16 March 2017
Hyderabad
ప్రభాస్, అనుష్క, తమన్నా, రానా, రమ్యకృష్ణ, నాజర్ ప్రధాన తారాగణంగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'బాహుబలి2స. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో....
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ``మాటలు రావడం లేదు. వెండితెర మాట్లాడాల్సి వస్తే..ఇంతటి గొప్ప అద్భుతాన్ని నాపై ఆవిష్కరిస్తారని జన్మలో అనుకోలేదు. ఇదే భరించలేకపోతే ఏప్రిల్ 28న ఎన్ని థియేటర్స్‌లో ఈ అద్భుతాన్ని భరించాలోనని చెబుతుంది. హ్యాట్సాఫ్ టు రాజమౌళి అండ్ టీం. ఈ అద్భుతాన్ని తెరపై చూడటానికి ప్రేక్షకులు ఏప్రిల్ 28 వరకు ఎలా ఆగుతారో తెలియడం లేదు. నేనైతే విడుదలయ్యే వరకు ప్రతిరోజు పదిసార్లు ఈ ట్రైలర్‌ను చూస్తాను. సాహో బహుబలి..సాహోరే బాహుబలి`` అన్నారు.
ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - ``వాన పడే ముందు ఉరుములు రావడం సహజం. అలాగే బాహుబలి అనే సినిమా వర్షం రాబోయే ముందు వచ్చిన ఈ ట్రైలర్ ఉరుములా గంభీరంగా ఉంది. ఏప్రిల్28న విడుదలకానున్న ఈ వానలో మనం అందరం తడిసి ఆనందంలో మునుగుతామని భావిస్తున్నాను`` అన్నారు.
నిర్మాత శోభు యార్లగడ్డ మాట్లాడుతూ - ``బాహుబలి సినిమా మా యూనిట్ 5 ఏళ్ళ కష్టం. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఇంకా అద్భుతంగా అందరికీ నచ్చేలా ఉంటుంది`` అన్నారు.
రానా మాట్లాడుతూ - ``ఇలాంటి ఓ గొప్ప సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు రాజమౌళి అండ్ టీంకు థాంక్స్. మహిష్మతి రాజ్యాన్ని ఏప్రిల్ 28న వెండితెరపై అందరం చూడబోతున్నాం. నటుడుగా నేను తెరంగేట్రం చేసి ఏడేళ్ళైంది. అందులో బాహుబలి సినిమా కోసమే ఐదేళ్ళు కష్టపడ్డాను. ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఎగ్జయిట్‌మెంట్ క్రియేట్ అయ్యింది`` అన్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ - ``ట్రైలర్ చాలా ఎగ్జయిట్‌మెంట్‌గా ఉంది. ఇంత గొప్ప సినిమాలో నన్ను భాగం చేసిన రాజమౌళి అండ్ టీంకు అభినందనలు`` అన్నారు.
ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ - ``బాహుబలి సినిమా చాలా పెద్ద కథ. సింగిల్ పార్ట్‌లో చెప్పలేకనే సినిమాను రెండు భాగాలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. బాహుబలి పార్ట్ 1లో సినిమాలో ఏ క్యారెక్టర్స్ ఉంటాయనే దాన్ని, వార్ సీన్‌ను చూపించడం జరిగింది. ఇప్పుడు బాహుబలి పార్ట్ 2లో క్యారెక్టర్స్ మధ్య డ్రామాను ఎలివేషన్ ఉంటుంది. పార్ట్ 1లో మహిష్మతి రాజ్యాన్ని చిన్నగా చూసుంటారు. ఇప్పుడు మహిష్మతి రాజ్యాన్ని చాలా పెద్దదిగా చూస్తారు. బాహుబలి, భళ్ళాలదేవ, కట్టప్ప, శివగామి, దేవసేన ఇలా అందరి క్యారెక్టర్స్ చాలా బలమైనవే. ప్రతి క్యారెక్టర్‌ను అద్భుతంగా చూపించే ప్రయత్నమే చేశాం. అలాగే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయాన్ని సింగిల్ లైన్‌లో చెప్పలేను. అది పూర్తి సినిమా చూసి తెలుసుకోవాలి. పార్ట్ 1 కంటే రెండో పార్ట్ చాలా ఎమోషనల్‌గా ఉంటుందని చెప్పగలను. ఇలాంటి సినిమా చేయడానికి ఒక సినిమానో ఇన్‌స్పిరేషన్ అని చెప్పలేను. చిన్నప్పట్నుంచి నాకు జానపద చిత్రాలు, పారాణికాలంటే చాలా ఇష్టం. అలా అన్నింటి నుండి ఇన్‌స్పైర్ అయ్యాను. బాహుబలి పార్ట్ 2 ఎమోషనల్‌గా, విజువల్‌గా ఆడియెన్స్‌ను థ్రిల్ చేస్తుంది`` అన్నారు.