ని చిత్రీకరించాం. అక్కడ అంతమందిని సమకూర్చడానికి చాలా కష్టపడ్డాం. అయినా ప్రతి ఒక్కరూ ఎంతో సపోర్ట్‌ చేసి ఆ సీన్‌ విని ఎంతో ఇన్‌స్పైర్‌ అయి నటించారు. ముఖ్యంగా ఆడవాళ్లు ఎంతో హెల్ప్‌ చేశారు. ఆ సీన్‌లో బాలయ్య సింగిల్‌ టేక్‌లో డైలాగులు చెప్తుంటే పక్కన వున్న వారంతా ఆశ్చర్యపోయి చూశారు. డబ్బింగ్‌లో కూడా ఏకథాటిగా చెప్పారు. ఆ సీన్‌ చాలా కాంప్లికేటెడ్‌. అందుకే చాలా కేర్‌ఫుల్‌గా తీశాం. ఈ సీన్‌ కోసం మాకు సలహాలు ఇచ్చిన బి.వి.రామారావుగారికి నా థాంక్స్‌. బ్రాహ్మణులను డీగ్రేడ్‌ చేసి, వారిని కించపరిచే విధంగా సినిమాలు ఎవరూ తీయరు. అనుకోకుండా కొన్నిసార్లు తప్పులు జరిగాయి. సినిమాని సినిమాగా చూడాలి. బాలయ్యబాబులో ఇంకా వంద సినిమాలు చేసే సత్తా వుంది. ఆయన చేయబోయే 50 సినిమాల్లో కూడా 'జై సింహా' టాప్‌గా నిలుస్తుంది. షార్ట్‌టైమ్‌లో తీసి, షార్ట్‌ టైమ్‌లో రిలీజ్‌ చేసిన ఘనత మా 'జై సింహా'కి దక్కుతుంది. ఇది చిరస్థాయిగా నిలుస్తుంది'' అన్నారు.

నటుడు చలపతిరావు మాట్లాడుతూ - ''ఎన్టీరామారావుగారు బ్రాహ్మణులను ఎంతో గౌరవించేవారు. ఆయన చుట్టూ 7,8 మంది పండితులు, పురోహితులు వుండేవారు. ఆయనకి ప్రతిరోజు పురాణాలు, పద్యాలు చెప్పేవారు. అలాగే బాలయ్యకు దైవభక్తి ఎక్కువ. ప్రతి ఒక్కర్ని ఎంతో గౌరవిస్తారు. బ్రాహ్మణులు గర్వంగా కాలర్‌ ఎగరేసుకుని 'జై సింహా' చిత్రం చూడండి అని ప్రతి ఒక్కరికీ చెప్పేలా వుంది. నిర్మాత కళ్యాణ్‌ మంచి సినిమా తీసి జీవితం ధన్యం చేసుకున్నాడు'' అన్నారు.

'మా' అధ్యక్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ - ''సినిమాలో వున్న ఒక్క సీన్‌ ఇంతమంది బ్రాహ్మణులను కదిలించడం నా ముప్ఫై ఏళ్ల సినీ జీవితంలో ఇంతవరకూ చూడలేదు. డైలాగులు చెప్పాలంటే ఒక్క బాలయ్యబాబునే చెప్పాలి'' అన్నారు.

మాటల రచయిత ఎం.రత్నం మాట్లాడుతూ - ''ఈ చిత్రంలో బ్రాహ్మణుల గురించి రాసే సన్నివేశానికి బాలయ్యబాబుని దృష్టిలో పెట్టుకుని రాశాను. ఆయనకి డైలాగ్స్‌ రాయాలంటే పెన్నుకే పూనకం వస్తుంది. మా దర్శకుడు రవికుమార్‌గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. మా నిర్మాత కళ్యాణ్‌గారు చాలా భారీగా నిర్మించారు. బ్రాహ్మణులు, వేద పండితులు మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా వుంది'' అన్నారు.

ఆల్‌ ఇండియా బ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌ మాట్లాడుతూ - ''బాలయ్యబాబు అద్భుతమైన సోషల్‌, చారిత్రక, జానపద చిత్రాలు ఎన్నో చేశారు. బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఆపహాస్యం చేస్తూ సినిమాలు తీస్తున్న ఈరోజుల్లో బ్రాహ్మణుల ఔన్నత్యాన్ని, వారి గొప్పదనాన్ని చాటుతూ 'జై సింహా' చిత్రంలో చూపించారు. రత్నంగారు చాలా రత్నంలాంటి డైలాగులు రాశారు. రవికుమార్‌గారు గొప్పగా సినిమా తీశారు. బాలయ్యబాబు అద్భుతంగా నటించారు. కులాలకు, మతాలకు అతీతంగా ఆయన ఎన్నో ఇలాంటి సినిమాలు చెయ్యాలి. ఆయనకి తోడుగా మేమంతా వుంటాం'' అన్నారు.



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved