pizza
NTR Biopic movie launch
'యన్‌.టి.ఆర్‌' ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

29 March 2018
Hyderabad

నందమూరి బాలకృష్ణ టైటిల్‌ పాత్రలో ఎన్‌.బి.కె.ఫిలింస్‌ బ్యానర్‌పై వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పణలో తేజ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నిర్మాతగా ప్రారంభమైన చిత్రం 'యన్‌.టి.ఆర్‌` కీర్తిశేషులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బయోపిక్‌ 'యన్‌.టి.ఆర్‌' గురువారం హైదరాబాద్‌ రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. 'దానవీరశూరకర్ణ' సినిమాలో దుర్యోధనుడు గెటప్‌లో ఉన్న బాలకృష్ణపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. తొలి సన్నివేశానికి ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు క్లాప్‌ కొట్టారు. తెలంగాణ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా.. కె.రాఘ‌వేంద్రరావు, బోయపాటి శ్రీను తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. నంద‌మూరి మోహ‌న‌కృష్ణ‌, రామ‌కృష్ణ‌, సాయికృష్ణ స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు అందించారు. ఈ సందర్భంగా...

ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ''తెలుగుదనానికి నిండుతనాన్ని తీసుకొచ్చి.. తెలుగు తేజాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పి.. తెలుగువారికి ఒక గుర్తింపు తెచ్చి.. తెలుగు పౌరుషాన్ని దేశ, రాజకీయ ముఖచిత్రంలో వెలిగించి, తాను ఒక వెలుగు వెలిగి.. ఆ వెలుగు ద్వారా ప్రజలకు సందేశాలు ఇచ్చి మేలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు. ఆయన జీవిత చరిత్రను ప్రతిబింబించే సినిమా ఈరోజు ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. ఎన్టీఆర్‌గారంటే వ్యక్తిగతంగా అభిమానం, స్నేహం ఉంది. ఆయన చేసిన పనులు చరిత్ర గుర్తుంచుకోతగ్గవి. పాతాళభైరవి, లవకుశ, దేశోద్ధారకులు అనే సినిమాలు ఈరోజు విడుదలై ఘన విజయాన్ని సాధించాయి. అందుకనే ఈరోజునే నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు ఆయన్ను తరతరాలు గుర్తుంచుకునేలా ఉండాలని సినిమాను ప్రారంభించారు. రామారావుగారు ఒక చరిత్రను సృష్టించారు. చరిత్రలో నిలిచిపోతారు. చరిత్రను రాయడం, సినిమాగా తీయడం, చరిత్రను చెప్పడం ఎంతో అవసరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని తండ్రి పాత్రను మళ్లీ సజీవంగా మనకు చూపించడానికి కుమారుడు చేస్తున్న ఈ ప్రయత్నం దేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి దారి చూపిస్తుంది. సినిమా శక్తివంతమైన సాధనం. మనుషులపై ప్రభావం చూపిస్తుంది. సమాజంలో మార్పులను తీసుకొస్తుంది. అటువంటి వ్యక్తి జీవితాన్ని సినిమా చేస్తుండటం గొప్ప విషయం. ఎన్టీఆర్‌గారు నటనలో, రాజకీయాల్లో, తెలుగు భాషలో చరిత్ర సృష్టించారు. చాలా మంది మనలో శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని చూడలేదు. వాళ్లెలా ఉంటారంటే మనకు తక్షణం గుర్తుకు వచ్చేది ఎన్టీఆర్‌గారే. ఎందుకంటే ఆయన భావాలు, వేషధారణ, డైలాగులతో తనదైన ముద్ర వేశారు. ఆయన చూపిన బాటను తెలుగువారు గుర్తు పెట్టుకోవాలి. తెలుగు భాష మన మాతృభాష. మన మధురమైన భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రామారావుగారు తెలుగు భాషను ప్రేమించేవారు. ఆయన్ను మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారసత్వాలకు వ్యతిరేకమైన నేను.. మంచి ప్రతిభను కనపరిచినా, మంచి పనులు చేసినా ఆ వారసత్వాలను అభినందిస్తాను. బాలకృష్ణగారు, మిగిలిన కుటుంబ సభ్యులు అందరూ కొనసాగించడం అభినందనీయం. ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. రామారావుగారి అభిమాని కానివాడు సినిమా రంగంలో లేరు. ఎంతో మంది అనుభవజ్ఞులున్న పనిచేస్తున్న ఈ సినిమా బాగా రావడం కాదు.. చరిత్ర గుర్తు పెట్టుకునే విధంగా, రామారావుగారు చరిత్రలో ఎలా నిలిచిపోయారో.. అలాగే సినిమా కూడా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాను చూస్తే ఆయన గురించి తెలియని వారికి కూడా పూర్తిగా తెలిసేలా కళ్లకు కట్టినట్లు ఓ మ్యూజియంలా సినిమాను రూపొందించి.. చక్కటి సందేశాన్ని అందించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ - ''ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఎన్టీఆర్‌గారితో పనిచేసే అవకాశం రాదు. నా జీవితానికి బంగారు బాట వేసింది. స్వర్గీయ నందమూరి తారక రామారావుగారు. ఆయన బయోపిక్‌ చేస్తున్న బాలయ్య ధన్యుడు. దర్శకత్వం వహిస్తున్న తేజ అదృష్టవంతుడు. ఈ సినిమాలో ఒక్క షాట్‌ అయినా నేను రామారావుగారిని డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ - ''తెలుగువాడికి గుర్తింపు లేని సమయంలో మనం అంతా మదరాసీలమే. నార్త్‌ ఇండియాలో మనల్ని అలాగే పిలిచేవారు. మేం మదరాసీలము కాం. తెలుగువాళ్లమని గుర్తింపు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్‌గారు. తెలుగువాడి ఖ్యాతిని పతాక స్థాయికి తీసుకెళ్లిన నందమూరి వారికి, వారి కుటుం సభ్యులకు నా ధన్యవాదాలు. ఆయన చరిత్రను తెరపైకి తీసుకు రావడమే సాహసం. దానికి బాలయ్య మాత్రమే అర్హుడు అనే సంగతి వేరే చెప్పనక్కర్లేదు. అలాంటి సాహసం చేయగల దమ్మున్న వ్యక్తి కూడా బాలకృష్ణగారే. ఈ స్క్రిప్ట్‌ని రెండున్నరేళ్ల క్రితం కో ప్రొడ్యూసర్‌, నా స్నేహితుడు విష్ణు నాకు చెప్పాడు. బ్రహ్మాండంగా ఉంది. దీంట్లో బాలయ్యగారు తప్ప మరొకరు చేయలేరని ఆరోజు అనుకున్నాం. ఇది జరగుతుందని ఆరోజు అనుకోలేదు. ఈరోజు అది నిజమైంది. అవకాశం వచ్చింది. తేజ, బాలకృష్ణగారికి అభినందనలు'' అన్నారు.

చిత్ర దర్శకుడు తేజ మాట్లాడుతూ - ''నేను ఎన్టీఆర్‌గారికి పెద్ద అభిమానిని. ఆయన సినిమాను డైరెక్ట్‌ చేసే అవకాశం నాకు వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఈ సినిమాను నన్ను డైరెక్ట్‌ చేయమని అడిగితే... ఆయన రేంజ్‌కు నేను డైరెక్ట్‌ చేయలేనండి అంటే విష్ణుగారు మాత్రం తేజగారే కరెక్ట్‌ అన్నారు. నిజంగా చాలా అదృష్టం ఉంటే తప్ప ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ చేసే అవకాశం రాదు. వచ్చింది. బాగా చేయాలని ప్రయత్నిస్తునాను. ఏమైనా చిన్న తప్పులుంటే అభిమానులు క్షమించాలి. కానీ డెఫనెట్‌గా సినిమా బావుంటుంది. కథ బాగా వచ్చింది. బాలకృష్ణగారు బాగా చేస్తారు. జరిగిన కథ.... గొప్ప చరిత్ర. ఒక సినిమా సరిపోదు. ఆరు సినిమాలు చేయాలి. ఈ అరు సినిమాల కథను.. ఓ కథలోకి తేవడానికి సమయం పడుతుంది. చాలా బాగా వస్తుంది. దసరాకు రిలీజ్‌ చేయాలని అనుకుంటున్నాం. చూద్దాం'' అన్నారు.

నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ - ''తల్లి వల్ల బిడ్డకు శారీరక, మానసిక శుచి, శుభ్రతలు వస్తే.. తండ్రి వల్ల సంస్కారం,జ్ఞానం, ధర్మాధర్మ విచక్షణలు అబ్బుతాయి. వంశం వల్ల పరిపాలనా దక్షత, ఉదార హృదయం, దర్పం వంటివి వస్తాయి. అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు మన పుణ్యం వల్ల వస్తుంది. ఇవన్నీ ఇచ్చిన భగవంతుడికి నమస్కారాలు. ఎన్టీఆర్‌గారు నాకు తండ్రి కాదు.. దైవం. ఎన్టీఆర్‌ అనేది హృదయ స్పందన. పేదవారి గుండె చప్పుడు. తెలుగువారి గుండెచప్పుడు. ఆయన నా తండ్రే కాదు. మహానుభావుడు. నా దృష్టిలో మహానుభావుడు అంటే శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, మనకు ఒక నిలువెత్తు రూపం ఎన్టీఆర్‌గారు ఉన్నారు. ఎన్టీఆర్‌ అంటే నందమూరి తారక రామారావు కాదు. ఎన్‌ అంటే నటనాలయం. అందులో ఆయన నటనా సింహం. టి అంటే తారామండలంలో ధృవ తారకుడు. ఆర్‌ అంటే రాజర్షి, రాజకీయ దురంధరుడు, రమనీయ రమ్య కమనీయ గుణధాముడు. మహానుభావులకు చావు పుట్టుకలతో సంబంధం ఉండదు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీరుడు. తెలుగు వెలుగును ప్రపంచం నలుమూలాల వ్యాప్తి చేసిన వ్యక్తి. జాతీయ రాజకీయాల్లో కూడా ఎన్నో పార్టీలున్నాయంటే అది ఎన్టీఆర్‌ పెట్టిన బిక్ష. ఆయన ప్రవేశ పెట్టిన పథకాలను అనేక పార్టీలు అనుసరించి ప్రజల్లో మంచి పేరుని తెచ్చుకున్నాయి. ఆయన్ను తెలుగువారే కాదు.. యావత్‌ భారతదేశం గుర్తుంచుకోవాల్సిన వ్యక్తి. ఆయన పాత్రను మరొకరు చేయలేరు. ఆ అదృష్టం నాకు కలిగినందుకు ఆనందంగా ఉంది. విష్ణుగారు ఎన్టీఆర్‌గారి బయోపిక్‌ చేద్దామని ముందుకు వచ్చారు. మా కుటుంబ సభ్యులు అందరం కలిసి సినిమా చేసుకుంటామని నేను ఆయనతో అన్నాను. సాయికొర్రపాటిగారు కూడా ముందుకు వచ్చారు. ఆయన చరిత్రను సినిమాగా తీస్తే.. ఐదారు గంటలు వస్తుంది. కథ విషయంలో ఎటువంటి తొందర లేకుండా. భారతదేశం అంతా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అందరం స్క్రిప్ట్‌పైన కూర్చుని కష్టపడుతున్నాం. స్క్రిప్ట్‌ అద్భుతంగా వస్తుంది. ఈ సినిమాకు పిల్లర్స్‌గా ఎందరో సహకారం అందిస్తున్నారు. ఎన్నో విజయవంతమైన సినిమాలకు సంగీతం అందించిన కీరవాణిగారు..రైటర్స్‌ సాయిమాధవ్‌బుర్రా, స్టోరీ, స్క్రీన్‌ప్లేను శ్రీనాథ్‌గారు చూస్తున్నారు. పాతాళభైరవి సినిమా మార్చి 15న విడుదలైతే మార్చి 29కి సినిమా హిట్‌ టాక్‌ వచ్చేసి దక్షిణాదిన అప్పట్లోనే అత్యధిక ప్రింట్స్‌తో సినిమాను విడుదల చేశారు. ఆ సినిమాతో ఆయన మాస్‌ హీరో అయ్యారు. అలాగే లవకుశ మార్చి 29న విడుదలైంది. అలాగే నాన్నగారి తొలి కలర్‌ఫిలిం దేశోద్ధారకులు కూడా మార్చి 29న విడుదలవుతుంది. అలాగే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యింది. నా తొలి చిత్రం తాతమ్మకల సినిమాను ఇదే బ్యానర్‌లో చేశాను. ఇప్పుడు ఇన్నేళ్లకు ఇదే బ్యానర్‌పై నాన్నగారి సినిమాను ఆయన పాత్రలో నటిస్తూ చేస్తుండటం నా పూర్వజన్మ సుకృతం. మా తరం నటులు ఎప్పుడూ నటనతో ఏదో కొత్తదనాన్ని ఇవ్వాలనుకుంటుంటాం. తపనతో మరో ఇరవై యేళ్లు ఇలాగే నిలిచిపోతాం. తెలుగు సినిమాలోనే ప్రత్యేకత నాన్నగారితోనే మొదలైంది. నేను కూడా విభిన్నమైన సినిమాలు చేశాను. ఈ సందర్భంగా నా దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాన్నగారు ఏదో కొత్తగా చేయాలనుకుంటూ ఉంటారు. ఆయన వారసత్వం నాకు వచ్చింది. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకుల దేవుళ్లకు థాంక్స్‌'' అన్నారు.

సహ నిర్మాత విష్ణువర్దన్‌ ఇందూరి మాట్లాడుతూ - ''ఎన్టీఆర్‌గారి బయోపిక్‌లో మేం కూడా భాగం కావడం మా అదృష్టం. ఎన్టీఆర్‌ పేరు కాదు.. ఎమోషన్‌. రెండేళ్ల క్రితం నేషనల్‌ మీడియా చేసిన సర్వేలో ఇండియాలో అత్యధిక ప్రభావం చూపిన వ్యక్తులు ఎవరా అని ఆరా తీస్తే.. ఎన్టీఆర్‌గారు నెంబర్‌వన్‌లో నిలిచారు. ఎన్టీఆర్‌గారు మూడు క్యారెక్టర్స్‌ చేస్తూ, డైరెక్షన్‌ చేస్తూ 44 రోజుల్లోనే సినిమా చేశారు. ఇంత టెక్నాలజీ ఉన్నా.. ఆ రికార్డుని ఎవరూ బీట్‌ చేయలేరు. బాలకృష్ణగారు స్వంత నిర్మాణ సంస్థను స్టార్ట్‌ చేయాలని చాలారోజులుగా అనుకుంటున్న సమయంలో మేం వెళ్లి ఈ సినిమా కోసం ఆయన్ను కలిశాం. ఆయన కూడా నిర్మాణంలో భాగమైయారు. ఆయన నిర్మాతగా, మేం సహ నిర్మాతలుగా సినిమా చేయడం హ్యాపీగా ఉంది. సాధారణంగా సినిమాలను త్వరత్వరగా కంప్లీట్‌ చేసే బాలకృష్ణగారు ఈ స్క్రిప్ట్‌ కోసం ఏడాదిన్నర సమయం వెచ్చించారు. అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని ప్రామిస్‌ చేస్తున్నాం. దసరాకు ప్రేక్షకుల ముందుకు రావడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ - ''బాలకృష్ణగారు చరిత్రార్ధుడు. తేజ సహా మా యూనిట్‌ సభ్యులందరం ధన్యులమవుతున్నాం. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా సమయంలోఆయనతో అమూల్యమైన సమయాన్ని గడిపాం. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి'' అన్నారు.

డా.రాజశేఖర్‌ మాట్లాడుతూ - ''ఎం.జి.ఆర్‌గారు తమిళనాడులో ఎలాగో ఎన్‌.టి.ఆర్‌గారు అలాగ. ఎం.జి.ఆర్‌ గారితో మాట్లాడే భాగ్యం నాకు కలుగలేదు. కానీ ఇక్కడ ఎన్‌.టి.ఆర్‌గారితో కలిసి భోజనం చేసి.. ఆయన ప్రేమను పొందిన వ్యక్తుల్లో నేను ఒకడిని. ఆయనొక లెజెండ్‌. గ్రేట్‌ పర్సనాలిటీ. ఇప్పటి జనరేషన్‌కు ఆయన గురించి తెలియాలనే ఆయన బయోపిక్‌ను తీస్తున్నారు. ఇలాంటి బయోపిక్‌ చేయాలంటే బాలయ్యబాబుగారు మాత్రమే అర్హులు. బాలయ్య మనసులోకానీ, రూపంలోకానీ, ఎనర్జి అంతా రామారావుగారిలాగానే ఉంటుంది. బాలయ్యబాబుగారు ఓ తపస్సులా ఏ పనైనా చేస్తారు. తేజ వండర్‌ఫుల్‌ డైరెక్టర్‌. కచ్చితంగా కీరవాణిగారి మ్యూజిక్‌ గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు'' అన్నారు.

జీవిత మాట్లాడుతూ - ''డెఫనిష్‌ ఆఫ్‌ హ్యుమానిటీ అంటే నందమూరి తారక రామారావుగారి గురించో... నందమూరి బాలకృష్ణగారి గురించో చెప్పుకోవాలి. తేజ నా క్లాస్‌మేట్‌. తను ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడని తెలిసి గర్వంగా ఫీలవుతున్నాను. కీరవాణిగారు సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమాకు పనిచేస్తున్న పత్రి ఒక్కరూ ఎంతో అదృష్టం చేసుకున్నారు'' అన్నారు.

సాయిమాధవ్‌ బుర్రా మాట్లాడుతూ - ''నేను ఎలా బతకాలో, ఎలా నిలబడాలో, ఎలా కలబడాలో, జీవితానికి ఎలా ఎదురెళ్లాలో ఎన్టీఆర్‌గారి సినిమాలు చూసి నేర్చుకున్నాను. ఆయన లేకపోతే నేను లేను. నాలాంటి అభిమానులెందరో. ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాల వెనుక, ఒక జాతి, ఒక రాష్ట్రం, దేశం అంతా నడిచింది. ప్రపంచం అంతా విస్తుపోయి ఎన్టీఆర్‌ వైపు చూసింది. అలాంటి మహనీయుడి సినిమాకు నేను మాటలు రాస్తున్నాను. ఈజన్మకు నాకు అందిన తప:ఫలంగా భావిస్తున్నాను. ఈ అవకాశం నాకిచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్‌'' అన్నారు.

పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ - ''మా బ్రదర్స్‌కు ఓ గౌరవం వచ్చేలా చేసిన వ్యక్తి ఎన్టీఆర్‌. ఆయనతో 16ఏళ్ల ప్రయాణం చేశాం. మేం ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఆయన పార్టీ పెట్టేశారు. ఆయనతో పనిచేయలేమోనని అనుకుంటున్న తరుణంలో నా దేశం, మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలకు ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది. అలాగే బాలకృష్ణగారితో ఎన్నో హిట్‌ సినిమాలకు పనిచేశాం. బాలయ్యబాబులోని ధైర్యం ఆయన తండ్రి నుండి వచ్చిందే. ఆయన తండ్రి బయోపిక్‌ చేయడం ద్వారా తండ్రి రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరం వారు కూడా ఎన్టీఆర్‌ గొప్పతనం గురించి తెలసుకుంటారు'' అన్నారు.

టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ - ''బాలయ్యను చూస్తుంటే ఎన్టీఆర్‌గారిని చూస్తున్నట్లుంది. అద్భుతమైన నటుడు ఎన్టీఆర్‌గారు. రాముడెలా ఉంటాడు, శ్రీకృష్ణుడెలా ఉంటాడు.. శివుడు ఎలా ఉంటాడో అని ఎన్టీఆర్‌గారిని చూసే తెలుసుకుంటారు. భారతదేశం గర్వించే అందాల నటుడాయన. ఆయన జీవితం ఓ సంచలనం. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి'' అన్నారు.

 

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved