pizza
NATS, Tantex jointly organized CPR Training event
ఆకస్మిక హృద్రోగ సమస్యల అవగాహన: ప్రాణ రక్షణ ప్రక్రియలో (సిపిఆర్) నాట్స్ మరియు టాంటెక్స్ సంయుక్తంగా నిర్వహించిన శిక్షణా శిబిరం
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

10 April 2019
USA

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సంయుక్తంగా ‘ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ’ (సిపిఆర్ ట్రైనింగ్) కార్యక్రమాన్ని శనివారం అర్వింగ్ లోని బిర్యాని పాట్@హిల్ టాప్ ప్రాంగణంలో నిర్వహించారు. ఆకస్మికంగా గుండె ఆగి కుప్పకూలి మరణించిన వారి గురించి మనం నిత్యం వింటూ ఉంటాము. ఇలాంటి సంఘటన బహిరంగ ప్రదేశంలో జరిగితే ఎలా స్పందించాలో మనలో చాలామందికి తెలియదంటే ఆశ్చర్యం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం ఆరు శాతం మాత్రమే ఇలా బహిరంగ ప్రదేశంలో కుప్పకూలిన వారిలో మరణం నుంచి తప్పించుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సరియైన సమయానికి ప్రాణరక్షణ ప్రక్రియలో అవగాహన లేకపోవడం ప్రధాన కారణమని నిపుణుల అభిప్రాయం. సిపిఆర్ శిక్షణలో ధృవీకృత నిపుణుడు మరియు టాంటెక్స్ దీర్ఘకాల సభ్యుడు కిషోర్ చుక్కల నేతృత్వంలో తెలుగు వారు మూడు విడతలుగా విచ్చేసి ఇందులోని మెళుకువలను అభ్యసించారు. ఈ ప్రాణరక్షణ ప్రక్రియలో అతిముఖ్యమైన ఘట్టం ‘ఛాతి మర్దనం’.

ఆకస్మిక హృద్రోగ మరణాల (గుండెపోటు) గురించి మనం ప్రసార మాధ్యమాలలో తరచుగా చూస్తుంటాము. మనిషికి మొట్టమొదటి సారి గుండెజబ్బు లక్షణాలు, ముఖ్యంగా ఛాతి నొప్పి, గుండె దడ, ఆయాసం మొదలయిన గంటలోపు మరణిస్తే దీనినే ఆకస్మిక హృద్రోగ మరణం అనవచ్చు. ప్రాణ రక్షణ ప్రక్రియలో సూచనల క్రమాన్ని అమెరికా గుండె సంస్థ జారీ చేసింది.
1. ఆకస్మిక హృద్రోగ సమస్యను వెంటనే గుర్తించి అత్యవసర వ్యవస్థను అప్రమత్తం చేయడం (911)
2. ఛాతి మర్ధనం వెంటనే మొదలు పెట్టాలి
3. గుండె లయలో మార్పులను ఎ.ఇ.డి (డిఫిబ్రిలేటర్) ద్వారా గుర్తించి, అవసరమైన విద్యుత్ఘాతాన్ని ఇవ్వడం. (ఎ.ఇ.డి లేనిచో ఛాతి మర్ధనం చేస్తూ ఉండాలి)
4. అత్యవసర సహాయం అందిన వెంటనే ఆసుపత్రిలో తదుపరి చికిత్స అందించడం

ఛాతి మర్ధన పది సెకండ్లలోపు మొదలు పెట్టాలి. కొత్త నిబంధనల ప్రకారం నోటిద్వార శ్వాస అందించవలసిన అవసరంలేదని ఈ శిక్షణలో శ్రీ కిశోర్ చుక్కల తెలియ జేశారు. ఒక పర్యాయంలో ముప్పై మార్లు ఛాతిని రెండు అంగుళాల లోనికి అదిమి అంతరాయం లేకుండా మర్ధన చేయడం, ఇలా రెండు నిమిషాలలో ఐదు పర్యాయాలు పూర్తిచేసి ప్రాణాలను కాపాడుకోవడం సాధ్యం అని శిక్షణలో తెలియజేసారు.

నాట్స్ ఆధ్వర్యంలో మే 24 నుండి 26 వరకు డాలస్ మహానగరంలోని అర్వింగ్ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహిస్తున్న అమెరికా తెలుగు సంబరాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ సంబరాల సందర్భంగా నాట్స్ సంస్థ అనేక క్రీడలు, సంగీతం, చిత్రలేఖనం, నృత్యం తదితర తెలుగు సంస్కృతీ, సంప్రదాయాలకు సంబందించిన అంశాలలో యువతకు, పెద్దలకు శిక్షణ ఇచ్చి, విజేతలను సంబరాల వేదికపై గుర్తించనున్నారు.

నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి మరియు నాట్స్ అధిపతి శ్రీనివాస్ గుత్తికొండ తమ సంయుక్త సందేశంలో “ తెలుగు వారందరినీ ఒక వేదికపై కలిసి చిన్నారులకు, యువతకు మన సంస్కృతిని పరిచయం చెయ్యాలని, తెలుగువారి ఐక్యతకు కృషి చేయాలని, ఇలాంటి కార్యక్రమాలు ఆకస్మిక హృద్రోగ సమస్యలకు మంచి అవగాహన కలిగిస్తాయని అన్నారు.

6వ అమెరికా సంబరాల నాయకత్వం బృందం సభ్యులు కిశోర్ కంచెర్ల (అధిపతి), విజయ శేఖర్ అన్నె (సంయుక్తాధిపతి), ఆది గెల్లి (ఉపాధిపతి), ప్రేమ్ కలిదిండి (ఉపాధిపతి), రాజేంద్ర మాదాల (కార్యదర్శి), బాపు నూతి (కోశాధికారి), మహేశ్ ఆదిభట్ల (సంయుక్త కార్యదర్శి), విజయ్ వర్మ కొండ (క్రయవిక్రయ నిర్దేశకుడు), భాను లంక (ఆతిథ్యం నిర్దేశకుడు), కిషోర్ వీరగంధం (వ్యవహారాల నిర్దేశకుడు), రామిరెడ్డి బండి (కార్యక్రమ నిర్దేశకుడు), చినసత్యం వీర్నపు (టాంటెక్స్ అధ్యక్షుడు) సంయుక్తంగా ప్రాణరక్షణ శిక్షణకు విచ్చేసిన తెలుగు వారికి అభినందనలు తెలియజేసి, తెలుగు వారందరినీ సంబరాలకు ఆహ్వానించారు.

నాట్స్ సంబరాల కోశాధికారి బాపు నూతి సంస్థకు సంబదించిన ముఖ్యాంశాలను పంచుకొని, ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ సంయుక్తంగా తెలుగు వారికి అందించండం సంతోషంగా ఉందని అన్నారు. సంబరాల కార్యదర్శి రాజేంద్ర మాదాల ప్రస్తుత సంబరాల కార్యక్రమ వివరాలను తెలియజేసారు. టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు విచ్చేసిన తెలుగు వారిని ఉద్దేశించి మాట్లాడుతూ “ ప్రాణరక్షణ ప్రక్రియలో శిక్షణ మన భారతీయ సంతతికి చెందిన వారికి, ముఖ్యంగా తెలుగు వారికి చాల ముఖ్యం అని, ఇటీవల మనం అనేక ఆకస్మిక మరణాలను చూసామని, ఇలాంటి శిక్షణలో తగిన అవగాహన అందించడం ద్వారా అతివిలువైన ప్రాణాన్ని కాపాడగలం” అని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణకు మరియు రాబోవు సంబరాలకు సహ ఆతిథ్యం అందించడం చాలా సంతోషంగా ఉందని టాంటెక్స్ అధ్యక్షుడు చినసత్యం వీర్నపు తమ సందేశంలో పేర్కొన్నారు. టాంటెక్స్ కార్యదర్శి ఉమామహేష్ పార్నపల్లి, కార్యనిర్వాహక సభ్యులు శ్రీకాంత్ రెడ్డి జొన్నాల, సతీష్ బండారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమానికి ప్రసార మాధ్యమాలైన టివి9, టివి5, దేసీప్లాజా టివి, వి6, రేడియో సురభి, ఫన్ ఏసియా రేడియో, తెలుగు వన్ రేడియోలకు కృతజ్ఞతలు తెలియజేసారు.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved