పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో విజయ్ దేవరకొండ యువతలో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోగా మారాడు. ఇక ఈ యువహీరో నటిస్తున్న తాజా చిత్రం 'ఏ మంత్రం వేశావే'. విజయ్ సరసన శివానీసింగ్ నాయికగా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మల్కాపురం శివకుమార్ సమర్పణలో శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో...
చిత్ర దర్శక నిర్మాత శ్రీధర్ మాట్లాడుతూ - ``ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీ పరంగా అందరూ సభ్యులు సోషల్ మీడియాకి బానిసలైపోయారు. అలాంటి కాన్సెప్ట్‌తో చేసిన సినిమాయే `ఏ మంత్రం వేశావే`. కంప్యూటర్ గేమ్స్‌కు బానిసైన హీరోని.. ఆన్‌లైన్‌లో పరిచయమైన హీరోయిన్ ఎలా మార్చుకుంది. తనకు మానవ విలువలను, సంబంధాలను ఎలా తెలియజేసిందనేదే కథ. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ `యు` సర్టిఫికేట్‌ను పొందింది. శివకుమార్‌గారి సహకారంతో సినిమాను మార్చి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. 2014లో సినిమా షూటింగ్‌ను ప్రారంభించాం. 2015లో చిత్రీకరణను పూర్తి చేశాం. అయితే నేను శాన్‌ఫ్రానిస్కోలో ఉండటం వల్ల పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఆలస్యమైయ్యాయి. దర్శకుడిగా నా తొలి సినిమా. ఇండిపెండెంట్ సినిమా గురించి అధ్యయనం చేసి తొలిసారి దర్శకత్వం చేసిన సినిమా ఇది. విజయ్ దేవరకొండ `అర్జున్‌రెడ్డి` తర్వాత వస్తోన్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందింది. కుటుంబంలో అందరూ చూసేలా సినిమాను తెరకెక్కించాం`` అన్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ - ``సినిమాను మార్చి 9న విడుదల చేయాలని అనుకుంటున్నాం. ఎవడే సుబ్రమణ్యం, పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రమిది. నేను 2017 నవంబర్‌లో సినిమా చూశాను. నచ్చడంతో సినిమాను విడుదల చేయడానికి ముందుకు వచ్చాను. సినిమా మంచి రికార్డులను క్రియేట్ చేసేలా.. అందరికీ నచ్చేలా ఉంటుంది. సినిమాను రెండు రాష్ట్రాల్లో 900-1000 థియేటర్స్లో విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నాం`` అన్నారు.
థియేటర్స్ బంద్ గురించి మాట్లాడతూ...
ప్రస్తుతం జరుగుతున్న సమస్యను థియేటర్స్ బంద్ అని అనడం కంటే నిరసన వ్యక్తం చేస్తుండటం అని అనొచ్చు. ఒకప్పుడు థియేటర్స్‌లో ప్రొజెక్టర్ ఇన్‌స్టాల్ చేయడానికి 4-5 లక్షలు రూపాయలు అవుతుందని అన్నారు. సరేనని ఎగ్జిబిటర్స్ అందరూ అంతా మొత్తాన్ని ఒకేసారి కట్టలేరని 104 వారాల్లో ఆ మొత్తాన్ని కట్టేలాగా... అది పూర్తైన తర్వాత రెండు నుండి మూడు వేల వరకు సర్వీస్ చార్జీలు కడితే సరిపోతుందని ముందు మాటలు కుదిరాయి. వారి మాటలు నమ్మి ఎగ్జిబిటర్స్ అందరూ సంతకాలు పెట్టారు. ఆ మాట ప్రకారం ఓ సినిమాకు తొలివారంలో 10-12వేలు.. రెండో వారంలో 8 వేలు.. మూడో వారం 6 వేల రూపాయలను వసూలు చేశారు. ఇప్పుడు అన్న సమయం ముగిసినా కూడా చార్జీలు వసూలు చేయడం మానలేదు. వీరికి మన సినిమా సభ్యుల్లో కొంత మంది నుండి మద్ధతు కూడా లభించింది. దీని వల్ల చిన్న నిర్మాతలు ఎంతో నష్టపోతున్నారు. హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలకు లేని చార్జీలు రీజనల్ సినిమాలపైనే ఎందుకో అర్థం కావడం లేదు. దాంతో సర్వీస్ ప్రొవైడర్స్‌కు వ్యతిరేకంగా ఇండస్ట్రీ నిరసనను వ్యక్తం చేస్తుంది. ఈ నిరసనలో దాదాపు రెండు లక్షల మంది మాకు సపోర్ట్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సమస్య సమసిపోతుందని భావిస్తున్నాం`` అన్నారు.