pizza
Andhra Pradesh and Telangana film chambers press meet
డిజ‌ట‌ల్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ల యాజ‌మాన్యాలు దిగొచ్చే వ‌ర‌కూ థియేట‌ర్లల‌లో సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌ను నిలిపివేస్తున్నాం: జెఏసీ చైర్మ‌న్ డి. సురేష్ బాబు
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

1 March 2018
Hyderabad

డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల తీరును నిరసిస్తూ రేపటి నుంచి ఐదు రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల బంద్‌ పాటించాలని ద‌క్షిణ భార‌త చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళలో థియేటర్లను బంద్‌ చేస్తున్నట్టు జెఏసీ ఛైర్మన్‌ డి.సురేష్‌బాబు గురువారం హైద‌రాబాద్ లో తెలిపారు. ఐదు రాష్ట్రాల నిర్మాతల మండలి సంయుక్తంగా ఈ జెఏసీ ఏర్పాటుచేసుకున్నామని ఆయన చెప్పారు. ఆంగ్ల సినిమాలకు వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు వసూలు చేయడంలేదని, డిజిటల్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు ప్రాంతీయ చిత్రాలకు వీపీఎఫ్‌ తగ్గించట్లేదన్నారు. వీపీఎఫ్‌ ధరలు సున్నాచేయడంలేదని అన్నారు. వాటిని తగ్గించే వరకు థియేటర్ల బంద్‌ కొనసాగుతుందని స్పష్టంచేశారు. ఇందుకోసం ఐదు రాష్ట్రాల్లోని నిర్మాతలు, పంపిణీదారులు కూడా మద్దతు ఇచ్చారని తెలిపారు. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ....

‘‘కేవలం వీపీఎఫ్‌ ధరలు ఎక్కువగా ఉండటమే కాదు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిసార్లు సినిమా థియేటర్లలో 20 నిమిషాల పాటు ప్రకటనలు వేస్తున్నారు. దీనివల్ల ప్రేక్షకుడు తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. సినిమాకు రావడమే ఇబ్బంది అనుకునే పరిస్థితుల్లో జనాలు అడ్వర్టైజ్‌మెంట్‌లను ఇష్టపడటం లేదు. ఇక జనాలకు ఇష్టమైన సినిమా ట్రైలర్‌లను వేయడానికి ఎక్కువ వసూలు చేస్తున్నారు. ఇలా పలు అంశాల విషయమై చర్చలు మొదలు పెట్టాం. ట్రైలర్లకు తక్కువ తీసుకునేందుకు వాళ్లు ఒప్పుకున్నారు. రేట్లు తగ్గించే విషయంతో సహా, పలు అంశాల విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల్లో రేపటి నుంచి సినిమా థియేటర్లు బంద్‌ చేస్తాం. తదుపరి జరిగే చర్చలను బట్టి ముందుకు వెళ్తాం. డిజిటల్‌ సర్వీసు ప్రొవైడర్లు ఏర్పాటు చేసిన కొన్నాళ్ల తర్వాత వర్చువల్‌ ప్రింట్‌ ఫీజు(వీపీఎఫ్‌)ను తీసేయాలి. అమెరికాలో అలాగే చేశారు. కానీ, ఇక్కడ ఇప్పటికీ వసూలు చేస్తున్నారు. అయితే దానిని ఎప్పుడు సున్నాకు తీసుకువస్తారని అడుగుతున్నాం. దానికీ వారి వద్ద నుంచి సమాధానం లేదు. ఇప్పటికైతే కొంత తగ్గించారు. ఇంకా తగ్గాల్సి ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో వీపీఎఫ్‌ రేటు అంతా ఒకటే ఉంది. ఉత్తరాదిలో కొన్ని చోట్ల ఎక్కువ ఉంది. మరికొన్ని చోట్ల తక్కువగా ఉంది. ఇంతకు ముందు మమూలు సౌండ్‌ టెక్నాలజీ ఉండేది. ఆ తర్వాత డీటీఎస్‌ వచ్చింది. దాన్ని ఎగ్జిబిటరే పెట్టుకున్నాడు. ఇప్పుడు ‘అట్మాస్‌’ అని వస్తోంది. అది కూడా ఎగ్జిబిటరే పెట్టుకున్నాడు. దానికి ప్రత్యేక ఛార్జీ వసూలు చేయలేదు. ప్రొజెక్షన్‌ సిస్టమ్‌ మాత్రం వేరెవరో కొత్త వాళ్లు వచ్చి, అది పెట్టేసి వాళ్లు డబ్బులు వసూలు చేయడం మొదలు పెట్టారు. ఒక థియేటర్లో సౌండ్‌, సినిమా ప్రొజెక్షన్‌, సీట్లు అన్ని థియేటర్‌ ఇవ్వాలి. అయితే ఇక్కడ ప్రొజెక్షన్‌ను విభజించి దానికి ప్రత్యేక ఛార్జీ వసూలు చేస్తున్నారు.’’

‘‘యూఎఫ్‌వో, క్యూబ్‌ వీళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రసాద్‌గారిది పీఎక్స్‌డీ అని ఉంది. ఇండస్ట్రీ ఏమంటే తాను దానికి కట్టుబడి ఉంటానని మాకు మాట ఇచ్చారు. ఇవి కాకుండా రాక్స్‌, అల్ట్రా, ప్రొవిజ్‌ చిన్న చిన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే, యూఎఫ్‌వో, క్యూబ్‌లకు 90శాతం వాటా ఉండటంతో వీళ్లతోనే ప్రధానంగా చర్చించాల్సి వస్తోంది.’’

‘‘మేము ఎవరినీ ఎంకరేజ్‌ చేయలేదు. కొత్తగా పోటీకి ఎవరైనా వస్తామంటే మాత్రం తప్పకుండా ప్రోత్సహిస్తాం.’’

‘‘సినిమాలను ఆపేయాలని మాకు ఎలాంటి దురుద్దేశం లేదు. సినిమా అనేది ఆపకుండా ఉండాలనేదే మా తపన. రేపు ఎవరైనా మాకు వెయ్యి ప్రొజెక్టర్లు, వెయ్యి సర్వర్లు ఇస్తే వెంటనే పెట్టేస్తాం. మాది సమ్మె కాదు. మంచి పరిస్థితుల్లో పనిచేయాలని అనుకుంటున్నాం. అందరికీ న్యాయం జరుగుతుంది. బంద్‌ చేయటం వల్ల కోల్పోయే నష్టం కన్నా, భవిష్యత్‌లో వచ్చే లాభమే ఎక్కువ. ప్రస్తుతం తెలుగు సినిమా వరకూ బంద్‌ ఉంటుంది. హిందీ, ఇంగ్లిష్‌ సినిమాల వాళ్లతో మాట్లాడతాం.’’

‘‘వాళ్లు ఒక వ్యాపారం మొదలు పెట్టారు. లాభాలు రావాలనే ప్రయత్నిస్తారు. మనం కూడా సినిమా తీస్తున్నాం. లాభం రావాలనే చూస్తాం. అది రెండు వైపులా ఉంటుంది. ఇంగ్లిష్‌ సినిమాకు లేని వీపీఎఫ్‌ తెలుగు సినిమాకు ఎందుకని మేము ప్రశ్నిస్తున్నాం. చిన్న సినిమాకు పెద్ద లాభం వచ్చేలా కూడా మాట్లాడుతున్నాం.’’

‘‘అగ్రిమెంట్‌ చేసుకున్నారుగా అనొచ్చు. అప్పుడేం జరిగిందంటే.. కొందరు ఎగ్జిబిటర్లు చూసీ చూడకుండా సంతకాలు చేసేశారు. ప్రొగ్రామింగ్‌ చేయడం వేరు.. పరికరాలు అమర్చడం వేరు. చాలా మంది ప్రొడ్యూసర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, స్టూడియో యజమానులుగా ఇలా పలు పాత్రలు పోషిస్తున్నారు. కేవలం నిర్మాతగా ఉండేవాళ్లు చాలా తక్కువ. డిస్ట్రిబ్యూటర్‌, ప్రొడ్యూసర్‌కు ఇలా ఎవరికి వారికి థియేటర్లు ఉన్నాయి. మనం న్యాయంగా ఉండాలి. ప్రొడ్యూసర్‌, డిస్ట్రిబ్యూటర్‌ కేవలం ప్రాసెసింగ్‌ ఫీజు మాత్రమే చెల్లిస్తారు. ఎగ్జిబిటర్స్‌ కూడా మా వాళ్లే.. వేరే పార్టీలా వచ్చి వేరే రేట్లు తీసుకుంటున్నారు. దాన్ని తీసేయమని కోరుతున్నాం.’’

‘‘మేమంతా చిత్ర పరిశ్రమలో భాగంగానే మాట్లాడతాం. చివరకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. గెలుపోటములనే సమస్య ఇక్కడ లేదు. అందరం కలిసి ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లాలి` అని ముగించారు.

ఈ స‌మావేశంలో జెఏసీ క‌న్వీన‌ర్ పి. కిర‌ణ్‌, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ సెక్ర‌ట‌రీ ముత్యాల రామ‌దాసు, డిజిట‌ల్ క‌మిటీ చైర్మ‌న్ దామోద‌ర్ ప్ర‌సాద్, సి. క‌ల్యాణ్‌, తెలంగాణ ఫిలిం ఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ త‌రుపున కె. ముర‌ళీ మోహ‌న్, ఏషియ‌న్ ఫిల్మ్స్ సునీల్ నారంగ్, ఆర్కే త‌దిత‌రులు పాల్గొన్నారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved