pizza
Venkaiah Naidu watches Om Namo Venkatesaya at Prasadlabs
తెలుగువారే కాదు... భారతీయులందరూ తప్పక చూడాల్సిన గొప్ప భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ` - కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు
You are at idlebrain.com > News > Functions
Follow Us

18 February 2017
Hyderaba
d

అక్కినేని నాగార్జున.. హాథీరామ్‌ బావాజీగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రం విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకుల్ని, వేంకటేశ్వరస్వామి భక్తుల్ని విశేషంగా అలరిస్తూ విజయపథంలో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా హైద‌రాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో కేంద్ర‌మంత్రి ఎం.వెంక‌య్య‌నాయుడు స్పెష‌ల్ షోను వీక్షించారు. అనంత‌రం కేంద్ర‌మంత్రి ఎం.వెంక‌య్య నాయుడు మీడియాతో మాట్లాడారు...

అద్భుత భక్తిరస చిత్రం
'ఓం నమో వేంకటేశాయ' వంటి అద్భుతమైన భక్తిరస చిత్రాన్ని చూడటం ఆనందంగా వుంది. కె.రాఘవేంద్రరావుగారు, అక్కినేని నాగార్జునగారు ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. కె.రాఘవేంద్రరావుగారి సృజనాత్మక శక్తి రమణీయం, కమనీయం. ఒక్కమాటలో చెప్పాలంటే మహాద్భుతాన్ని సృష్టించారు. నేటి తరానికి నాటి పూర్వగాథను తెలియజేశారు. ఇంతటి గొప్ప చిత్రాన్ని నిర్మించిన మహేష్‌రెడ్డిగారిని అభినందిస్తున్నాను. ఏడు కొండలు వెనుక వున్న కథను చక్కగా క్రోడీకరించి అందంగా మలిచారు. సినిమా చూస్తున్నంతసేపూ ఆద్యంతం ఆహ్లాదకరంగా వుంది.

ఆధునిక యుగంలో అందరూ బిజీగా వుంటున్నాం. భక్తిభావం తగ్గిపోతుంది. ఈ సమయంలో మనందరికీ జీవన రహసాన్ని తెలియజేసేలా 'ఓం నమో వేంకటేశాయ' చిత్రాన్ని మహేష్‌రెడ్డి, రాఘవేంద్రరావుగారు, నాగార్జునగారు మనకి అందించారు. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'శిరిడిసాయి' వంటి భక్తి రస చిత్రాన్ని కొత్త నాగార్జున్ని చూశాం. అలాగే 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో కూడా ఒక కొత్త నాగార్జున కనబడతారు. పాత్రకు సరిపోయేలా, అందులో ఒదిగిపోయి చక్కగా నటించారు. కె.రాఘవేంద్రరావుగారు తన సృజనాత్మక శక్తితో కలియుగంలో కూడా ఎవరూ వేలెత్తి చూపించలేని గొప్పగా వైకుంఠాన్ని క్రియేట్‌ చేశారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌. నేటి దర్శకులు ఇలాంటి సినిమాలను చూసి ఎలా తీయాలో తెలుసుకోవాలి. తెలుగువారే కాదు భారతీయులందరూ చూడాల్సిన గొప్ప భక్తి చిత్రం.

'లవకుశ' చూసినట్లు అనిపించింది
'ఓం నమో వేంకటేశాయ' సినిమాను చూస్తుంటే సీనియర్‌ ఎన్‌.టి.ఆర్‌గారు నటించిన 'లవకుశ' చిత్రం గుర్తుకొస్తుందని నేను నిర్మాత మహేష్‌రెడ్డికి చెప్పాను. సినిమా అంత బాగుంది. అందరూ వెంకటేశ్వర స్వామిని అందరూ బాలాజీ బాలాజీ అని పిలుస్తారు. ఆ పేరు ఎలా వచ్చిందని తెలియజేస్తూ సినిమాని చక్కగా తీశారు. వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన సౌరభ్‌ జైన్‌ అద్భుతంగా నటించాడు. అలాగే అనుష్క, జగపతిబాబు మంచి మంచి పాత్రల్లో నటించారు.

'ఓం నమో వేంకటేశాయ' వంటి సినిమాల్ని యువత తప్పనిసరిగా చూడాలి
సంపద అంటే భౌతికమైనదే కాదు.. ఆధ్యాత్మిక సంపద కూడా. ఆధ్యాత్మికత వల్ల మనలో ఎంతో వికాసం కలుగుతుంది. ఆధ్యాత్మిక సంపద, సంస్కృతి, వారసత్వం ఇవన్నీ మనదేశ సంపదలేనని ఈ చిత్రం ద్వారా మరోసారి రాఘవేంద్రరావుగారు తెలియజేశారు. ఆయన ఇలాంటి సినిమాల్ని మరెన్నింటినో చేస్తారని భావిస్తున్నాను. నేటి వేగవంతమైన కాలంలో అశాంతి, జుగుప్సా, విరక్తి కలుగుతున్నాయి. వీటన్నింటికీ దూరం కావాలంటే ఇలాంటి భక్తిరస చిత్రాలను యువత తప్పకుండా చూడాలి.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved